TELANGANA ASSEMBLY ELECTIONS: మైనంపల్లి చేరికతో కాంగ్రెస్‌లో కొత్త గొడవ.. హస్తానికి భారీ దెబ్బ పడబోతుందా..?

వారసత్వ టికెట్ల గొడవ కాంగ్రెస్‌ను మరింత వెంటాడుతోంది. ఒక కుటుంబానికి ఒక టికెట్ మాత్రమే అని.. ఉదయ్‌పూర్‌లో కాంగ్రెస్‌ పార్టీ తీర్మానం చేసింది. మిగతా రాష్ట్రాల సంగతి ఎలా ఉన్నా.. తెలంగాణలో అది వర్కౌట్ అయ్యే పరిస్థితి అసలు కనిపించడం లేదు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 10, 2023 | 03:11 PMLast Updated on: Oct 10, 2023 | 3:11 PM

Congress In Telangana Assembly Elections Facing Problem With Seniors

TELANGANA ASSEMBLY ELECTIONS: సరిగ్గా నెల రోజుల కిందటి ముచ్చట. 115 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తే.. కేసీఆర్‌ను చూసి జోకులు వేసుకున్నారు అంతా ! ఇంత ముందుగా అనౌన్స్ చేస్తే.. పార్టీలో గొడవలు పెరుగుతాయ్. అసంతృప్తులు ఎదురు తిరుగుతారు.. మొదటికే మోసం వస్తుందని ఎవరికి వారు లెక్కలేసుకున్నారు. కట్‌ చేస్తే తెలంగాణకు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. నవంబర్‌ 30న ఎన్నికలు. గట్టిగా లెక్క తీస్తే మరో 50 రోజులు కూడా లేదు టైమ్. కేసీఆర్‌ అప్పుడు తీసుకున్న నిర్ణయం వెనక వ్యూహం ఏంటో ఇప్పుడు అర్థం అవుతోంది అందరికీ !

బీఆర్ఎస్ సంగతి ఎలా ఉన్నా.. కాంగ్రెస్‌ అభ్యర్థుల జాబితాపై ఇంకా క్లారిటీ రాలేదు. అలకలు, అసంతృప్తులు, ఆరోపణలు.. మాములు రచ్చ జరగడం లేదు కాంగ్రెస్‌లో. ఇదే ఆ పార్టీని ఇబ్బంది పెడుతుంది అనుకుంటే.. వారసత్వ టికెట్ల గొడవ కాంగ్రెస్‌ను మరింత వెంటాడుతోంది. ఒక కుటుంబానికి ఒక టికెట్ మాత్రమే అని.. ఉదయ్‌పూర్‌లో కాంగ్రెస్‌ పార్టీ తీర్మానం చేసింది. మిగతా రాష్ట్రాల సంగతి ఎలా ఉన్నా.. తెలంగాణలో అది వర్కౌట్ అయ్యే పరిస్థితి అసలు కనిపించడం లేదు. బీఆర్ఎస్‌కు హ్యాండ్ ఇచ్చిన మైనంపల్లి.. తన కొడుక్కి కూడా టికెట్ హామీతో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఉదయ్‌పూర్‌ తీర్మానానికి చెక్‌ పడినట్లు అయింది. ఇక్కడితో ఆగితే అంతా బాగానే ఉండేది. ఇక్కడే అసలు ట్విస్ట్‌ కనిపిస్తోంది. మైనంపల్లి చేరికతో.. కాంగ్రెస్‌ పార్టీలో వారసత్వ టికెట్ల గొడవ పీక్స్‌కు చేరినట్లు కనిపిస్తోంది.

తనతో పాటు తన కొడుక్కి.. రెండు టిక్కెట్ల హామీతో మైనంపల్లి పార్టీలో చేరారు. ఐతే ఇప్పుడు పార్టీలోని సీనియర్లు కూడా.. తమకు, తమ వారసులకు టికెట్లు అడుగుతున్నారు. టీపీసీసీ మాజీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి.. తనతో పాటు తన భార్య పద్మావతికి టికెట్ అడుగుతుంటే.. జానారెడ్డి తాను ఎంపీగా పోటీ చేస్తూ తన ఇద్దరు కుమారులకు టికెట్లు అడుగుతున్నారు. మల్లు రవి తనతో పాటు తన కొడుకుకు టికెట్ కావాలని డిమాండ్‌ చేస్తుంటే.. కొండా మురళి కూడా తనతో పాటు తన భార్య సురేఖ, కూతురు సుస్మిత కోసం టికెట్లు కోరుతున్నారు. ఇక పీజేఆర్ కుటుంబం నుంచి విష్ణు, విజయ అడుగుతుంటే.. సీతక్క తనతో పాటు తన కొడుకు సూర్యకి టికెట్ డిమాండ్ చేస్తున్నారు. మాజీ ఎంపీ బలరాం నాయక్.. తనతో పాటు తన కొడుకు సాయిశంకర్ నాయక్‌కు టికెట్ అడుగుతున్నారు.

మల్‌రెడ్డి రంగారెడ్డి తన కొడుకు అభిషేక్‌రెడ్డి కోసం టికెట్‌ కోసం రిక్వెస్ట్ చేస్తున్నారు. దామోదర రాజనర్సింహ తనతో పాటు తన కూతురు త్రిషకు.. అంజన్ కుమార్ యాదవ్ తనతో పాటు తన కుమారుడు అనిల్ కుమార్ యాదవ్‌కు టికెట్ అడుగుతున్నారు. మైనంపల్లికి, అతని కొడుక్కి టికెట్ ఇచ్చి.. వీళ్లలో ఒక్కరిని డిజప్పాయింట్ చేసినా కాంగ్రెస్‌లో చీలికలు రావడం ఖాయం. అదే జరిగితే.. ఉత్సాహం కాస్త నీరుగారిపోతుంది. దీంతో ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది. డెసిషన్‌ కాస్త అటు ఇటు అయినా.. హస్తం పార్టీకి ఈ ఎన్నికల్లో భారీ దెబ్బ తగలడం ఖాయం అనే చర్చ జరుగుతోంది.