CM KCR: ఎమ్మెల్యే అభ్యర్థులకు కేసీఆర్ వార్నింగ్.. ప్రజల్లోనే ఉండాలని సూచన..!
మళ్లీ మనమే విజయం సాధిస్తున్నాం. అలా అని ఎవరూ తొందరపడొద్దు. రాజకీయాలన్న తర్వాత మంచి, చెడు ఉంటాయి. అలకలూ ఉంటాయి. అభ్యర్థులకు సంస్కారం ఉండాలి. మంచిగా మాట్లాడటం నేర్చుకోవాలి. అందరి కంటే ఎక్కువగా ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రజల్లో ఉండాలి.
CM KCR: ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థులు సంస్కారంతో ఉండాలని, మంచిగా మాట్లాడటం నేర్చుకోవాలని హితవు పలికారు తెలంగాణ సీఎం కేసీఆర్. హైదరాబాద్‌లో బీఆర్ఎస్ మేనిఫెస్టో ప్రకటించిన సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థులకు బీఫారాలు అందజేశారు. ఈ సందర్భంగా వారికి కీలక సూచనలు చేశారు. “మళ్లీ మనమే విజయం సాధిస్తున్నాం. అలా అని ఎవరూ తొందరపడొద్దు. రాజకీయాలన్న తర్వాత మంచి, చెడు ఉంటాయి. అలకలూ ఉంటాయి. అభ్యర్థులకు సంస్కారం ఉండాలి.
మంచిగా మాట్లాడటం నేర్చుకోవాలి. అందరి కంటే ఎక్కువగా ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రజల్లో ఉండాలి. ప్రతి చిన్న కార్యకర్తతో కూడా మాట్లాడే ప్రయత్నం చేయాలి. దీనిని ప్రతిఒక్కరు తప్పకుండా పాటించాలి. కార్యకర్తలకు మనల్ని అడిగే అధికారం ఉంటుంది. ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ముందుకు పోవాలి. గత ఎన్నికల సందర్భంగా వ్యక్తిత్వం మార్చుకోవాలని ఒకరిద్దరికి చెప్పాను. మాట్లాడలేదు. ఒకరు ఓడిపోయారు. జూపల్లి కృష్ణారావు ఒకాయన ఉండే.. మంత్రిగా పని చేశారు. ఆయన అహంకారంతో ఇతర నాయకులతో మాట్లాడలేదు. ఓడిపోయారు. అలా ఉంటది. ఒక మనిషితో మాట్లాడేందుకు అహంకారం ఎందుకు..? నాయకుడికి కొన్ని లక్షణాలు ఉండాలి. నాయకుల చిలిపి పనులు, చిల్లర పనుల వల్ల ఎన్నో కోల్పోతారు. సంస్కారవంతంగా ఉండాలి.
ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా మనవి చేస్తున్నా. ఇది చాలా ముఖ్యమైన ఘట్టం. కోపాలు తగ్గించుకోవాలి. ప్రతిదీ మనకే తెలుసు అనుకోవద్దు. తెలియని విషయాలు తెలుసుకోవాలి. పార్టీలోని అసంతృప్తులను బుజ్జగించే బాధ్యతను కూడా స్థానిక ఎమ్మెల్యేలే తీసుకోవాలి. బీఫామ్‌లు నింపే సమయంలో అభ్యర్థులు తప్పులు చేయొద్దు. అవసరమైతే ప్రత్యేక కాల్ సెంటర్‌ను సంప్రదించాలి. అలకలు పక్కనపెట్టాలి. అశ్రద్ధగా ఉండొద్దు” అని సూచించారు. ఆదివారం 51 మంది ఎమ్మెల్యే అభ్యర్థులకు బీఫారాలు అందజేశారు. మిగతా అభ్యర్థులకు రెండు రోజుల్లో బీఫారాలు అప్పగిస్తామన్నారు.