TELANGANA ASSEMBLY ELECTIONS: తుమ్మల, పొంగులేటికి కాంగ్రెస్ ఆఫర్.. మరి దీనికి వీళ్లు ఒప్పుకుంటారా.. ?
ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం స్థానాన్ని సీపీఐకి అప్పగించేందుకు హస్తం పార్టీ సిద్ధం అయిందనే టాక్ వినిపిస్తోంది. ఐతే అదే కొత్తగూడెం స్థానం నుంచి పోటీ చేయాలని పొంగులేటి భావిస్తున్నారు. నిజానికి కాంగ్రెస్‌లో చేరడానికి ముందు ఆయన పెట్టిన కండిషన్ కూడా ఇదే..!
TELANGANA ASSEMBLY ELECTIONS: తెలంగాణలో ఎన్నికల నగారా మోగిన వేళ.. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ దూసుకుపోతుంటే.. కాంగ్రెస్ మాత్రం లిస్ట్ అనౌన్స్ చేయడానికి మల్లగుల్లాలు పడుతోంది. ఫ్యామిలీ పాలిటిక్స్ ఒకసారి.. పొత్తుల వ్యవహారం మరోసారి.. అసంతృప్తుల అలజడి ఇంకోసారి.. ఇలా పలు కారణాలతో కాంగ్రెస్ అడుగు ముందుకు పడడం లేదు ఇంకా! మిగతా స్థానాల సంగతి ఎలా ఉన్నా.. ఉమ్మడి ఖమ్మం జిల్లా మీదే ఇప్పుడు జనాల ఆసక్తి కనిపిస్తోంది. సీనియర్ నేతలు కాంగ్రెస్ గూటికి చేరడం.. అదే సమయంలో లెఫ్ట్ పార్టీలతో పొత్తులు తెరపైకి రావడంతో.. వివిధ స్థానాలపై ఆశలు పెట్టుకున్న వారి కల సాకారం అవుతుందా..? లేదా..? ఇలా రకరకాల చర్చ జరుగుతోంది.
లెఫ్ట్ పార్టీలతో పొత్తులో భాగంగా.. ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం స్థానాన్ని సీపీఐకి అప్పగించేందుకు హస్తం పార్టీ సిద్ధం అయిందనే టాక్ వినిపిస్తోంది. ఐతే అదే కొత్తగూడెం స్థానం నుంచి పోటీ చేయాలని పొంగులేటి భావిస్తున్నారు. నిజానికి కాంగ్రెస్‌లో చేరడానికి ముందు ఆయన పెట్టిన కండిషన్ కూడా ఇదే..! అలాంటి కొత్తగూడెం సీపీఐకి అప్పగిస్తే.. పొంగులేటి పరిస్థితి ఏంటి అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయ్. ఐతే కొత్తగూడెం తర్వాత పొంగులేటి ఆసక్తి చూపిస్తున్న మరో నియోజకవర్గం పాలేరు. ఇక్కడి నుంచి పోటీ చేయాలని తుమ్మల పట్టుదలతో ఉన్నారు. దీంతో హస్తం పార్టీ అధిష్టానం ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలోకి వెళ్లిపోయింది. సుధీర్ఘ ఆలోచనల తర్వాత.. ఫైనల్‌గా ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. తుమ్మల, పొంగులేటికి కాంగ్రెస్ ఓపెన్ ఆఫర్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. పాలేరు, ఖమ్మంలో ఎవరు పోటీ చేస్తారో మీరే తేల్చుకోండని హైకమాండ్ వీరికి చెప్పినట్లు సమాచారం. కొత్తగూడెం సీపీఐకి వెళ్లే చాన్స్ ఉంది. ఐతే ఇప్పుడు పాలేరుతో పాటు ఖమ్మం స్థానాలను ముందు పెట్టి.. మీ ఇద్దరికి ఈ స్థానాలు కేటాయిస్తాం. ఇద్దరిలో ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారో మీ ఇష్టం అన్నట్లుగా ఆఫర్ పెట్టినట్లు తెలుస్తోంది.
నిజానికి ఈ ఇద్దరు నేతలు పాలేరు నుంచి పోటీ చేయాలని ఆసక్తి చూపుతున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ కేడర్‌ను సమాయత్తం చేస్తున్నారు. పాలేరులో పొంగులేటి వర్గీయులు విస్తృతంగా పర్యటిస్తున్నారు. పాలేరుతోనే తన రాజకీయం ముడిపడిందంటూ తుమ్మల క్లియర్‌కట్‌గా చెప్తున్నారు. దీంతో పొంగులేటి, తుమ్మల అభ్యర్థిత్వం ఖరారు విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. పాలేరు, ఖమ్మం ఆప్షన్లను వాళ్ల ముందు పెట్టి.. పోటీచేసే స్థానంపై చర్చించుకుని ఏకాభిప్రాయం తెలపాలని హస్తం పార్టీ అధిష్టానం ఈ ఇద్దరికి సూచించినట్లు తెలుస్తోంది. ఇద్దరు భేటీ అయ్యారు. మరి ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు.. ఎలా ముందుకు వెళ్తారు అన్నది ఆసక్తికరంగా మారింది.