TELANGANA ASSEMBLY ELECTIONS: ఐదు స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థులు ఫైనల్.. వాళ్లెవరంటే..?
నవంబర్ 30వ తేదీనే అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఎక్కువ సమయం లేనందున ప్రచారం జోరుగా నిర్వహించాలని భావిస్తున్నారు బీఆర్ఎస్ అగ్రనేతలు. ఈసారి కూడా విజయం సాధించి ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని.. హ్యాట్రిక్ కొట్టాలని పట్టుదలతో ఉన్నారు.
TELANGANA ASSEMBLY ELECTIONS: తెలంగాణలో ఎన్నికల శంఖారావం మోగింది. బీఆర్ఎస్ తరఫున.. మంత్రులు హరీష్, కేటీఆర్ అన్నీ తామై పార్టీ ప్రచార బాధ్యతలు చూసుకుంటున్నారు. పార్టీ అధినేత కేసీఆర్ మాత్రం మౌనంగా ఉన్నారు. ప్రతీ ఎన్నిక కోసం ఓ బ్రహ్మాస్త్రం సిద్ధం చేసే కేసీఆర్.. ఇప్పుడు ఎలాంటి ఆయుధాన్ని బయటకు తీయబోతున్నారనే చర్చ జరుగుతోంది. కేసీఆర్ మాట కంటే మౌనం ప్రమాదకరం అంటారు రాజకీయం తెలిసిన వాళ్లు. దీంతో ఆయన నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయని ఆసక్తి కనిపిస్తోంది.
ఇక అటు మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావుతో కేసీఆర్ అత్యవసరంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఎన్నికల మేనిఫెస్టో, ఎన్నికల ప్రచారంపై చర్చించినట్లుగా తెలుస్తోంది. నవంబర్ 30వ తేదీనే అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఎక్కువ సమయం లేనందున ప్రచారం జోరుగా నిర్వహించాలని భావిస్తున్నారు బీఆర్ఎస్ అగ్రనేతలు. ఈసారి కూడా విజయం సాధించి ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని.. హ్యాట్రిక్ కొట్టాలని పట్టుదలతో ఉన్నారు. ఇప్పటికే కేసీఆర్ ఇతర పార్టీల కంటే ముందే ఉన్నారు. 115 స్థానాలకు నెల రోజుల కిందే అభ్యర్థులను ప్రకటించి సెన్సేషన్ క్రియేట్ చేసారు. నాలుగు అసెంబ్లీ స్థానాలను మాత్రం పెండింగ్‌లో ఉంచారు. ఈ స్థానాలకూ అభ్యర్థులను ఈ సమావేశంలో ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది.
ఆయా నియోజకవర్గాల్లో అసంతృప్తులను బుజ్జగించి బీఆర్ఎస్ గెలుపునకు కృషి చేసేలా అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అభ్యర్థుల పేర్లు ప్రకటించడమే మిగిలి ఉంది. జనగామ నుంచి పల్లా రాజేశ్వర్‌రెడ్డి, నర్సాపూర్ అసెంబ్లీ స్థానం నుంచి సునీతా లక్ష్మారెడ్డి, నాంపల్లి స్థానం నుంచి ఆనంద్‌గౌడ్, గోషామహల్ నుంచి గోవింద్ రాటే పేర్లు ప్రకటించే చాన్స్ ఉంది. మల్కాజిగిరి నుంచి బీఆర్‌ఎస్ తరఫున పోటీ చేయాల్సిన మైనంపల్లి పార్టీ మారడంతో ఆ స్థానానికి కూడా అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. ఆ స్థానంలో మర్రి రాజశేఖర్ రెడ్డి పేరును ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.