Wrestlers Protest: అనురాగ్ ఠాకూర్‌తో ముగిసిన రెజ్లర్ల భేటీ.. నిరసన ఈ నెల 15కు వాయిదా..?
తమపై వేధింపులకు పాల్పడ్డ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్ భూషన్ సింగ్‌పై చర్యలు తీసుకోవాలంటూ రెజ్లర్లు డిమాండ్ చేశారు. కాగా, జూన్ 15 లోపు ఈ అంశంపై విచారణ పూర్తవుతుందని, ఆ తర్వాత చార్జిషీటు దాఖలు చేస్తామని అనురాగ్ ఠాకూర్ హామీ ఇచ్చారు.
Wrestlers Protest: కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్‌తో బుధవారం ఢిల్లీలో జరిగిన రెజ్లర్ల భేటీ ముగిసింది. దాదాపు ఐదు గంటలపాటు వీరి మధ్య భేటీ జరిగింది. ప్రధానంగా ఐదు అంశాల్ని రెజ్లర్లు ప్రభుత్వం ముందు ఉంచారు. తమపై వేధింపులకు పాల్పడ్డ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్ భూషన్ సింగ్‌పై చర్యలు తీసుకోవాలంటూ రెజ్లర్లు డిమాండ్ చేశారు.
కాగా, జూన్ 15 లోపు ఈ అంశంపై విచారణ పూర్తవుతుందని, ఆ తర్వాత చార్జిషీటు దాఖలు చేస్తామని అనురాగ్ ఠాకూర్ హామీ ఇచ్చారు. ఇప్పటికే బ్రిజ్ భూషన్ సింగ్‌పై రెజ్లర్ల ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదైన సంగతి తెలిసిందే. రెజ్లర్లతో సమావేశం చాలా సానుకూలంగా జరిగిందని, మహిళ ఆధ్వర్యంలో అంతర్గత విచారణ కమిటీని ఏర్పాటు చేశామని ఠాకూర్ చెప్పారు. ఈ నెల 30లోగా రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు ఎన్నికలు జరుపుతామని, కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేస్తామని హామీ ఇచ్చారు. కాగా, నిరసనల సందర్భంగా తమపై పోలీసులు నమోదు చేసిన అన్ని ఎఫ్ఐఆర్‌లను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరినట్లు భజరంగ్ పునియా, సాక్షి మాలిక్ తెలిపారు. దీనికి మంత్రి అంగీకరించినట్లు వెల్లడించారు.
ఈ నెల 15 లోపు విచారణ పూర్తి చేస్తామని మంత్రి చెప్పిన నేపథ్యంలో తమ నిరసనను 15 తేదీ వరకు వాయిదా వేస్తున్నట్లు రెజ్లర్లు ప్రకటించారు. ఒకవేళ ఆలోపు చర్యలు తీసుకోకపోతే తమ నిరసనలను ఉధృతం చేస్తామని రెజ్లర్లు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అలాగే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలో బ్రిజ్ భూషన్ సింగ్‌తో సంబంధం ఉన్న ఏ ఒక్కరిని కూడా ఉంచొద్దని కోరినట్లు చెప్పారు. తమ నిరసనల విషయంలో తమకు మద్దతు ఇస్తున్న సంఘాలతో చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. బ్రిజ్ భూషన్ సింగ్‌పై ఆరోపణలు చేసిన వారి రక్షణకు చర్యలు తీసుకోవాల్సిందిగా రెజ్లర్లు కోరారు.
బ్రిజ్ భూషన్ సింగ్‌ను వెంటనే అరెస్టు చేయడంతోపాటు, అతడిని, అతడి కుటుంబ సభ్యుల్ని ఫెడరేషన్ నుంచి తొలగించడం, వాళ్లను రాష్ట్ర సంఘాల నుంచి కూడా తొలగించాలని రెజ్లర్లు డిమాండ్ చేశారు. మంత్రితో జరిగిన సమావేశంలో రెజ్లర్లతోపాటు రైతు సంఘం నేత రాకేశ్ టికాయత్ కూడా పాల్గొన్నారు.