ప్రిన్స్ జోరుకు అడ్డేది గిల్ రికార్డుల మోత
టీమిండియా ప్రిన్స్, యువ ఓపెనర్ శుభమన్ గిల్ అంతర్జాతీయ క్రికెట్ లో దుమ్మురేపుతున్నాడు. ముఖ్యంగా వన్డే ఫార్మాట్ లో పరుగుల వరద పారిస్తున్నాడు. ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ లో అదరగొట్టిన గిల్ ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీలోనూ ఫామ్ కంటిన్యూ చేస్తున్నాడు.

టీమిండియా ప్రిన్స్, యువ ఓపెనర్ శుభమన్ గిల్ అంతర్జాతీయ క్రికెట్ లో దుమ్మురేపుతున్నాడు. ముఖ్యంగా వన్డే ఫార్మాట్ లో పరుగుల వరద పారిస్తున్నాడు. ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ లో అదరగొట్టిన గిల్ ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీలోనూ ఫామ్ కంటిన్యూ చేస్తున్నాడు. బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో ఈ యువ ఓపెనర్ సెంచరీతో సత్తా చాటాడు. కీలక బ్యాటర్లు ఔటైన సమయంలో పరిస్థితులకు తగ్గట్టు ఆడి శతకం సాధించడమే కాదు జట్టును కూడా గెలిపించాడు. కెరీర్‌లో అతడికిది 8వ వన్డే సెంచరీ కాగా.. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఇదే తొలి శతకం కావడం విశేషం. అలానే కెరీర్ లో 8 వన్డే సెంచరీలు బాదిన ఫాస్టెస్ట్ ఇండియన్ క్రికెటర్ గా నిలిచాడు. అయితే ఈ సెంచరీ బాదడంతో గిల్ ఓ అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. రీసెంట్ గానే వరల్డ్ నెం.1 వన్డే బ్యాటర్ గా అవతరించిన అతడు.. తాజాగా దిగ్గజ క్రికెటర్ల సరసన చోటు సంపాదించుకున్నాడు.
శుభ్‌మన్ గిల్ ఈ సెంచరీ బాదడంతో.. ఛాంపియన్స్ ట్రోఫీ అరంగేట్రంలోనే శతకం బాదిన నాలుగో ప్లేయర్ గా నిలిచాడు. అంతకుముందు దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందుల్కర్, శిఖర్ ధావన్, మహ్మద్ కైఫ్ తమ ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్ లో సెంచరీలు బాదారు.ఛాంపియన్స్ ట్రోఫీ అరంగేట్రంలోనే బంగ్లాదేశ్ పై గిల్ శతకం బాదగా.. విరాట్ కోహ్లీ కూడా తన వరల్డ్ కప్ అరంగేట్ర మ్యాచ్ లో బంగ్లాదేశ్ పైనే సెంచరీ బాదటం విశేషం. కాగా, తాజా మ్యాచ్ లో గిల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కూడా అందుకున్నాడు. అతడు ఆడిన గత 4 వన్డే మ్యాచుల్లో 3 సార్లు ఈ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు.
కాగా ఈ మ్యాచ్ లో గిల్ బ్యాటింగ్ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. ఆరంభంలో కాస్త ఆచితూచి ఆడినా..ఆ తర్వాత వరుస బౌండరీలతో విరుచుకుపడ్డారు. తంజిమ్ హసన్ బౌలింగ్‌లో శుభ్‌మన్ గిల్ కొట్టిన పుల్ షాట్ సిక్సర్ ఈ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. కానీ పవర్ ప్లే అనంతరం భారత పరుగుల వేగం తగ్గింది. పిచ్ నెమ్మదిగా మారడంతో విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్ పరుగులు చేసేందుకు ఇబ్బంది పడ్డారు. కోహ్లీ, శ్రేయాస్ వెంటవెంటనే ఔటవడం కాస్త టెన్షన్ పెట్టినా గిల్ సహనంతో బ్యాటింగ్ చేశాడు. వన్డే ఫార్మాట్ కు తగ్గట్టుగానే సింగిల్స్ తీస్తూ చివరి వరకూ క్రీజులో ఉండి జట్టును గెలిపించాడు. ఈ మ్యాచ్ లో శుభ్‌మన్ గిల్ 129 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 101 రన్స్ తో నాటౌట్ గా నిలిచాడు. దీంతో భారత్ 46.3 ఓవర్లలో టార్గెట్ ను అందుకుంది.