Assembly Elections : ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం.. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే..
ఎగ్జిట్ పోల్స్‌పై ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. నవంబర్ 7వ తేదీ ఉదయం 7 గంటల నుంచి నవంబర్ 30వ తేదీ సాయంత్రం 6.30 గంటల వరకు కొనసాగుతుంది.
Assembly Elections : ఎన్నికల వేళ రకరకాల సంస్థలు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేస్తుంటాయి. ఫలానా పార్టీ గెలవబోతుంది.. మరో పార్టీ ఓడిపోతుంది.. ఈ పార్టీకి ఇంత మెజారిటీ ఉంటుంది.. ఇలాంటి అంశాలతో ఎగ్జిట్ పోల్స్ విడుదలవుతుంటాయి. ఇవి కొంతమేర ఓటర్లపై ప్రభావం చూపే అవకాశం కూడా ఉంది. అందుకే ఇలాంటి ఎగ్జిట్ పోల్స్‌పై ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది.
ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. నవంబర్ 7వ తేదీ ఉదయం 7 గంటల నుంచి నవంబర్ 30వ తేదీ సాయంత్రం 6.30 గంటల వరకు కొనసాగుతుంది. అప్పటివరకు ఎలాంటి ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయకూడదు. అలాగే ఏ మీడియా సంస్థ, ఛానెల్, ప్రింట్ మీడియా కూడా ఎగ్జిట్ పోల్స్ నిర్వహించడం, ప్రసారం చేయడం, ప్రచురించడం కూడా చేయకూడదు. ఈ నెలలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయనే సంగతి తెలిసిందే. తెలంగాణతోపాటు ఛత్తీస్‌గఢ్, మిజోరాం, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో ఎన్నికలు జరుగుతాయి. ఛత్తీస్‌గఢ్‌లో నవంబర్ 7, 17న రెండు విడతల్లో, తెలంగాణలో నవంబర్ 30న, మిజోరంలో నవంబర్ 7న, మధ్యప్రదేశ్‌లో నవంబర్ 17న, రాజస్థాన్‌లో నవంబర్ 25న ఎన్నికలు జరుగుతాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికలు నవంబర్ 30తో ముగుస్తాయి.
డిసెంబర్ 3న అన్ని రాష్ట్రాల ఫలితాలు వెల్లడవుతాయి. ఎన్నికలు జరిగే మొదటి రోజు నుంచి పూర్తయ్యే చివరి రోజు వరకు ఎలాంటి ఎగ్జిట్ పోల్స్ ప్రసారం చేయకూడదు. ఒకవేళ ఎన్నికల సంఘం నిబంధనలు ఉల్లంఘించి, ఎగ్జిట్ పోల్స్ ప్రసారం చేస్తే.. రెండేళ్ళ వరకు జైలు శిక్ష లేదా జరిమానా.. కొన్నిసార్లు రెండూ విధించే అవకాశం ఉంది. నిజానికి ప్రస్తుతం వెల్లడవుతున్న సర్వేల్లో చాలా వరకు ఫేక్ ఉంటున్నాయి. ఎవరికి వాళ్లు సొంత సర్వేలు చేయించుకుంటూ, తమకు అనుకూలంగా ఫలితాలు ప్రకటించుకుంటున్నారు. అందువల్ల వీటిలో జనం ఏ సర్వేను నమ్మాలో తెలియడం లేదు. ఇప్పటికే విడుదలైన అనేక ఫలితాలు నమ్మశక్యంగా లేవని విశ్లేషకులు అంటున్నారు.