CM KCR: తెలంగాణలో లక్ష్మీ దేవత తాండవమాడుతోంది.. చేర్యాలను రెవెన్యూ డివిజన్ చేస్తాం: సీఎం కేసీఆర్
పల్లాను గెలిపిస్తే చేర్యాలను రెవెన్యూ డివిజన్ చేస్తాం. జనగామకు నర్సింగ్, పారా మెడికల్ కాలేజీలు ఇస్తాం. ఉమ్మడి రాష్ట్రంలో జనగామ పరిస్థితి దారుణంగా ఉండేది. ఉద్యమ సమయంలో నేను ఏడ్చిన ప్రదేశాల్లో బచ్చన్నపేట ఒకటి. జనగామలో అన్ని అభివృద్ధి పనులు చేపడుతా.
CM KCR: తెలంగాణ పంటలతో కళకళలాడుతూ, లక్ష్మీ దేవత తాండవమాడుతోందన్నారు సీఎం కేసీఆర్. ఎమ్మెల్యేగా పల్లా రాజేశ్వర్ రెడ్డిని గెలిపిస్తే నెల రోజుల్లోగా చేర్యాలను రెవెన్యూ డివిజన్ చేస్తామన హామీ ఇచ్చారు కేసీఆర్. జనగామలో సోమవారం జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలకు పలు హామీలిచ్చారు. “పల్లాను గెలిపిస్తే చేర్యాలను రెవెన్యూ డివిజన్ చేస్తాం. జనగామకు నర్సింగ్, పారా మెడికల్ కాలేజీలు ఇస్తాం. ఉమ్మడి రాష్ట్రంలో జనగామ పరిస్థితి దారుణంగా ఉండేది. ఉద్యమ సమయంలో నేను ఏడ్చిన ప్రదేశాల్లో బచ్చన్నపేట ఒకటి. జనగామలో అన్ని అభివృద్ధి పనులు చేపడుతా. ఓటు.. మన తలరాతను, రాష్ట్రం దశాదిశను మారుస్తుంది.
జనగామ, భువనగిరిని గ్రోత్ కారిడార్లుగా అభివృద్ధి చేస్తున్నాం. మల్లన్న సాగర్ జనగామకు నెత్తిమీద కుండలా ఉంది. మల్లన్న సాగర్‌ను టపాస్ పల్లి రిజర్వాయర్‌కు లింకు చేస్తాం. జనగామ జిల్లాలో ఇక కరువు అనేదే ఉండదు. దేవాదుల ప్రాజెక్టు నుంచి ఎప్పుడు కావాలన్నా జనగామకు నీళ్లు వస్తాయి. 24 గంటలు కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో 24 గంటల కరెంట్ ఇస్తున్నారా..? ఇప్పుడు లక్ష్మీ దేవత తాండవం ఆడుతున్నట్లు ఊరూరా ధాన్యం రాశులు కనిపిస్తున్నాయి. ధరణిని తీసివేసే ప్రసక్తే లేదు. భూములపై రైతులకే అధికారం కల్పించాం. ధరణి పోర్టల్‌ను బంగాళాఖాతంలో వేస్తామన్న కాంగ్రెస్‌నే బంగాళాఖాతంలో పడేయాలి. కరెంట్ మూడు గంటలే ఇస్తామని మనసులో మాట బయటపెట్టారు. అందుకే ఏమరపాటుగా ఉండొద్దు, జాగ్రత్తగా ఓటు వేయాలి. ఓటు మన తల రాతలు మారుస్తుంది. బీసీలకు ఆర్థికసాయం, గృహలక్ష్మి పథకాలు నిరంతరం కొనసాగుతాయి. కేసీఆర్ బతికున్నంత వరకూ దళితబంధు కొనసాగుతుంది.
కుటుంబంలో ఎవరూ చనిపోయినా వారం రోజుల్లో బీమా డబ్బులు అందేలా చూస్తాం. మంచి, చెడు ఆలోచించి ఓటేయాలి. ఎన్నికల సమయంలోనే కనిపించే వారిని నమ్మొద్దు. ఎన్నికలు రాగానే కొందరు వచ్చి ఏదేదో చెబుతారు, ఆగం కావొద్దు. మార్చి తర్వాత తెల్ల రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం ఇస్తాం. ఎన్నికల తర్వాత మళ్లీ వస్తా. అన్ని పనులు చేస్తా. ముత్తిరెడ్డి విషయంలో చిన్నచిన్న ఇబ్బందులు రావడం వల్ల.. గెలిచే సీటు ఓడిపోవద్దని ఆయనకు టికెట్ ఇవ్వలేదు” అని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు.