CM KCR: ధరణి రద్దు చేస్తామన్న వారిని బంగాళాఖాతంలో కలపండి: సీఎం కేసీఆర్
ధరణి వల్ల రైతు బంధు, రైతు బీమా డబ్బులు నేరుగా బ్యాంకు ఖాతాలోకి వస్తున్నాయి. ధరణి రద్దు చేసి బంగాళాఖాతంలో విసిరేస్తామని రాహుల్ గాంధీ, భట్టి విక్రమార్క అంటున్నారు. అలాంటి వారినే తీసి బంగాళాఖాతంలో వేస్తాం. ధరణితో లాభాలే ఉన్నాయి కానీ నష్టాలు లేవు.
CM KCR: ధరణి తీసేసి బంగాళాఖాతంలో విసిరేస్తామని రాహుల్ గాంధీ అంటున్నారని, అలాంటివారిని బంగాళాఖాతంలో కలపాలన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. రాబోయే ఎన్నికల్లో పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే రైతు బంధుకు రాం రాం, దళిత బంధుకు జై భీం, కైలాసం వైకుంఠపాళి ఆటలో పెద్దపాము మింగినట్లు అవుతుందని కేసీఆర్ అన్నారు. మహబూబాబాద్, ఖమ్మం జిల్లా పాలేరుల్లో శుక్రవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు గుప్పించారు. ‘‘ధరణి వల్ల రైతు బంధు, రైతు బీమా డబ్బులు నేరుగా బ్యాంకు ఖాతాలోకి వస్తున్నాయి. ధరణి రద్దు చేసి బంగాళాఖాతంలో విసిరేస్తామని రాహుల్ గాంధీ, భట్టి విక్రమార్క అంటున్నారు. అలాంటి వారినే తీసి బంగాళాఖాతంలో వేస్తాం. ధరణితో లాభాలే ఉన్నాయి కానీ నష్టాలు లేవు. మీ భూమి మీద మీకే అధికారం బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టబెట్టింది. ధరణి పోతే పైరవీ కారులు, అధికారులు, లంచాల వ్యవహారం మొదటికొస్తాయి. పోడు సాగుదారులు అందరికీ పట్టాలు ఇచ్చాం. గతంలో వారిపై నమోదు చేసిన కేసులు మొత్తాన్ని మాఫీ చేశాం. తెలంగాణ వచ్చింది కాబట్టి మహబూబాబాద్ జిల్లా అయింది. ఇప్పుడు అభివృది ఫలితాలు కన్పిస్తున్నాయి. అకేరు, మున్నేరు నది పొడవునా నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. అద్భుతంగా పంటలు పండుతున్నాయి. మహబూబాబాద్‌లో ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి కళకళలాడుతున్నాయి. ప్రధానమంత్రి రాష్ట్రం గుజరాత్‌లో కూడా 24 గంటల కరెంటు లేదు.
వాళ్లు వచ్చి ఇక్కడ ధర్నాలు చేస్తున్నరు. నాడు ఎరువుల కోసం చెప్పులు లైన్లో పెట్టినం. నేడు పుష్కలంగా ఎరువులు దొరుకుతున్నాయి. ధాన్యం అమ్మితే నేరుగా బ్యాంకు ఖాతాలోకి డబ్బులు పడుతున్నయి. బీఆర్ఎస్ సర్కార్ వస్తే ఎటువంటి పైరవీలకు ఆస్కారం ఉండదు. పదేళ్ల నుంచి ప్రజారాజ్యం నడుస్తున్నది. రైతుబంధు పథకానికి శ్రీకారం చుడితే ప్రముఖ వ్యవసాయవేత్త ఎంఎస్ స్వామినాథనే ప్రశంసించారు. రైతు బంధు లాంటి పథకం ప్రపంచంలో ఎక్కడా లేదని యూఎన్‌ఓ కూడా భేష్ అన్నది. 24 గంటల ఉచిత కరెంటు వచ్చిన తర్వాత ఇవాళ రైతుల పరిస్థితి తారుమారైంది. వాళ్ల బ్యాంకు లోన్లు తీరిపోతున్నాయి. లోన్లు తీసుకునే అవసరం లేకుండా పోయింది. కల్తీ విత్తనాలు అమ్మిన వారిపై పీడీ యాక్ట్‌లు పెట్టి జైళ్లలో పెడుతున్నాం. బ్రహ్మాండమైన పంటలతో ఏకంగా 3 కోట్ల టన్నుల వరి ధాన్యం తెలంగాణలో పండుతుంది’’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.