ASSEMBLY ELECTIONS: ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు.. కాంగ్రెస్ పరిస్థితి ఏంటి..?
ఇక కాంగ్రెస్ పని అయిపోయింది అనుకుంటున్న సమయంలో ఈ ఏడాది జరిగిన కర్ణాటక ఎన్నికలు ఆ కాంగ్రెస్‌కు ఊపునిచ్చాయి. అక్కడ అధికార బీజేపీని ఓడించి, కాంగ్రెస్ అధికారం దక్కించుకోవడంతో ఆ పార్టీకి తిరిగి ఊపిరొచ్చినట్లైంది. ఇదే జోష్‌తో ఇప్పుడు ముందుకెళ్తోంది.
ASSEMBLY ELECTIONS: ఐదు రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికల (ASSEMBLY ELECTIONS) షెడ్యూల్ సోమవారం విడుదలైన సంగతి తెలిసిందే. దీంతో ప్రాంతీయ పార్టీలతోపాటు బీజేపీ, కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీలన్నీ ఎన్నికలకు రెడీ అవుతున్నాయి. ఈ ఎన్నికలు వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలు బీజేపీతో పోలిస్తే.. కాంగ్రెస్ పార్టీకి చాలా కీలకం.
తొమ్మిదేళ్లుగా కేంద్రంలో కాంగ్రెస్ ప్రతిపక్షానికే పరిమితమైంది. ఇంతకాలం అధికారం లేకుంటే ఏ పార్టీ అయినా సహజంగానే బలహీన పడుతుంది. కాంగ్రెస్ కూడా అలాగే బలహీనపడుతూ వచ్చింది. తెలంగాణ విభజన తర్వాత తెలంగాణలో అధికారం దూరమైతే.. ఏపీలో ఉనికే కోల్పోయింది. ఇలా అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాల్ని నిలబెట్టుకోలేకపోయింది.
ఇక కాంగ్రెస్ పని అయిపోయింది అనుకుంటున్న సమయంలో ఈ ఏడాది జరిగిన కర్ణాటక ఎన్నికలు ఆ కాంగ్రెస్‌కు ఊపునిచ్చాయి. అక్కడ అధికార బీజేపీని ఓడించి, కాంగ్రెస్ అధికారం దక్కించుకోవడంతో ఆ పార్టీకి తిరిగి ఊపిరొచ్చినట్లైంది. ఇదే జోష్‌తో ఇప్పుడు ముందుకెళ్తోంది. ఈ నేపథ్యంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కనీసం మూడింట్లోనైనా గెలవడం కాంగ్రెస్‌కు చాలా ముఖ్యం. అందుకే ఈ ఎన్నికల్ని కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అన్ని రాష్ట్రాల్లో గెలుపు కోసం ప్రయత్నిస్తోంది. ఈ ఎన్నికల్లో సత్తా చాటడం ద్వారా పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఒకవేళ ఈ ఎన్నికల్లో సత్తా చాటలేకపోతే.. కాంగ్రెస్ పని ఖతం అనే వాదన మళ్లీ తెరపైకి వస్తుంది. ఈ నేపథ్యంలో తాజా సర్వేల ప్రకారం.. ఏ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందో అంచనా వేద్దాం.
తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ బలంగా ఉంది. అధికార బీఆర్ఎస్‌కు ధీటుగా సీట్లు తెచ్చుకోగల పార్టీగా మారింది. అధికారం దక్కుతుందా.. లేదా.. అనేది ఇప్పుడే చెప్పలేం కానీ.. రాబోయే ఎన్నికల్లో పోటీ బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే ఉంటుందనే అంచనా ఉంది. ఇక్కడ తెలంగాణ ఇచ్చిన పార్టీ అయినప్పటికీ.. తొమ్మిదేళ్లుగా అధికారంలో లేదు. ఈసారి మాత్రం అధికారం దక్కుతుందనే ధీమాతో ఉంది. రాజస్తాన్‌లో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉంది. అయితే, తిరిగి అధికారంలోకి వస్తుందా అంటే కచ్చితంగా చెప్పలేం. సర్వేల ప్రకారం.. బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు జరగనుంది. 50-50 అవకాశం ఉన్న నేపథ్యంలో రాజస్థాన్‌పై ప్రధానంగా దృష్టి సారించాలి. ఇక్కడ సీఎం అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ వర్గాల మధ్య ఉన్న పోరే పార్టీకి ఇబ్బందిగా మారింది. ఈ నేతలు విబేధాలు పక్కనబెట్టి, కలిసికట్టుగా పని చేస్తే విజయాకాశాలుంటాయి. అయితే బీజేపీలో కూడా అంతర్గత విభేదాలుండటం కాంగ్రెస్‌కు కలిసొచ్చే అంశం.
ఛత్తీస్‌గఢ్‌లో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంది. ఈసారి కూడా ఆ పార్టీయే అధికారం దక్కించుకుంటుందనే అంచనాలున్నాయి. మధ్యప్రదేశ్‌లో బీజేపీ అధికారంలో ఉంది. అయితే, ఆయన పనితీరుపై విమర్శలున్నాయి. బీజేపీ అధిష్టానం కూడా ఆయనను పక్కనబెట్టే అవకాశాలున్నాయి. అందుకే ఈ అంశాన్ని వాడుకుని కాంగ్రెస్ అక్కడ బలపడాలనుకుంటుంది. మధ్యప్రదేశ్‌లో గెలుపు అవకాశాలున్నాయి. ఈ అవకాశాల్ని ఎలా వాడుకుంటుంది అనే దానిపైనే విజయం ఆధారపడి ఉంటుంది. మిజోరంలో కాంగ్రెస్ పార్టీకి అంత అనుకూల పరిస్థితులు లేవు. అక్కడ హంగ్ వచ్చే అవకాశం ఉంది. అయితే, రెండో అతిపెద్ద పార్టీగా నిలిచే ఛాన్స్ ఉంది. మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్ఎఫ్)తో కలిపి కాంగ్రెస్ అధికారం చేపట్టవచ్చు.