Wrestlers Protest: రెజ్లర్స్ ఆందోళన వెనుక అసలు కారణమేంటి? ఇంత జరుగుతున్నా కేంద్రం స్పందించదా?
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తమను లైంగిక వేధింపులకు గురి చేశాడని పలువురు రెజ్లర్లు ఆరోపించారు. అతడిపై చర్యలు తీసుకోవాలని, అలాగే పదవి నుంచి తప్పించాలని వాళ్లు డిమాండ్ చేస్తున్నారు.
Wrestlers Protest: దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రెజ్లర్లు చేపట్టిన ఆందోళన సంచలనం కలిగిస్తోంది. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తమను లైంగిక వేధింపులకు గురి చేశాడని పలువురు రెజ్లర్లు ఆరోపించారు. అతడిపై చర్యలు తీసుకోవాలని, అలాగే పదవి నుంచి తప్పించాలని వాళ్లు డిమాండ్ చేస్తున్నారు. స్టార్ రెజ్లర్లు అయిన వినేశ్ ఫొగట్, సాక్షి మలిక్, బజ్‌రంగ్ పూనియా సహా పలువురు రెజ్లర్లు ఈ ఆందోళనలో పాల్గొంటున్నారు. దాదాపు నాలుగు నెలలుగా ఆందోళన సాగుతున్నా ఇప్పటికీ ఈ విషయంలో కేంద్రం సరిగ్గా స్పందించలేదు. పెద్దగా ఎవరూ దీనిపై స్పందించింది లేదు. కానీ, ఇప్పుడు క్రీడా రంగ ప్రముఖులు, రాజకీయ నేతలు తమ మద్దతు ప్రకటించారు. సుప్రీం కోర్టు కూడా ఈ అంశంపై తాజాగా స్పందించింది. ఇంతకీ ఈ వివాదానాకి అసలు కారణమేంటి? బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై ఎందుకీ ఆరోపణలు?
బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు మాత్రమే కాకుండా బీజేపీకి చెందిన ఎంపీ. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పదేళ్ల నుంచి డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. ఈ పదేళ్ల కాలంలో చాలా మంది మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించాడని క్రీడాకారులు ఆరోపిస్తున్నారు. అతడి వేధింపులకు గురైన వారిలో మైనర్లు కూడా ఉన్నారని చెబుతున్నారు. ఇన్నాళ్లూ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ వేధింపులు భరిస్తూ వచ్చిన రెజ్లర్లు.. ఇప్పుడు తమకు న్యాయం చేయాలని కోరుతూ గత జనవరి నుంచి ఆందోళనకు దిగారు.
రెజ్లర్లు వినేశ్ ఫొగట్, సాక్షి మలిక్, బజ్‌రంగ్ పూనియాసహా పలువురు రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద గత జనవరి 18న నిరసనకు దిగారు. వినేశ్ ఫొగట్ ప్రధానంగా బ్రిజ్ భూషణ్‌పై ఆరోపణలు చేయగా, మిగతా వాళ్లు తమ మద్దతు తెలిపారు. అతడు తమను లైంగికంగా వేధించినట్లు పది మంది మహిళా రెజ్లర్లు తనకు చెప్పారని వినేశ్ తెలిపింది. వేధింపులకు గురైన వారిలో ఒక మైనర్ కూడా ఉన్నట్లు, భద్రతా కారణాల వల్ల వారి వివరాలను గోప్యంగా ఉంచుతున్నట్లు ఆమె చెప్పింది. అతడు రెజ్లర్లను వేధింపులకు గురి చేయడమే కాకుండా ఆటను కూడా తప్పుదోవపట్టించాడని రెజ్లర్లు ఆరోపించారు. తాజాగా ఈ అంశంపై రెజ్లర్లు మాట్లాడుతూ తమను మానసికంగా వేధించారని, నిరసన తెలిపితే చంపేస్తామని బెదిరించినట్లు వెల్లడించారు. రెజ్లర్లు ఆందోళన మొదలుపెట్టి దాదాపు నాలుగు నెలలు గడుస్తుండగా, వీరి ఆందోళనకు ఇప్పుడు ప్రాధాన్యం లభించినట్లు కనిపిస్తోంది.
కొట్టిపారేసిన బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్
రెజ్లర్లు తనపై చేసిన ఆరోపణలను రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కొట్టిపారేశాడు. ఈ ఆరోపణల్లో ఎంత మాత్రం నిజం లేదన్నాడు. ఇప్పుడు తనను విమర్శిస్తున్న వాళ్లు గతంలో తనను పొగిడారని, వాళ్ల పెళ్లిళ్లకు కూడా ఆహ్వానించారని బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ గుర్తు చేశాడు. తన ప్రతిష్టను దెబ్బతీసేందుకే ఇదంతా చేస్తున్నారని ఆరోపించాడు. రెజ్లర్లు డిమాండ్ చేస్తున్నట్లు తాను పదవికి రాజీనామా చేస్తే తప్పు ఒప్పుకొన్నట్లేనని, అందువల్ల తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పాడు. కాగా, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ విచారణకైనా, పోలీసుల విచారణకైనా సహకరిస్తానని చెప్పాడు. ఈ ఆందోళన వెనుక కాంగ్రెస్ పార్టీ, కొంతమంది పారిశ్రామికవేత్తల హస్తం ఉండొచ్చని, రాజీనామా పెద్ద విషయం కాదని, కానీ, తాను ఏ తప్పూ చేయలేదన్నాడు. తన పదవీకాలం ముగిసిందని, అందువల్ల రాజీనామా చేయాల్సిన అవసరం లేదన్నాడు.
వివాదాస్పదంగా ప్రభుత్వ కమిటీ
రెజ్లర్ల ఆందోళన విషయంలో మొదట ప్రభుత్వం పెద్దగా స్పందించలేదు. తర్వాత క్రీడామంత్రిత్వ శాఖ స్పందించింది. ఈ ఆరోపణలపై నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు ఒక కమిటీ ఏర్పాటు చేసింది. మేరీకోమ్ చైర్‌పర్సన్‌గా, యోగేశ్వర్ దత్(రెజ్లర్), బబిత ఫోగట్(రెజ్లర్), తృప్తి ముర్గుండే(బ్యాడ్మింటన్), రాధికా శ్రీమన్, రాజేష్ రాజగోపాలన్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసింది. అయితే, ఈ కమిటీ ఏర్పాటు గురించి తమకు సరైన సమాచారం ఇవ్వలేదంటూ రెజ్లర్లు విమర్శించారు. పైగా తాము సూచించిన వ్యక్తులకు కమిటీలో ప్రాధాన్యం ఇవ్వలేదని ఆరోపించారు. దీంతో ఈ కమిటీ ఏర్పాటు వివాదాస్పదమైంది. మొదట నివేదిక సమర్పించడానికి నాలుగు వారాలు గడువిచ్చిన కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ తర్వాత ఈ గడువు పొడిగించింది.
ఏప్రిల్ మొదటి వారంలో ఈ కమిటీ తన నివేదిక అందజేసింది. అందులో ఏముందో ఇంకా వెల్లడికాలేదు. మరోవైపు ఈ అంశంపై విచారణ జరిపేందుకు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ) ఆధ్వర్యంలో ఏడుగురు సభ్యులతో కూడిన ఒక ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. అయితే, ఈ ప్యానెల్ విచారణకు క్రీడాకారులెవరూ హాజరుకాలేదు. కారణం.. కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన కమిటీలో ఉన్న కొందరు ఈ కమిటీలో కూడా ఉన్నారు. దీంతో ఈ విచారణ కమిటీలపై క్రీడాకారులకు ఎలాంటి విశ్వాసం లేకుండా పోయింది. ఈ విచారణలకు వాళ్లు హాజరుకాలేదు.
సుప్రీంకోర్టు ఆదేశాలతో కదలిక
కమిటీల విచారణపై నమ్మకం లేని రెజ్లర్లు మళ్లీ ఢిల్లీలో ఆందోళనకు దిగారు. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను అరెస్టు చేయాలని, పదవి నుంచి తొలగించాలని, ప్రస్తుతం ఉన్న కమిటీని రద్దు చేసి కొత్త కమిటీని ఎన్నుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. అలాగే ఢిల్లీలో పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. కానీ, అక్కడి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. చివరకు ఈ అంశంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ఏప్రిల్ 28న ఆదేశాలు జారీ చేశారు. దీంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అలాగే బాధితులకు భద్రత కల్పించాలని కోర్టు పోలీసుల్ని ఆదేశించింది.
కాగా, ఇది తమ మొదటి విజయంగా రెజ్లర్లు చెబుతున్నారు. అయితే, తమకు కావాల్సింది ఎఫ్ఐఆర్ నమోదు చేయడం కాదని, న్యాయం జరగాలని వాళ్లు డిమాండ్ చేస్తున్నారు. ఇంతకాలం వీరి ఆందోళనను పెద్దగా పట్టించుకోని రాజకీయ పక్షాలు, ఇతర క్రీడాకారులు ఇప్పుడు నెమ్మదిగా స్పందిస్తున్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ, కేటీఆర్, కల్వకుంట్ల కవిత సహా పలువురు రాజకీయ నేతలు రెజ్లర్లకు మద్దతుగా నిలుస్తున్నారు. అలాగే మరో అథ్లెట్ నీరజ్ చోప్రా, సానియా మీర్జా, నవజోత్ సింగ్ సిద్ధూ వంటి క్రీడాకారులు కూడా సోషల్ మీడియా వేదికగా రెజ్లర్లకు తమ మద్దతు ప్రకటించారు.