ASSEMBLY ELECTIONS: పోలీసులు మీ డబ్బులు పట్టుకున్నారా..? ఇలా వెనక్కి తీసుకోండి..!

నిబంధనల ప్రకారం రూ.50 వేలకు మించి నగదు తీసుకెళ్లేందుకు అనుమతి లేదు. అంతకంటే ఎక్కువ తీసుకెళితే.. దానికి తగిన ఆధారాలు చూపించాలి. లేకపోతే ‌సీజ్ చేసే అధికారం పోలీసులకు ఉంటుంది. క్యాష్‌ అయితే ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారో తెలిపే డాక్యుమెంట్స్ ఉండాలి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 3, 2023 | 08:21 PMLast Updated on: Nov 03, 2023 | 8:21 PM

How To Get Your Money Back Which Seased By Election Commission

ASSEMBLY ELECTIONS: ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికలు జరుగుతుండంతో.. నిబంధనల ప్రకారం రూ.50 వేలకు మించి నగదు తీసుకెళ్లేందుకు అనుమతి లేదు. అంతకంటే ఎక్కువ తీసుకెళితే.. దానికి తగిన ఆధారాలు చూపించాలి. లేకపోతే ‌సీజ్ చేసే అధికారం పోలీసులకు ఉంటుంది. క్యాష్‌ అయితే ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారో తెలిపే డాక్యుమెంట్స్ ఉండాలి. డబ్బులు ఏ బ్యాంకులో డ్రా చేశారో చూపించాలి. ఆ క్యాష్ ఎక్కడికి తీసుకెళ్తున్నారో ఆధారాలు చూపించాలి. ఒక సంస్థ నుంచి మరో సంస్థకు చెల్లింపులు చేస్తుంటే.. దానికి సంబంధించిన వివరాలు కూడా చూపించాలి.

వెండి, బంగారం అయితే బిల్లులు ఉండాలి. అలా చూపించలేకపోతే పోలీసులు లేదా ప్రభుత్వ అధికారులు సీజ్ చేస్తారు. సీజ్ చేసినప్పుడు ఆ వ్యక్తికి ఓ రసీదు ఇస్తారు. అందులో మీ దగ్గర ఎంత విలువైన వస్తువులు, డబ్బు సీజ్ చేశారు.. ఎక్కడ సీజ్ చేశారు లాంటి వివరాలు ఉంటాయి. దీనిపై జిల్లా స్థాయి నోడల్ అధికారి దగ్గర అప్పీల్‌ చేసుకోవచ్చు. ఆ రిసిప్ట్‌లో నోడల్ అధికారి పేరు, వివరాలు కూడా ఇస్తారు. సీజ్ చేస్తున్నప్పుడు ఆ ప్రక్రియ అంతా వీడియో తీస్తారు. మీ అమౌంట్ లేదా వెండి, బంగారం సీజ్ చేస్తే.. ఇచ్చిన రసీదు చూపించి జిల్లా స్థాయిలో అప్పీల్ చేసుకోవచ్చు. ప్రతి రోజూ జిల్లా స్థాయిలో గ్రీవెన్స్ కమిటీ సమావేశం అవ్వాలని ఎన్నికల సంఘం ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది. అప్పీళ్లపై ఈ గ్రీవెన్స్ కమిటీ విచారణ చేస్తుంది. తగిన రశీదులు సమర్పిస్తే.. లేదంటే ఎన్నికలతో సంబం‌ధం లేదని తేలితే.. ఆ డబ్బును తిరిగి వెనక్కి ఇస్తారు అధికారులు. ఆన్‌లైన్‌లో డబ్బులు పంపిస్తే ఏమవుతుందని కొందరికి అనుమానం ఉంటుంది.

అయితే ఫోన్ పే, గూగుల్ పేతో పాటు.. ఇతర UPI పేమెంట్స్‌లో లావాదేవీలు చేస్తే తెలిసేలా ప్రత్యేక వ్యవస్థను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. బ్యాంకులు, ఐటీ అధికారులు కలిసి ఇలాంటి ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్‌పై నిఘా పెడుతున్నారు. బ్యాంకు ఖాతాకు ఎక్కడి నుంచైనా ఎక్కువగా డబ్బు జమ అవుతుంటే.. సెంట్రల్ బ్యాంకింగ్ సిస్టమ్ ద్వారా ఐటీ డిపార్ట్‌మెంట్‌కి డేటా వస్తుంది. అవి ఎన్నికలకు సంబంధించినవా.. లేదా అన్నది ఐటీ శాఖ అధికారులు పరిశీలించి యాక్షన్ తీసుకుంటారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఓటర్లను ప్రలోభ పెట్టడాన్ని నియత్రించే చర్యల్లో భాగంగా ఇలాంటి నగదు, వస్తువులను సీజ్ చేసే నిబంధన తెచ్చింది ఎన్నికల కమిషన్. కానీ ఇది సామాన్యులకు ఇబ్బందికరంగా మారింది. కానీ ఆ డబ్బులకు, ఎన్నికలకు ఎలాంటి సంబంధం లేకుంటే.. జిల్లా గ్రీవెన్స్ కమిటీకి అప్లయ్ చేసి తిరిగి పొందడానికి ఛాన్సుంది.