TELANGANA ASSEMBLY ELECTIONS: కొడంగల్‌లో రేవంత్‌పై బ్రదర్ అనిల్ పోటీ..?
కాంగ్రెస్‌లో తన పార్టీని కలిపేందుకు వైటీపీ అధ్యక్షురాలు షర్మిల చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. ఢిల్లీ లెవల్‌లో పైరవీలు నడిపారు షర్మిల. ఐనా సరే వర్కౌట్ కాలేదు. దీంతో కాంగ్రెస్‌తో కలవకపోవడం మన అదృష్టమే అంటూ.. ఓ ఘాటు రియాక్షన్ ఇచ్చారు.
TELANGANA ASSEMBLY ELECTIONS: రాజకీయాల్లో ఇలా జరుగుతుందని ఊహిస్తే.. అది రాజకీయమే కాదు. థ్రిల్లర్ సినిమాకు ఏ మాత్రం తీసిపోకుండా మలుపులు కనిపిస్తుంటాయ్ పాలిటిక్స్‌లో..! తెలంగాణలోనూ అలాంటి పరిణామాలే కనిపిస్తున్నాయ్. ఎన్నికల షెడ్యూల్ కూడా రావడంతో.. పార్టీలన్నీ తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయ్. పొత్తుల ఎత్తులు వేస్తున్నాయ్. మిగతా పార్టీల సంగతి ఎలా ఉన్నా.. కాంగ్రెస్‌లో తన పార్టీని కలిపేందుకు వైటీపీ అధ్యక్షురాలు షర్మిల చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు.
ఢిల్లీ లెవల్‌లో పైరవీలు నడిపారు షర్మిల. ఐనా సరే వర్కౌట్ కాలేదు. దీంతో కాంగ్రెస్‌తో కలవకపోవడం మన అదృష్టమే అంటూ.. ఓ ఘాటు రియాక్షన్ ఇచ్చారు. కాంగ్రెస్‌లో వైటీపీ విలీనాన్ని రేవంత్ రెడ్డే అడ్డుకున్నారనే భావన షర్మిలతో పాటు ఆమె కుటుంబ సభ్యుల్లో ఉంది. దీంతో రేవంత్ మీద ప్రతీకారం వాళ్లంతా తీర్చుకునేందుకు రెడీ అవుతున్నారా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది. 119 నియోజకవర్గాల్లోనూ వైటీపీ నుంచి అభ్యర్థులను నిలుపుతామని చెప్పారు. తనతో పాటు తన తల్లి విజయమ్మ, భర్త అనిల్ కూడా అవసరం అయితే పోటీ చేస్తారని షర్మిల అన్నారు. తాను పాలేరు నుంచి పోటీ చేస్తానని షర్మిల ప్రకటించారు. విజయమ్మ సికింద్రాబాద్ స్థానం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. నిజంగా ఆ పార్టీకి అభ్యర్థులు ఉన్నారా.. లేదా.. అన్న సంగతి పక్కనపెడితే ఇప్పుడో విషయం మాత్రం పొలిటికల్ సర్కిల్స్‌లో తెగ చక్కర్లు కొడుతోంది. షర్మిల భర్త బ్రదర్ అనిల్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బ్రదర్ అనిల్ కొడంగల్‌లో పోటీ చేస్తారనే గుసగుసలు వినిపిస్తున్నాయ్. కాంగ్రెస్‌లో వైటీపీ విలీనానికి అడ్డుపడ్డాడని రేవంత్‌పై.. షర్మిల తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో రేవంత్‌ను ఆమె టార్గెట్ చేసినట్లు సమాచారం. రేవంత్‌పై వైటీపీ తరపున బ్రదర్ అనిల్ పోటీ చేస్తారని.. ఇప్పటికే కొడంగల్‌లో ఇందుకు సంబంధించిన కార్యాచరణ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. మరి ఇది నిజమా.. జస్ట్ ప్రచారంగానే మిగిలిపోతుందా అంటే.. కాలమే సమాధానం చెప్పాలి మరి.