Jalagam Venkat Rao: బీఆర్ఎస్‌కు షాక్.. కాంగ్రెస్‌లో చేరనున్న మాజీ ఎమ్మెల్యే జలగం..?
జిల్లాకు చెందిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు ఆ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారు. త్వరలో కాంగ్రెస్‌లో చేరబోతున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్‌కు చెందిన జలగం కొంతకాలంగా ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు.
Jalagam Venkat Rao: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్‌ఎస్‌కు షాక్ తగిలింది. జిల్లాకు చెందిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు ఆ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారు. త్వరలో కాంగ్రెస్‌లో చేరబోతున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్‌కు చెందిన జలగం కొంతకాలంగా ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు.
జలగం వెంకట్రావు తొలిసారిగా 2004లో సత్తుపల్లి నుంచి కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తర్వాత 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం నుంచి పోటీ చేసి గెలిచారు. అనంతరం 2018లో ఖమ్మం నుంచే పోటీ చేయగా, కాంగ్రెస్ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు చేతిలో ఓటమి పాలయ్యారు. తర్వాత వనమా బీఆర్ఎస్‌లో చేరిపోయారు. అయితే, మళ్లీ బీఆర్ఎస్ టిక్కెట్ తనకే దక్కుతుందని భావించారు. కానీ, బీఆర్ఎస్ వనమాకు టిక్కెట్ కేటాయించింది. అప్పటినుంచి పార్టీపై అసంతృప్తితో ఉన్న జలగం.. ఆ పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు.
తాజా సమాచారం ప్రకారం.. ఆయన కాంగ్రెస్‌లో చేరబోతున్నారు. రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారు. జలగం కోసం కాంగ్రెస్ పెద్దలతో కేవీపీ రామచంద్రరావు మంతనాలు జరిపారు. జలగం చేరికకు కాంగ్రెస్ అంగీకరించడంతో ఆయన కాంగ్రెస్‌లో చేరడం ఖాయమైంది. కాంగ్రెస్ తరఫున జలగం కొత్తగూడెం నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే అనేక మంది ఖమ్మం బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే. పొంగులేటి, తుమ్మల వంటి నేతలు కాంగ్రెస్లో చేరారు. ఇప్పుడు జలగం కూడా అదే పార్టీలో చేరుతున్నారు.
ఈ విషయంలో కాంగ్రెస్ బలపడుతుంటే.. ఖమ్మంలో బీఆర్ఎస్ బలహీనంగా మారుతోంది. అయితే, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో టిక్కెట్ల కోసం భారీ పోటీ ఉంది. టిక్కెట్ దక్కని చాలా మంది నేతలు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. ఇలాంటి సమయంలో జలగం వెంకట్రావు చేరికతో కాంగ్రెస్‌లో మరో వివాదం మొదలయ్యే అవకాశం ఉంది. ఈ విషయాన్ని కాంగ్రెస్ ఎలా డీల్ చేస్తుందో చూడాలి.