CM KCR: ఎన్నికల రణక్షేత్రంలోకి కేసీఆర్.. 15న బీఆర్ఎస్ మేనిఫెస్టో విడుదల..!
ఈ నెల 15న తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ అభ్యర్థులతో సమావేశంకానున్నారు. ఈ సమావేశంలోనే ఎమ్మెల్యే అభ్యర్థులకు బీ ఫారాలను అందజేయనున్నారు. ఇక అదేరోజు పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను కూడా విడుదల చేయబోతున్నారు. ఆ రోజు నుంచే ఎన్నికల ప్రచారం ప్రారంభించబోతున్నారు.
CM KCR: అనారోగ్యం కారణంగా కొద్ది రోజులుగా ప్రజల మధ్యకు రాని కేసీఆర్.. త్వరలోనే ఎన్నికల రణక్షేత్రంలోకి దిగబోతున్నారు. ఈ నెల 15 నుంచి ప్రచారపర్వంలోకి దిగబోతున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ సోమవారం విడుదలైన సంగతి తెలిసిందే. ఎన్నికలకు మరో 50 రోజుల సమయం మాత్రమే ఉంది. అందుకే కేసీఆర్.. ఇక ప్రచారానికి తెరతీయబోతున్నారు. అనారోగ్యం నుంచి కోలుకుంటున్న కేసీఆర్.. పూర్తిస్థాయిలో రాజకీయాలపై దృష్టిపెట్టబోతున్నారు. ఈ నెల 15న తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ అభ్యర్థులతో సమావేశంకానున్నారు.
ఈ సమావేశంలోనే ఎమ్మెల్యే అభ్యర్థులకు బీ ఫారాలను అందజేయనున్నారు. ఇక అదేరోజు పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను కూడా విడుదల చేయబోతున్నారు. ఆ రోజు నుంచే ఎన్నికల ప్రచారం ప్రారంభించబోతున్నారు. అనారోగ్యం కారణంగా కొద్ది రోజులుగా బయటికి రాలేదు. వివిధ ప్రారంభోత్సవాలు, అధికారిక కార్యక్రమాలకు కూడా కేసీఆర్ హాజరుకాలేదు. దీంతో పార్టీ శ్రేణులు కొంత నిరాశకు గురయ్యాయి. ఆయన ఆరోగ్యంపై ఆందోళనకు గురయ్యాయి. అందులోనూ ఎన్నికల సమయంలో కేసీఆర్ అందుబాటులో ఉండకపోవడంతో నిరాశలో ఉన్న శ్రేణులకు కేటీఆర్, హరీష్ రావు జోష్ ఇచ్చారు. వరుస పర్యటనలతో పార్టీలో ఊపు తెచ్చే ప్రయత్నం చేశారు. ఇప్పుడు కేసీఆర్ రంగంలోకి దిగబోతుండటంతో తెలంగాణలో ఎన్నికల వేడి మరింత పెరగబోతుంది. 15న నాయకులకు బీఫారం అందజేసిన తర్వాత వారికి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేస్తారు. ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించిన నాటి నుంచి పూర్తిస్థాయిలో ప్రజల్లోకి వెళ్లబోతున్నారు. వరుస పర్యటనలు, కార్యక్రమాల్ని కేసీఆర్ నిర్ణయించారు.
ఈ నెల 15న హుస్నాబాద్ నియోజకవర్గంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. 16న జనగామ, భువనగిరి నియోజకవర్గ కేంద్రాల్లో జరిగే బహిరంగ సభలకు, 17న సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాల్లో జరిగే సభలకు హాజరవుతారు. అనంతరం 18న మధ్యాహ్నం 2 గంటలకు జడ్చర్ల నియోజకవర్గ కేంద్రంలో జరిగే సభకు, సాయంత్రం 4 గంటలకు మేడ్చల్‌లో జరిగే సభకు హాజరవుతారు. కేసీఆర్ నవంబర్ 9న గజ్వేల్, కామారెడ్డిలో నామినేషన్లు దాఖలు చేస్తారు. నామినేషన్‌కు ముందు ఆనవాయితీ ప్రకారం.. సిద్ధిపేట నియోజకవర్గంలోని కోనాయపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.