Carlos Alcaraz: వింబుల్డన్‌కు కొత్త రాజు.. జకోవిచ్‌ను ఓడించి టైటిల్ గెలుచుకున్న అల్కరాజ్.. 20 ఏళ్లకే చరిత్ర

ఆదివారం లండన్‌లో జరిగిన వింబుల్డన్ ఛాంపియన్‌షిప్స్ ఫైనల్‌లో 1-6, 7-6(6), 6-1, 3-6, 6-4 తేడాతో జకోవిచ్‌పై అల్కరాజ్ గెలిచాడు. తొలిసారి వింబుల్డన్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. వింబుల్డన్ టైటిల్ గెలిచిన మూడో అతిపిన్న వయస్కుడిగా అల్కరాజ్ నిలిచాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 17, 2023 | 10:23 AMLast Updated on: Jul 17, 2023 | 10:24 AM

Wimbledon 2023 Mens Final Carlos Alcaraz Wins First Wimbledon Title Against Novak Djokovics

Carlos Alcaraz: టెన్నిస్ క్రీడలో గొప్పగా చెప్పుకొనే వింబుల్డన్ చరిత్రలో కొత్త అధ్యాయం మొదలైంది. వింబుల్డన్ ఫైనల్‌లో లెజెండరీ ప్లేయర్, ఛాంపియన్ అయిన నోవాక్ జకోవిచ్‌‌ను స్పెయిన్‌కు చెందిన కార్లొస్ అల్కరాజ్ ఓడించి టైటిల్ గెలుచుకున్నాడు. సీనియర్ అయిన జకోవిచ్‌పై 20 ఏళ్ల అల్కరాజ్ అద్భుత విజయాన్ని అందుకుని కొత్త చరిత్ర సృష్టించాడు. ఆదివారం లండన్‌లో జరిగిన వింబుల్డన్ ఛాంపియన్‌షిప్స్ ఫైనల్‌లో 1-6, 7-6(6), 6-1, 3-6, 6-4 తేడాతో జకోవిచ్‌పై అల్కరాజ్ గెలిచాడు. తొలిసారి వింబుల్డన్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. వింబుల్డన్ టైటిల్ గెలిచిన మూడో అతిపిన్న వయస్కుడిగా అల్కరాజ్ నిలిచాడు.
హోరాహోరీగా మ్యాచ్
టెన్నిస్ ఆల్‌టైమ్ గ్రేట్స్‌లో ఒకరు నోవాక్ జకోవిచ్. ప్రస్తుతం నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు అల్కరాజ్. ఈ ఇద్దరూ ప్రస్తుత టెన్నిస్‌లో అత్యంత ప్రతిభావంతుల్లో ఒకరు. అందుకే ఇద్దరిమధ్య ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. ఐదు సెట్లుగా, దాదాపు 4 గంటలా 42 నిమిషాలపాటు ఈ మ్యాచ్ సాగింది. తొలిసెట్‌లో అల్కరాజ్ 1-6తో దారుణంగా ఓడిపోయాడు. ఆ తర్వాత పుంజుకున్న అల్కరాజ్ 7-6(6), 6-1, 3-6, 6-4 తేడాడో జోకోవిచ్‌ను ఓడించాడు. ఈ హోరాహోరీ ఫైనల్లో అల్కరాస్‌ 9 ఏస్‌లు, జొకో 2 ఏస్‌లు సంధించారు. ఈ మ్యాచ్ ప్రేక్షకులకు టెన్నిస్ మజాను అందించింది.
కంటతడి పెట్టుకున్న జకోవిచ్‌
యువ ఆటగాడి చేతిలో, ఫైనల్‌లో ఓడిపోవడం జకోవిచ్‌కు పెద్ద షాక్ ఇచ్చింది. మైదానంలో ఓటమి అనంతరం జకోవిచ్ కంటతడి పెట్టుకున్నాడు. కొన్నేళ్లుగా జకోవిచ్ విజయవంతంగా దూసుకెళ్తున్నాడు. 2018 నుంచి వరుసగా నాలుగుసార్లు జకోవిచ్ వింబుల్డన్ టైటిల్ గెలుచుకున్నాడు. వింబుల్డన్ టైటిల్ కూడా గెలిస్తే 24వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ కూడా దక్కేది. దీంతో మార్గరేట్ కోర్ట్ రికార్డును సమం చేసే అవకాశం దక్కేది. అలాగే అత్యధికంగా ఎనిమిదిసార్లు వింబుల్డన్ టైటిళ్లు గెలిచిన రోజర్ ఫెదరర్ రికార్డును కూడా సమం చేసేవాడు. ఈ ఒక్క టైటిల్ గెలిచుంటే ఆల్‌టైమ్ గ్రేట్స్‌లో ఒకడిగా నిలిచేవాడు. కానీ, వీటికి అల్కరాజ్ బ్రేక్ వేశాడు. జకోవిచ్ గ్రాండ్‌స్లామ్ ఫైనల్ చేరడం ఇది 35వ సారి. వింబుల్డన్ ఫైనల్ చేరడం తొమ్మిదోసారి. 2013లో లెజెండరీ ప్లేయర్ ఆండీ ముర్రే చేతిలో ఓడిపోయిన తర్వాత సెంటర్ కోర్టులో జరిగిన ఏ ఫైనల్‌లోనూ జకోవిచ్ ఓడిపోలేదు. ఇదే మొదటిసారి. జకోవిచ్ తొలి మేజర్ టైటిల్ గెలిచింది 2008లో. అప్పట్లో ఆస్ట్రేలియన్ టైటిల్ గెలుచుకున్నాడు. అప్పట్నుంచి జకోవిచ్ అనేక విజయాలు అందుకున్నాడు. అయితే, అతడికి రాఫెల్ నాదల్, రోజర్ ఫెదరర్, ఆండీ ముర్రే మాత్రమే పోటీ ఇచ్చారు. ఇప్పుడు మాత్రం అల్కరాజ్ షాకిచ్చాడు. గతంలో జకోవిచ్‌కంటే రాఫెల్ నాదల్, రోజర్ ఫెదరర్‌ ఎక్కువ విజయాలు అందుకున్నారు. అయితే, వారిలో ఫెదరర్ రిటైర్ అయ్యాడు. నాదల్ ఇంతకు ముందులా ఆడలేకపోతున్నాడు. దీంతో కొన్నేళ్లుగా జోకోవిచ్‌ హవానే సాగుతూ వచ్చింది. ఇప్పుడు దీనికి బ్రేక్ పడింది.
ఆల్‌టైమ్ గ్రేట్స్‌ సరసన చేరుతాడా..?
2002 నుంచి పురుషుల టెన్నిస్‌లో రోజర్ ఫెదరర్, రాఫెల్ నాదల్, నోవాక్ జకోవిచ్, ఆండీ ముర్రేదే హవా. వీరిలో రోజరల్ ఫెదరర్, రాఫెల్ నాదల్, నోవాక్ జకోవిచ్‌ను దిగ్గజ త్రయంగా చెప్పుకొంటారు. ఇన్నేళ్లలో ఈ నలుగురు తప్ప వింబుల్డన్ టైటిల్‌ను ఎవ్వరూ గెలవలేదు. ఇప్పుడు తొలిసారిగా అల్కరాజ్ వింబుల్డన్ టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించాడు. రెండు దశాబ్దాల తర్వాత తొలిసారిగా ఈ నలుగురు కాకుండా వింబుల్డన్ టైటిల్ గెలుచుకున్న ఆటగాడిగా నిలిచాడు అల్కరాజ్. గతంలో సిట్సిపాస్‌, సిన్నర్‌, రూడ్‌ వంటి ఆటగాళ్లు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలుచుకున్నా అవి దిగ్గజ త్రయంగా చెప్పుకొనే రోజరల్ ఫెదరర్, రాఫెల్ నాదల్, నోవాక్ జకోవిచ్‌పై మాత్రం గెలిచినవి కాదు. అందువల్లే వారిలో ఒకరైన జకోవిచ్‌ను ఓడించి మరీ వింబుల్డన్ టైటిల్ నెగ్గిన అల్కరాజ్ ప్రత్యేకంగా నిలిచాడు. గత ఏడాది అల్కరాజ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ కూడా గెలుచుకున్నాడు. ఈ ఏడాది మాత్రం ఫ్రెంచ్ ఓపెన్ సెమీ ఫైనల్లో నోవాక్ జకోవిచ్ చేతిలో కార్లోస్ అల్కరాజ్ ఓడిపోయాడు. ఇప్పుడు ఆ ఓటమికి అల్కరాజ్ బదులు తీర్చుకున్నట్లు అయింది. ప్రస్తుతం అల్కరాజ్ వయసు 20 ఏళ్లు మాత్రమే. ఆటగాడిగా అతడికి ఎంతో భవిష్యత్ ఉంది. ప్రస్తుతం అల్కరాజ్ నెంబర్ వన్ ర్యాంకులో కొనసాగుతున్నాడు. జకోవిచ్ వయసు 36. అందువల్ల అతడు మరీ ఎక్కువ కాలం టెన్నిస్ ఆడలేకపోవచ్చు. దీంతో భవిష్యత్తులో టెన్నిస్ గ్రేట్స్‌లో ఒకడిగా నిలిచే సత్తా అల్కరాజ్‌కు ఉందని క్రీడా విశ్లేషకుల అంచనా.