BRS: ఇతర పార్టీల అసంతృప్తులపై బీఆర్ఎస్ వల.. అందరికీ పదవులు దక్కేనా..?

కాంగ్రెస్‌ నుంచి కొద్ది రోజుల క్రితమే పొన్నాల లక్ష్మయ్య బీఆర్ఎస్‌లో చేరారు. ఆ వెంటనే ఆ పార్టీ సీనియర్ నేత నాగం జనార్ధన్ రెడ్డిని కూడా బీఆర్ఎస్‌.. తమ పార్టీలో చేర్చుకుంది. ఇప్పుడు మరో అసంతృప్త నేత, పీజేఆర్ తనయుడు విష్ణు వర్ధన్ రెడ్డి కూడా బీఆర్ఎస్‌లో చేరడం ఖాయమైంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 30, 2023 | 06:47 PMLast Updated on: Oct 30, 2023 | 6:47 PM

Cm Kcr Focused On Joining Leaders Into Brs Leaders Will Benifit In Future

BRS: తెలంగాణ ఎన్నికల్లో గెలుపు కోసం బీఆర్ఎస్ అన్ని అస్త్రాల్ని వాడుకుంటోంది. ఇతర పార్టీల్లో ఉన్న అసంతృప్త నేతల్ని వరుసగా పార్టీలో చేర్చుకుంటోంది. కాంగ్రెస్ పార్టీలో టిక్కెట్లు దక్కని, గుర్తింపు లేని నేతల్ని పార్టీలోకి ఆహ్వానిస్తోంది. కాంగ్రెస్‌ నుంచి కొద్ది రోజుల క్రితమే పొన్నాల లక్ష్మయ్య బీఆర్ఎస్‌లో చేరారు. ఆ వెంటనే ఆ పార్టీ సీనియర్ నేత నాగం జనార్ధన్ రెడ్డిని కూడా బీఆర్ఎస్‌.. తమ పార్టీలో చేర్చుకుంది. ఇప్పుడు మరో అసంతృప్త నేత, పీజేఆర్ తనయుడు విష్ణు వర్ధన్ రెడ్డి కూడా బీఆర్ఎస్‌లో చేరడం ఖాయమైంది.

ఆయా నేతల్ని చేర్చుకునేందుకు బీఆర్ఎస్ అధిక ప్రాధాన్యం ఇస్తోంది. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ టిక్కెట్ దక్కకపోవడంతో మాజీ ఎమ్మెల్యే విష్ణువర్థన్ రెడ్డి అసంతృప్తికి గురైనట్లు తెలియగానే.. బీఆర్ఎస్ అలర్ట్ అయింది. మంత్రి హరీష్ రావు సోమవారం విష్ణువర్థన్ రెడ్డితో భేటీ అయ్యారు. విష్ణు ఇంటికి వెళ్లి బీఆర్ఎస్‌లో చేరాల్సిందిగా కోరారు. అంతకుముందు ఆదివారం విష్ణువర్థన్ రెడ్డి.. సీఎం కేసీఆర్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. దీంతో అధికారికంగా విష్ణువర్థన్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేరడమే మిగిలి ఉంది.ఇంకా కాంగ్రెస్‌లో టిక్కెట్ దక్కని మరికొందరు నేతలతోనూ బీఆర్ఎస్ సంప్రదింపులు జరుపుతోంది. రెబల్‌గా పోటీ చేయలేని నేతలకు బీఆర్ఎస్ మంచి ఆప్షన్‌గా కనిపిస్తోంది. ఆయా నేతలకు భవిష్యత్తులో మంచి స్థానం కల్పిస్తామని బీఆర్ఎస్ హామీ ఇస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల్ని ఖరారు చేసిన నేపథ్యంలో, ఆ పార్టీలో చేరుతున్న వారెవరికీ తాజా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం మాత్రం లేదు.

ఇప్పటికే ప్రకటించిన వారికి మద్దతు ఇచ్చి, వారి గెలుపు కోసం సహకరించాలి. కాగా, ఎన్నికల తర్వాత ఆయా నేతలకు బీఆర్ఎస్ ఎలాంటి ప్రాధాన్యం ఇస్తుంది అన్నది సందేహమే. ఇప్పటికే ఆ పార్టీలో చాలా చోట్ల టిక్కెట్ల కోసం పోటీ ఉంది. ఎప్పట్నుంచో ఉన్నవారికి సర్దుబాటు చేయడమే కష్టంగా ఉంది. అలాంటిది ప్రస్తుతం అవసరం కోసం పార్టీలో చేరిన వారికి, భవిష్యత్తులో పదవులు దక్కుతాయని చెప్పలేం. అధికార పార్టీ కాబట్టి, కొంత మంది నేతలకు మాత్రం మేలు జరిగే అవకాశం ఉంది.