WTC ఫైనల్ రేస్ ఐదులో 4 గెలిస్తేనే ఛాన్స్

గత ఏడాది కాలంగా వరుస విజయాలు... ఫలితంగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్.. ఇంకేముంది ఫైనల్ బెర్త్ ఖాయమే అన్న అంచనాలు..ఇది మొన్నటి వరకూ భారత్ జట్టు పరిస్థితి... కానీ ఒక సిరీస్ వ్యవధిలోనే సీన్ మొత్తం రివర్సయింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 27, 2024 | 02:58 PMLast Updated on: Oct 27, 2024 | 2:58 PM

Wtc Final Race Chances Are If You Win 4 Out Of 5

గత ఏడాది కాలంగా వరుస విజయాలు… ఫలితంగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్.. ఇంకేముంది ఫైనల్ బెర్త్ ఖాయమే అన్న అంచనాలు..ఇది మొన్నటి వరకూ భారత్ జట్టు పరిస్థితి… కానీ ఒక సిరీస్ వ్యవధిలోనే సీన్ మొత్తం రివర్సయింది. బెంగళూరు వేదికగా తొలి టెస్ట్ ఓటమితో షాక్ తిన్న టీమిండియాకు ఇప్పుడు రెండో టెస్ట్ పరాజయంతో సిరీస్ కూడా చేజారిపోయింది. ఫలితంగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో గెలుపు శాతం భారీగానే తగ్గింది. తాజాగా పాయింట్ల పట్టికను చూస్తే భారత్ టాప్ ప్లేస్ లోనే కొనసాగుతోంది. అయితే వరుసగా రెండు టెస్టుల్లో ఓడిపోవడం విజయాల శాతంపై గట్టిగానే ఎఫెక్ట్ పడింది. బంగ్లాదేశ్ పై సిరీస్ గెలిచిన తర్వాత రోహిత్ సేన 68.82 గెలుపు శాతంతో ఉంది. అయితే ఇప్పుడు కివీస్ చేతిలో సిరీస్ కోల్పోవడంతో విజయాల శాతం 62.82కు పడిపోయింది. అంటే ఒక్క సిరీస్ ఓటమితో ఏకంగా ఆరు శాతం కోల్పోవాల్సి వచ్చింది.

ఇప్పుడు మనకూ, ఆస్ట్రేలియాకు మధ్య 0.32 శాతం మాత్రమే తేడా ఉంది. ఈ సీజన్ లో ఇంకా 6 టెస్టులు ఆడాల్సి ఉన్న మన జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే ఖచ్చితంగా నాలుగు గెలవాల్సిందే.. అంటే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కైవసం చేసుకోవాల్సిందే. ఆసీస్ గడ్డపై ఈ సారి ఐదు టెస్టులు ఆడనున్న భారత్ దానికంటే ముందు న్యూజిలాండ్ తో చివరి టెస్టులో విజయం సాధించాలి. ఒకవేళ ఈ సమీకరణాల్లో తేడా వస్తే మాత్రం ఇతర జట్ల మ్యాచ్ ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. అదే సమయంలో ఆసీస్ కు అవకాశాలు మరింత మెరుగయ్యాయి. ఈ సారి సొంతగడ్డపై కంగారూలు బలమైన జట్టుతోనే భారత్ తో సిరీస్ కు రెడీ అవుతున్నారు. దీంతో ఆసీస్ టూర్ అంత ఈజీగా ఉండబోదనేది స్పష్టంగా అర్థమవుతోంది.

మరోవైపు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ రేసులో నిలవాలనుకుంటున్న భారత్ కు కివీస్ తో జరిగే చివరి టెస్ట్ కూడా కీలకం కానుంది. ఈ మ్యాచ్ లో భారత్ ఓడినా లేక డ్రాగా ముగిసినా కూడా పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి పడిపోతుంది. ఒకవేళ ఆసీస్ టూర్ లో సిరీస్ చేజార్చుకుంటే ఇక డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు నుంచి రోహిత్ సేన పక్కకు తప్పుకున్నట్టే. ఎందుకంటే మిగిలిన జట్లలో శ్రీలంక, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, ఇంగ్లాండ్ జట్లకు అవకాశాలున్నాయి. తమ తమ సిరీస్ లలో ఆయా జట్లు ముందంజ వేస్తే రేస్ మరింత రసవత్తరంగా మారిపోవడం ఖాయం. ప్రస్తుతం ఆస్ట్రేలియా రెండో స్థానంలో ఉండగా… శ్రీలంక, న్యూజిలాండ్ , సౌతాఫ్రికా తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కివీస్ మూడో టెస్ట్ , తర్వాత ఆసీస్ టూర్ భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్తును డిసైడ్ చేయనున్నాయి.