కోచ్ గా నాకు ఛాన్స్ ఇవ్వండి వారందరి తాట తీస్తా
భారత మాజీ క్రికెటర్, ప్రపంచ కప్ హీరో యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ ఈ మధ్యకాలంలో తన వ్యాఖ్యలతో తరచుగా వార్తల్లో నిలుస్తున్నారు.

భారత మాజీ క్రికెటర్, ప్రపంచ కప్ హీరో యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ ఈ మధ్యకాలంలో తన వ్యాఖ్యలతో తరచుగా వార్తల్లో నిలుస్తున్నారు. ముక్కుసూటిగా మాట్లాడే మనస్తత్వం ఉన్న యోగరాజ్ సింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనని టీమిండియాకి కోచ్ గా నియమిస్తే తిరుగులేని శక్తిగా మారుస్తానని తెలిపారు. జట్టులోని ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను రక్షించి, వారికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇటీవల కాలంలో రోహిత్ ఫిట్ నెస్ పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచినప్పటకీ రోహిత్ ఫిట్ గా లేడని , కెప్టెన్ కాబట్టే జట్టులో ఉంటున్నాడంటూ కొందరు విమర్శలు గుప్పించారు.
ఈ విమర్శల నేపథ్యంలో యోగరాజ్ సింగ్ తన అభిప్రాయాలు పంచుకున్నారు. తనను భారత జట్టు కోచ్‌గా చేస్తే, ఈ ఆటగాళ్లనే ఉపయోగించి దీన్ని ఎప్పటికీ ఓడించలేని జట్టుగా మారుస్తానంటూ వ్యాఖ్యానించారు. వారి సామర్థ్యాలను ఎవరు బయటకు తీస్తారంటూ ప్రశ్నించారు. వాళ్లను జట్టు నుండి తొలగించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారనీ ఇది సరికాదన్నారు. వారు కష్టకాలంలో ఉన్నప్పుడు తాను మీతోనే ఉన్నానని పిల్లల్లాంటి వాళ్లకు చెప్పాలనుకుంటున్నట్టు యోగరాజ్ పేర్కొన్నారు.
రోహిత్ ఫిట్ నెస్ పై వచ్చిన విమర్శలకూ ఆయన జవాబిచ్చారు. వారిని రంజీ ట్రోఫీలో ఆడిద్దామనీ, లేదా రోహిత్ ను రోజు 20 కిలోమీటర్లు పరుగెత్తమని చెప్తానని వెల్లడించారు. ఇలాంటి నిర్ణయాలు ఇంకెవరూ తీసుకోలేకపోతున్నారని గుర్తు చేశారు. ఈ ఆటగాళ్ళు వజ్రాలతో సమానమని, వారిని తొలగించొద్దని కోరారు. తాను వారి తండ్రిలా ఉంటానన్న యోగరాజ్…. యువీకీ, ఇతరుల మధ్య ఎప్పుడూ తేడా చూపలేదన్నారు. ధోనీని కూడా ఏమి అనలేదనీ.. తప్పును తప్పే అని మాత్రమే చెబుతానంటూ గతంలో తాను చేసిన కొన్ని కామెంట్స్ కు వివరణ ఇచ్చారు.
కాగా రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత్ ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీలో గెలిచింది. గతేడాది టీ20 ప్రపంచకప్ నూ సొంతం చేసుకుంది. కానీ టెస్టుల్లో మాత్రం వరుసగా ఫెయిల్ అవుతోంది. 2024లో సొంతగడ్డపై న్యూజిలాండ్ తో టెస్టు సిరీస్ ను 0-3తో కోల్పోయింది. స్వదేశంలో తొలిసారి టెస్టు సిరీస్ లో వైట్ వాష్ కు గురై అవమానం పాలైంది. ఆ తర్వాత ఆస్ట్రేలియాలో బోర్డర్-గావస్కర్ సిరీస్ నూ కోల్పోయింది.
2024 టీ20 ప్రపంచకప్ విక్టరీ తర్వాత రోహిత్, విరాట్ కోహ్లి పొట్టి ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. వన్డేల్లో మాత్రం కొనసాగుతున్నారు. ఐపీఎల్ ముగిసిన తర్వాత టీమిండియా.. ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. అక్కడ 2007 నుంచి భారత్ టెస్టు సిరీస్ గెలవలేదు. ఈ సిరీస్ రోహిత్, కోహ్లికి పరీక్షగా నిలవనుంది.