CM KCR: కేసుల్లో మొదటి స్థానంలో సీఎం కేసీఆర్.. కోటీశ్వరులైన ఎమ్మెల్యేలు ఎంత మంది..?

సీఎం కేసీఆర్‌పై అత్యధికంగా 64 కేసులు నమోదయ్యాయి. అందులో ఐపీఎస్ సెక్షన్లు 37కాగా, ఇతర సెక్షన్లు 283 ఉన్నాయి. తెలంగాణలో కేసీఆర్ ఆదాయంలో 10వ స్థానంలో, అప్పుల్లో 9వ స్థానంలో ఉన్నారు. కేటీఆర్ ఆస్తుల్లో 9వ స్థానంలో, అప్పుల్లో 5వ స్థానంలో, ఆదాయంలో 4వ స్థానంలో ఉన్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 22, 2023 | 02:45 PMLast Updated on: Oct 22, 2023 | 2:46 PM

Cm Kcr Have Highest Cases In Cms Here Is The Details

CM KCR: దేశంలో ఉన్న సీఎంలలో కేసీఆర్ కేసులలో మొదటి స్థానంలో ఉన్నారని తాజా నివేదిక తేల్చింది. కేసీఆర్‌పై అత్యధికంగా 64 కేసులున్నాయి. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫామ్స్ (ఏడీఆర్) సేకరించిన సమాచారం ఆధారంగా తాజా నివేదిక వెల్లడించింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల సీఎంలు, ఎమ్మెల్యేలు, మంత్రులకు సంబంధించిన ఆస్తులు, కేసుల వివరాల్ని ఈ సంస్థ సేకరిస్తుంటుంది. ఏడీఆర్ తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం.. సీఎం కేసీఆర్‌పై అత్యధికంగా 64 కేసులు నమోదయ్యాయి. అందులో ఐపీఎస్ సెక్షన్లు 37కాగా, ఇతర సెక్షన్లు 283 ఉన్నాయి.

తెలంగాణలో కేసీఆర్ ఆదాయంలో 10వ స్థానంలో, అప్పుల్లో 9వ స్థానంలో ఉన్నారు. కేటీఆర్ ఆస్తుల్లో 9వ స్థానంలో, అప్పుల్లో 5వ స్థానంలో, ఆదాయంలో 4వ స్థానంలో ఉన్నారు. తెలంగాణలోని 118 మంది ఎమ్మెల్యేల్లో 72 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. వీరిలో 59 మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలున్నారు. మొత్తంగా 46 మంది ఎమ్మెల్యేలపై సీరియస్ క్రిమినల్ కేసులుండగా, అందులో 38 మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపైనే ఉన్నాయి. ఏడుగురు ఎమ్మెల్యేలపై హత్యానేరం కేసులు కూడా ఉన్నాయి. కోటీశ్వరులైన ఎమ్మెల్యేల్లో బీఆర్ఎస్ నుంచి 93 మంది, ఎంఐఎం నుంచి ఐదుగురు, కాంగ్రెస్ నుంచి నలుగురు ఉన్నారు. అత్యధిక ఆస్తులు కలిగిన వారిలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు మర్రి జనార్ధనరెడ్డి, ఉపేందర్ రెడ్డి, పి.శేఖర్ రెడ్డి మొదటి మూడు స్థానాల్లో ఉన్నారు. వివిధ రాష్ట్రాల్లోని మంత్రులపై క్రిమినల్ కేసులకు సంబంధించిన వివరాలివి. తమిళనాడులోని 28 మంది మంత్రులపై, పంజాబ్‌లోని 11 మంది మంత్రులపై, తెలంగాణలోని 13 మంది మంత్రులపై, బిహార్‌లోని 21 మంది మంత్రులపై క్రిమినల్ కేసులున్నాయి.

దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న మంత్రుల్లో 51 నుంచి 60 ఏళ్ల వయసున్న వాళ్లు 200 మంది, 61 నుంచి 70 ఏళ్ల వయసున్న వాళ్లు 143 మంది, 41 నుంచి 50 ఏళ్ల వయసున్న వాళ్లు 139 మంది ఉన్నారు. మొత్తం 558 మంది మంత్రులుగా ఉండగా, వీరిల 51 మంది మాత్రమే మహిళా మంత్రులున్నారు. హిమాచల్ ప్రదేశ్, మిజోరమ్, అరుణాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, ఢిల్లీ, నాగాలాండ్, గోవా, సిక్కిం, మేఘాలయ అసెంబ్లీల్లో ఒక్క మహిళా మంత్రి కూడా లేరు. అత్యధికంగా పశ్చిమబెంగాల్‌లో 8 మంది మహిళా మంత్రులు, ఒడిశా, యూపీలలో ఐదుగురు చొప్పున మహిళా మంత్రులున్నారు. 28 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని మొత్తం 567 మంత్రులకు గాను 558 మంత్రుల ఎన్నికల అఫిడవిట్‌ల ఆధారంగా ఈ నివేదిక తయారు చేసింది ఏడీఆర్.