TELANGANA BJP: బీసీని సీఎం చేస్తామన్న అమిత్ షా.. కేసీఆర్, కాంగ్రెస్‌పై విమర్శలు..!
ప్రస్తుతం బీసీలను ఆకట్టుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికి ప్రకటించిన జాబితాలో కూడా బీసీలకు ఎక్కువ సీట్లు కేటాయించింది. రాబోయే జాబితాలో కూడా వీలైనన్ని ఎక్కువ సీట్లు బీసీలకు ఇచ్చేలా ప్లాన్ చేస్తోంది.
TELANGANA BJP: తెలంగాణలో ఎన్నికల్లో గెలిచేందుకు ప్రతి అవకాశాన్ని వాడుకోవాలని బీజేపీ భావిస్తోంది. దీనిలో భాగంగా అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేస్తామని ప్రకటించింది. కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా శుక్రవారం ఈ ప్రకటన చేశారు. సూర్యాపేటలో జరిగిన బీజేపీ జనగర్జన సభలో అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. తాము అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని హామీ ఇచ్చారు.
“బీఆర్ఎస్ పార్టీ దళితులు, పేదల వ్యతిరేక పార్టీ. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తామని, దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామన్న సీఎం కేసీఆర్ హామీలు ఏమయ్యాయి? కేటీఆర్‌ను సీఎం చేయాలని కేసీఆర్ అనుకుంటున్నారు. రాహుల్ గాంధీని పీఎం చేయాలని సోనియా అనుకుంటున్నారు. బీజేపీ మాత్రం ప్రజలు, దేశం గురించి ఆలోచిస్తుంది. కుటుంబ పార్టీలు ఎప్పటికీ తెలంగాణను అభివృద్ధి చేయలేవు. తెలంగాణలో బీజేపీని గెలిపిస్తే సీఎంగా బీసీ వ్యక్తిని నియమిస్తాం. బీసీలకు బీఆర్ఎస్ సర్కార్ ఏం చేసింది..? గిరిజనుల అభివృద్ధి కోసం బీజేపీ కట్టుబడి ఉంది. ఇటీవలే మంజూరు చేసిన ట్రైబల్ వర్శిటీకి సమ్మక్క-సారక్క పేరు నిర్ణయించాం. ఈ ఘనత మోదీకే దక్కుతుంది. పేద వారి కోసం కేంద్ర ప్రభుత్వం నాలుగేళ్లుగా నెలకు 5 కిలోల చొప్పున ప్రతి వ్యక్తికి ఉచిత బియ్యం ఇస్తున్నాం. జల జీవన్ మిషన్ కింద గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు మంచి నీటిని అందిస్తున్నాం. తెలంగాణలో బీజేపీ పార్టీని గెలిపించండి” అని అమిత్ షా వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం బీసీలను ఆకట్టుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికి ప్రకటించిన జాబితాలో కూడా బీసీలకు ఎక్కువ సీట్లు కేటాయించింది. రాబోయే జాబితాలో కూడా వీలైనన్ని ఎక్కువ సీట్లు బీసీలకు ఇచ్చేలా ప్లాన్ చేస్తోంది. మరోవైపు కాంగ్రెస్ కూడా గతంలోకంటే ఈసారి బీసీలకు అధిక సీట్లు కేటాయించేందుకు ప్రయత్నిస్తోంది.