Kasani Gnaneshwar: కాసానికి టీడీపీ దెబ్బ.. రాజకీయ భవిష్యత్ ఏంటి..?
ఎన్నికల్లో పోటీ చేయనప్పుడు పార్టీలో ఉండి ఏం ప్రయోజనం అని ఆయన ప్రశ్నించారు. పోటీ చేయాలని కార్యకర్తలు కోరుతున్నారని, వాళ్లకేం సమాధానం చెప్పాలన్నారు.

Kasani Gnaneshwar: తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న కాసాని జ్ఞానేశ్వర్ ఆ పార్టీకి సోమవారం రాజీనామా చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకూడదనే టీడీపీ అధిష్టానం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కాసాని రాజీనామా చేశారు. ఎన్నికల్లో పోటీ చేయనప్పుడు పార్టీలో ఉండి ఏం ప్రయోజనం అని ఆయన ప్రశ్నించారు. పోటీ చేయాలని కార్యకర్తలు కోరుతున్నారని, వాళ్లకేం సమాధానం చెప్పాలన్నారు. ఆ విషయం కార్యకర్తలకు తాను చెప్పలేను కాబట్టే, పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
ఈ అంశం గురించి నారా లోకేశ్‌కు ఎన్నిసార్లు పోటీ చేసినా ఫోన్ ఎత్తలేదన్నారు. తన అనుచరులతో చర్చించి, భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటానన్నారు. అయితే, ఈ విషయంలో టీడీపీ నిర్ణయంపై రాజకీయ విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకోవడం ద్వారా తెలంగాణలో టీడీపీ ఇక జెండా ఎత్తేసినట్లుగానే భావించాలి. అందులోనూ కొంతకాలంగా తెలంగాణ టీడీపీని నడిపించిన కాసాని తప్పుకొన్నాడు అంటే.. భవిష్యత్తులో మరొకరు పార్టీ బాధ్యతలు స్వీకరించే అవకాశం లేదు. నిజానికి తెలంగాణలో టీడీపీకి గతంలోలాగా ఆదరణ లేదు.
అయితే, కొన్ని ప్రాంతాల్లో కమ్మ సామాజిక వర్గం, ఆంధ్రా సెటిలర్లు ఉండటంతో వారి నుంచి మద్దతు లభించింది. దీంతో వారి సహకారంతో కొంతమేర ప్రభావం చూపే అవకాశం ఉంది. కానీ, పోటీ నుంచి తప్పుకోవడంతో ఆ అవకాశం కోల్పోయింది. ఇంతకాలం టీడీపీ కోసం శ్రమించిన కాసాని పరిస్థితే ప్రస్తుతం ఎవరికీ అర్థంగాని స్థితిలో ఉంది. అందుకే మరో పార్టీలో చేరేందుకు కాసాని ఆలోచిస్తున్నారు. ఆయన బీఆర్ఎస్‌లో చేరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఆయన ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన వారు.
అసలే ముదిరాజ్‌లకు ఒక్క పదవి కూడా ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్‌పై ఆ సామాజికవర్గంలో వ్యతిరేకత ఉంది. ఇది తొలగించుకోవడానికి పలువురు ముదిరాజ్‌లను బీఆర్ఎస్ తమ పార్టీలోకి చేర్చుకుంటోంది. ఈ లెక్కన కాసానిని కూడా పార్టీలోకి ఆహ్వానించే ఛాన్స్ ఉంది.