BRS : గ్రేటర్‌ మీదే బీఆర్ఎస్ ఆశలు.. హైదరాబాద్‌ ఆదుకుంటుందా..?

తెలంగాణ ఓటరు తీర్పు ఈవీఎంల్లో భద్రంగా ఉంది. ఆదివారం పెట్టెలు తెరవగానే.. ఐమ్యాక్స్‌ రేంజ్‌లో అన్ని పార్టీల సినిమా కనిపిస్తుంది. ఆలోపు ఎవరి ధీమా వారిది. ఎవరి లెక్కలు వారివి. జనం మాకే పట్టం కట్టారన్న ధీమాతో ఉన్నాయి కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌. ఎగ్జిట్‌ పోల్స్‌ను ఎవరికి వారు తమను అనుకూలంగా విశ్లేషించుకుంటున్నారు. ఈ క్రమంలో హ్యాట్రిక్‌ కొట్టాలన్న ఆశగా ఉన్న బీఆర్‌ఎస్‌.. అందుకు తురుపు ముక్కగా జీహెచ్‌ఎంసీని లెక్కేసుకుంటోందట. గ్రేటర్‌తో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఆధిక్యత సాధిస్తామని.. అదే తమను గెలుపు తీరాలకు చేరుస్తుందని నమ్ముతున్నారట గులాబీ నేతలు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 2, 2023 | 01:17 PMLast Updated on: Dec 02, 2023 | 1:17 PM

Brss Hopes Are Greater Than Yours Will Hyderabad Support You

తెలంగాణ ఓటరు తీర్పు ఈవీఎంల్లో భద్రంగా ఉంది. ఆదివారం పెట్టెలు తెరవగానే.. ఐమ్యాక్స్‌ రేంజ్‌లో అన్ని పార్టీల సినిమా కనిపిస్తుంది. ఆలోపు ఎవరి ధీమా వారిది. ఎవరి లెక్కలు వారివి. జనం మాకే పట్టం కట్టారన్న ధీమాతో ఉన్నాయి కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌. ఎగ్జిట్‌ పోల్స్‌ను ఎవరికి వారు తమను అనుకూలంగా విశ్లేషించుకుంటున్నారు. ఈ క్రమంలో హ్యాట్రిక్‌ కొట్టాలన్న ఆశగా ఉన్న బీఆర్‌ఎస్‌.. అందుకు తురుపు ముక్కగా జీహెచ్‌ఎంసీని లెక్కేసుకుంటోందట. గ్రేటర్‌తో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఆధిక్యత సాధిస్తామని.. అదే తమను గెలుపు తీరాలకు చేరుస్తుందని నమ్ముతున్నారట గులాబీ నేతలు.

2018 అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పూర్తి స్థాయిలో విపక్షాల మీద పైచేయి సాధించిన విషయాన్ని గుర్తు చేసుకుంటున్నాయట గులాబీ వర్గాలు. ఈ పరిధిలో చేసిన అభివృద్ధి పనుల దృష్ట్యా ఓటర్లు తిరిగి తమవైపే ఉంటారని లెక్కలేసుకుంటున్నట్టు తెలిసింది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలోని 24 ఎమ్మెల్యే స్థానాలకు గాను కేవలం మూడు సీట్లకే పరిమితం అయింది గులాబీ పార్టీ. ఐతే ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాలతో GHMC ఎన్నికల్లో పూర్తి పట్టు సాధించింది. అదే ఊపుతో 2018 ముందస్తు ఎన్నికల్లో మిత్రపక్షం MIMతో కలిపి 23స్థానాలను కైవసం చేసుకుంది బీఆర్‌ఎస్‌. బీజేపీ ఒక్క సీటుకే పరిమితం అయింది.

ఆ క్రమంలోనే ఇప్పుడు కూడా గ్రేటర్ హైదరాబాద్ లో తాము చేసిన అభివృద్ధి కలిసి వస్తుందని.. ఫలితాలను రిపీట్ చేస్తామని అంచనా వేస్తున్నాయట గులాబీ వర్గాలు. మొత్తం 119 సీట్లకుగాను.. 24 స్థానాలు గ్రేటర్ పరిధిలోనే ఉండడంతో.. ఇక్కడ మెజార్టీ సీట్లు గెలుచుకున్న పార్టీకి సర్కార్ ఏర్పాటు ఈజీ అన్న వాదనను వినిపిస్తున్నాయి బీఆర్‌ఎస్‌ వర్గాలు. గ్రేటర్‌లో ఓటింగ్ శాతం పెరగకపోవడంతో పాటు ప్రభుత్వ వ్యతిరేక ఓటు కూడా లేదని అంచనా వేస్తోందట పార్టీ. మొత్తంగా చూసుకుంటే.. గ్రేటర్ హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మీద బీఆర్‌ఎస్‌ గట్టి ఆశలే పెట్టుకున్నట్టు కనిపిస్తోందంటున్నారు పరిశీలకులు. మరి ఆ ఆశలు సజీవంగా ఉంటాయా లేక నిరాశే మిగులుతుందా అన్నది తేలాలంటే.. డిసెంబర్ 3వరకు ఆగాల్సిందే