KCR: కాంగ్రెస్‌కు ఝలక్ ఇచ్చేలా బీఆర్ఎస్ మేనిఫెస్టో.. కేసీఆర్ గుప్పించిన హామీలివే..!
రైతు బీమా తరహాలో తెల్ల రేషన్‌కార్డు దారులకు త్వరలో కేసీఆర్ బీమా పథకం తీసుకువస్తామని కేసీఆర్ ప్రకటించారు. కేసీఆర్ బీమాతో 93 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని వివరించారు. జూన్ నుంచి కేసీఆర్ బీమా పథకం అమలు చేస్తామని వివరించారు.
KCR: కేసీఆర్ ఆలోచనలను అందుకోవడం అంత ఈజీ కాదు. బీఆర్ఎస్ మేనిఫెస్టోతో అది మరోసారి నిరూపితమైంది! పదేళ్లలో ఏం చేశాం.. ఏం చేస్తున్నాం అని ప్రసంగం మొదలుపెట్టిన కేసీఆర్.. ఒక్కహామీతో అటెన్షన్ డ్రా చేశారు. అదే కేసీఆర్ బీమా. కాంగ్రెస్‌కు ఝలక్ ఇచ్చేలా ఈ హామీని కేసీఆర్ అనౌన్స్ చేశారనే చర్చ జరుగుతోంది. గతంలో మేనిఫెస్టోలో కల్యాణలక్ష్మిని ప్రకటించకపోయినా అమలు చేశామని.. రైతు బంధు మేనిఫెస్టోలో చేర్చలేదని.. అయినా అమలు చేశామని చెప్పారు కేసీఆర్.
ఆ తర్వాత ఒక్కో హామీని చెప్పుకొచ్చారు. రైతు బీమా తరహాలో తెల్ల రేషన్‌కార్డు దారులకు త్వరలో కేసీఆర్ బీమా పథకం తీసుకువస్తామని కేసీఆర్ ప్రకటించారు. కేసీఆర్ బీమాతో 93 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని వివరించారు. జూన్ నుంచి కేసీఆర్ బీమా పథకం అమలు చేస్తామని వివరించారు. తెలంగాణ అన్నపూర్ణ పథకం పేరుతో ప్రతి రేషన్‌కార్డుదారుడికి సన్న బియ్యం అందజేస్తామని.. ప్రభుత్వం ఏర్పడ్డ 6 నెలల్లోనే ఇచ్చే హామీలన్నింటిని అమలు పరుస్తామని చెప్పారు కేసీఆర్. సామాజిక పెన్షన్లను 5వేల రూపాయల వరకు పెంచుతామని హామీ ఇచ్చారు. దశలవారీగా పెన్షన్లు పెంచుతామని చెప్పారు. పెన్షన్లు ఏడాదికి 5వందలు పెంచుతూ వెళతామన్న కేసీఆర్.. ఏపీ సీఎం జగన్ పాలనపై ప్రశంసలు గుప్పించారు. ఇక అటు వికలాంగుల పెన్షన్ రూ.6వేల వరకు పెంచుతామన్న కేసీఆర్.. రైతు బంధు సాయం రూ.16 వేల వరకు పెంచుతామని చెప్పారు. సౌభాగ్యలక్ష్మి పేరుతో అర్హులైన మహిళలకు రూ.3 వేల భృతి ఇస్తామని.. అర్హులైన లబ్ధిదారులకు 4వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పారు.
అక్రిడేటెడ్ జర్నలిస్టులకు కూడా 4వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ హామీ ఇచ్చారు. ఇక అటు ఆరోగ్యశ్రీ పరిధి రూ.15 లక్షలకు పెంచుతామని చెప్పారు. జర్నలిస్టులకు కూడా ఆరోగ్యశ్రీ పరిధి రూ.15 లక్షల వరుకూ పెంచుతామని వివరించారు. కేసీఆర్ ఆరోగ్యరక్ష పేరుతో హెల్త్ స్కీమ్ ఏర్పాటు చేస్తామని, జర్నలిస్టులకు ఉద్యోగుల తరహాలో హెల్త్ స్కీమ్ అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అగ్రవర్ణ పేదలకు నియోజకవర్గానికి ఒక గురుకులం ఏర్పాటు చేస్తామన్న కేసీఆర్.. మహిళా స్వశక్తి గ్రూపులకు దశలవారీగా పక్కా భవనాలు నిర్మిస్తామని చెప్పారు.