TELANGANA ASSEMBLY ELECTIONS: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హతలేంటో తెలుసా..? చట్టం ఏం చెబుతోంది..?
ఒక రాష్ట్రంలోని ఏ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్నా.. ఆ రాష్ట్రంలోని ఏదో ఒక నియోజకవర్గంలో ఓటు హక్కు కలిగి ఉండాలి. ఒక రాష్ట్రంలో ఓటు హక్కు ఉంటే.. మరో రాష్ట్రంలో ఎమ్మెల్యేగా పోటీ చేయడం కుదరదు.
TELANGANA ASSEMBLY ELECTIONS: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. వివిధ పార్టీల నుంచి అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. స్వతంత్ర అభ్యర్థులుగా వందలాది మంది బరిలో దిగబోతున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఎలాంటి అర్హతలుండాలి..? చట్టంలోని నిబంధనలేంటి..?
ఒక రాష్ట్రంలోని ఏ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్నా.. ఆ రాష్ట్రంలోని ఏదో ఒక నియోజకవర్గంలో ఓటు హక్కు కలిగి ఉండాలి. ఒక రాష్ట్రంలో ఓటు హక్కు ఉంటే.. మరో రాష్ట్రంలో ఎమ్మెల్యేగా పోటీ చేయడం కుదరదు. నామినేషన్ల పరిశీలన నాటికి.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల వయసు కచ్చితంగా 25 ఏళ్లు నిండి ఉండాలి. ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటు హక్కు ఉండి.. మరో నియోజకవర్గంలో పోటీ చేయాలనుకుంటే.. ఓటు హక్కుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రం సమర్పించాలి. జనరల్ స్థానం నుంచి ఎవరైనా పోటీ చేయొచ్చు. ఎస్సీ, ఎస్టీ రిజర్వ్‌డ్ స్థానాల నుంచి పోటీ చేసేవారు ఆయా సామాజిక వర్గాలకు చెందినవారై ఉండాలి. దీనికి సంబంధించిన కుల ధ్రువీకరణ పత్రం సమర్పించాలి. రిజర్వుడ్ కేటగిరీలకు చెందిన వాళ్లు జనరల్ స్థానం నుంచి కూడా పోటీ చేయొచ్చు.
ఏదైనా కేసులో దోషిగా తేలి, రెండేళ్లు జైలు శిక్ష అనుభవించి ఉంటే ఎన్నికల్లో పోటీకి అనర్హులు. దోషిగా తేలినప్పటికీ, శిక్ష ఖరారు కాకుండా, స్టే ఉంటే పోటీ చేయొచ్చు. అలాగే సర్వీసులో ఉండగా ప్రభుత్వ ఉద్యోగులు పోటీ చేయకూడదు. ఎన్నికల్లో పోటీ చేయాలంటే ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేయాలి. అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయాలనుకుంటే రూ. 10 వేలు సెక్యూరిటీ డిపాజిట్‌గా చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలకు ఇందులో రాయితీ ఉంటుంది కాబట్టి, వాళ్లు రూ.5 వేలు సెక్యూరిటీ డిపాజిట్ చెల్లిస్తే చాలు. పోలైన ఓట్లలో ఆరింట ఒక వంతు ఓట్లు సాధించిన వారికి డిపాజిట్లు తిరిగి ఇస్తారు. అలా సాధించని వారు డిపాజిట్లు కోల్పోతారు. గుర్తింపు పొందిన జాతీయ పార్టీ నుంచి లేదా రాష్ట్ర పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థులకైతే కనీసం ఒక ప్రపోజర్ ఉండాలి.
అదే స్వతంత్ర అభ్యర్థులకైతే కనీసం 10 మంది ప్రపోజర్లు ఉండాలి. భారత ఎన్నికల కమిషన్ దగ్గర రిజిస్టరైనా ఇంకా గుర్తింపులేని పార్టీల నుంచి పోటీ చేసే అభ్యర్థులకూ 10 మంది ప్రపోజర్లు ఉండాల్సిందే. నామినేషన్ సమయంలో నోటరీ చేసిన అఫిడవిట్ సమర్పించాలి. అందులో అభ్యర్థి ఆస్తులు, అప్పులు, కేసులు వంటి వివరాలూ ఉండాలి. భారతదేశ పౌరసత్వాన్ని ధృవీకరించే పత్రంతోపాటు, రాజ్యాంగానికి, భారత సార్వభౌమాధికారానికి కట్టుబడి ఉంటాననే ప్రమాణ పత్రం కూడా సమర్పించాలి. అలాగే రిటర్నింగ్ అధికారులు అడిగే ఇతర ధృవపత్రాల్ని కూడా సమర్పించాలి. ఒకటికంటే ఎక్కువ నామినేషన్లు దాఖలు చేయొచ్చు. వీటిలో ఏ ఒక్కటీ సరిగ్గా లేకపోయినా, తప్పుడు పత్రాలు సమర్పించినా.. నామినేషన్ తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది.