Telangana Assembly Elections: బీఆర్ఎస్‌లోకి భారీ చేరికలు.. ప్లస్‌ అవుతుందా.. మైనస్సా..?

టికెట్ దక్కని నేతలంతా అసంతృప్తితో రగిలిపోతున్నారు. వాళ్లంతా.. కారు పార్టీ వైపు చూస్తున్నారు. కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించిన చాలామంది నేతలు.. రెండో లిస్టులో టికెట్ రాకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తూ బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలోకి జంప్ అవుతున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 30, 2023 | 02:46 PMLast Updated on: Oct 30, 2023 | 2:46 PM

Brs Focused On Joining Leaders Into Party Is It Plus Or Minus

Telangana Assembly Elections: ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయ్. జంపింగ్‌ జపాంగ్‌లు ఊపందుకున్నాయ్. టికెట్ ఆశపడి భంగపడిన నేతలంతా జెండాలు మార్చేస్తున్నారు. పార్టీ మార్పులు జోరుగా సాగుతున్నాయ్. వంద మంది అభ్యర్థులతో కాంగ్రెస్ ఇప్పటివరకు రెండు లిస్ట్‌లు రిలీజ్ చేసింది. చాలామంది ఆశావహులకు ఈ జాబితాల్లో నిరాశే మిగిలింది. టికెట్ దక్కని నేతలంతా అసంతృప్తితో రగిలిపోతున్నారు. వాళ్లంతా.. కారు పార్టీ వైపు చూస్తున్నారు. కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించిన చాలామంది నేతలు.. రెండో లిస్టులో టికెట్ రాకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తూ బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలోకి జంప్ అవుతున్నారు.

ఈ మధ్యకాలంలో బీఆర్ఎస్‌లోకి భారీ చేరికలు జరుగుతున్నాయ్. మల్కాజ్‌గిరిలో నందికంటి శ్రీధర్ నుంచి ఇప్పుడు నాగం జనార్దన్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి వరకు.. అందరినీ కారులోకి లాగేస్తున్నారు బీఆర్ఎస్‌ నేతలు. మరి ఈ జంపింగ్‌లు పార్టీకి ప్లస్ అవుతాయా మైనస్ అవుతాయా అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయ్. ఈ చేరికలు.. కారు పార్టీకి ఒకరకంగా మైనస్ అయ్యే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయ్. తెలంగాణ ఏర్పాటు తర్వాత కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పడిపోయింది. ఐతే ఈ ఎన్నికల్లోనే కాంగ్రెస్‌ కొత్త జోష్‌తో ముందుకు సాగుతోంది. కానీ, టికెట్లు కేటాయించే విషయంలో.. కొంతమంది నేతలు తమకు టికెట్ రాలేదు అనే అసంతృప్తితో ఉన్న సమయంలో.. బీఆర్ఎస్ నాయకులు వారి ఇంటికి వెళ్లి మరీ పదవులు ఆశ చూపి వారిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఐతే అభ్యర్థుల విషయంలో రకరకాల సర్వేలు చేయిస్తున్న కాంగ్రెస్‌.. గెలుపు గుర్రాలకే టికెట్ ఇస్తోంది. ఒకరికి టికెట్ రాలేదు అంటే.. వారు నియోజకవర్గంలో గెలిచే అవకాశం లేదు అని అర్థం వచ్చేలా సీట్ల కేటాయింపు కనిపిస్తోంది.

అలా టికెట్ దక్కని నేతలను.. అంటే కేడర్ సరిగా లేని నేతలను.. పార్టీలోకి ఆహ్వానించి బీఆర్ఎస్ తప్పు చేస్తుందనే చర్చ జరుగుతోంది. ఐతే చేరికల ద్వారా లాభాలు తప్ప నష్టాలు వచ్చేవి ఉండవు అనేది మరికొందరి ఆలోచన. కారు పార్టీకి ప్రతీ నియోజకవర్గంలో ఫిక్స్‌డ్‌ ఓటు బ్యాంక్ ఉంది. కొత్తగా వచ్చిన నేతలతో.. కొన్ని ఓట్లు కలిసి వస్తాయ్ తప్ప.. జరిగే నష్టం లేదు అని మరికొందరి వాదన. మరి ఏ అంచనా నిజం అవుతుందో.. చేరికలు ముంచుతాయా.. కాపాడుతాయా అని తేలాలంటే.. ఎన్నికలు అయ్యే వరకు వెయిట్‌ చేయాల్సిందే.