TELANGANA BJP: తెలంగాణ బీజేపీలో అసంతృప్తుల రచ్చ.. ఎన్నికల నాటికి కొంప మునగబోతోందా..?
క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే కమలం పార్టీలో.. టికెట్ల వ్యవహారం కలకలం సృష్టిస్తోంది. తొలి జాబితాలో సీనియర్ల పేర్లు లేకపోవడంతో చాలా మంది అలకపాన్పు ఎక్కుతున్నారు. ఫస్ట్ లిస్ట్‌లో తన పేరు లేకపోవడంపై సీనియర్ నేత, ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
TELANGANA BJP: బీజేపీ రిలీజ్ చేసిన ఫస్ట్ లిస్ట్.. పార్టీలో అసంతృప్తి జ్వాలలు రగిలిస్తోంది. టికెట్ ఆశించిన చాలా మంది నేతలు.. పార్టీకి ఎదురు తిరుగుతున్నారు. ఆవేదనతో అడ్జస్ట్ అవుతున్న వాళ్లు కొందరయితే.. బోరుమని కన్నీళ్లు పెట్టుకుంటున్న వాళ్లు ఇంకొందరు. క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే కమలం పార్టీలో.. టికెట్ల వ్యవహారం కలకలం సృష్టిస్తోంది. తొలి జాబితాలో సీనియర్ల పేర్లు లేకపోవడంతో చాలా మంది అలకపాన్పు ఎక్కుతున్నారు.
ఫస్ట్ లిస్ట్‌లో తన పేరు లేకపోవడంపై సీనియర్ నేత, ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డిని కలిసి తన ఆవేదన తెలియజేశారు. పటాన్‌చెరు టికెట్ నందీశ్వర్ గౌడ్‌కు కేటాయించడాన్ని కొంతమంది బీజేపీ నేతలు వ్యతిరేకిస్తున్నారు. పటాన్‌చెరు అభ్యర్థి విషయంలో పునరాలోచన చేయాలని పార్టీ నాయకత్వానికి నియోజకవర్గం పరిధిలోని 8మంది మండల, డివిజన్ బీజేపీ అధ్యక్షులు అల్టిమేటం జారీ చేశారు. ఇక వరంగల్ వెస్ట్ స్థానాన్ని ఆశించిన రాకేష్.. తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. టికెట్ రాకపోవడంతో కంటతడి పెట్టుకున్నారు. పార్టీలో యువతకు ప్రాధాన్యత లేదా అని ప్రశ్నించారు. రాకేష్ రెడ్డికి టికెట్ రాకపోవడంతో ఆయన అనుచరులు బోరున విలపించారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై సస్పెన్షన్ వేటు ఎత్తేసి.. మళ్లీ ఆయనకే టికెట్ కేటాయించడంతో ఆ స్థానాన్ని ఆశించిన విక్రమ్ గౌడ్ నిరాశకు గురయ్యారు. తనకు మరో నియోజకవర్గం నుంచైనా అవకాశం కల్పించాలని పార్టీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ముథోల్ టికెట్ దక్కకపోవడంతో నిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు రమాదేవి పార్టీకి రాజీనామా చేశారు. ముథోల్ టికెట్‌ను రామారావు పటేల్‌కు కేటాయించింది బీజేపీ.
కాంగ్రెస్ నుంచి రామారావ్ పటేల్.. ఈ మధ్యే బీజేపీలో చేరారు. టికెట్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్న రమాదేవి.. ఈ పరిణామాన్ని తట్టుకోలేకపోయారు. పార్టీ తనకు అన్యాయం చేసిందని కన్నీరుమున్నీరయ్యారు. రెండుసార్లు రెండవ స్థానంలో నిలిచిన తనను కాదని.. మూడో స్థానంలో ఉన్న వ్యక్తికి టికెట్ ఇవ్వడాన్ని రమాదేవి తప్పుబట్టారు. నర్సాపూర్, రామగుండం, ఆదిలాబాద్‌లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఆదిలాబాద్ టికెట్ పాయల్ శంకర్‌కు ఇవ్వడంపై అక్కడి బీజేపీ నేతల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. టికెట్ల విషయంలో పార్టీ నాయకత్వం అనుసరిస్తున్న తీరును చాలా మంది కమలం పార్టీ నేతలు తప్పుబడుతున్నారు.