TELANGANA ASSEMBLY ELECTIONS: కాంగ్రెస్ పార్టీపైనే బీఆర్ఎస్ ఫోకస్.. బీజేపీని పట్టించుకోని కేసీఆర్..!
కేసీఆర్ తన ప్రసంగాల్లో ఎక్కువగా కాంగ్రెస్‌పైనే ఫోకస్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. బీజేపీపై పెద్దగా విమర్శలు చేయడం లేదు. దీన్నిబట్టి ఈసారి ఎన్నికలు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్‌గా ఉండబోతున్నాయని మరోసారి స్పష్టమైంది.
TELANGANA ASSEMBLY ELECTIONS: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్ దూసుకుపోతున్నారు. ఆదివారం మేనిఫెస్టో ప్రకటించిన నాటి నుంచి వరుసగా నియోజకవర్గాల్లో పర్యటనలు చేస్తున్నారు. బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. మీటింగులన్నాక ప్రతిపక్షాలపై విమర్శలు చేయడం గ్యారెంటీ. అయితే, కేసీఆర్ తన ప్రసంగాల్లో ఎక్కువగా కాంగ్రెస్‌పైనే ఫోకస్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. బీజేపీపై పెద్దగా విమర్శలు చేయడం లేదు. దీన్నిబట్టి ఈసారి ఎన్నికలు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్‌గా ఉండబోతున్నాయని మరోసారి స్పష్టమైంది. నిజానికి ఈ ఏడాది ప్రారంభం వరకు తెలంగాణలో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగానే ఉండేది.
కర్ణాటకలో కాంగ్రెస్ విజయం సాధించడం, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పు వంటి అంశాలతో కాంగ్రెస్ పార్టీ మైలేజ్ పెరిగితే.. బీజేపీ పరిస్థితి దిగజారిపోయింది. ఇప్పుడు అసలు బీజేపీ కనీసం పోటీ ఇచ్చే పరిస్థితి కూడా లేకుండా పోయింది. దీంతో బీజేపీని కేసీఆర్ కానీ, బీఆర్ఎస్ నేతలు కానీ పట్టించుకోవడం లేదు. ఒకవైపు బీజేపీ నేతలు తెలంగాణలో పర్యటిస్తూ బీఆర్ఎస్, కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తున్నా.. ఆ పార్టీపై బీఆర్ఎస్, కాంగ్రెస్ పెద్దగా రియాక్ట్ కావడం లేదు. రెండు పార్టీలు మాత్రం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. కేసీఆర్‌పై రేవంత్ విరుచుకుపడుతుంటే.. కాంగ్రెస్‌పై కేసీఆర్ విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే రాష్ట్రం అంధకారమే అవుతుందని, వ్యవసాయానికి మూడు గంటలే చాలని కాంగ్రెస్ నేతలు అంటున్నారని కేసీఆర్ గుర్తు చేశారు. ఎన్నికలప్పుడు మాత్రమే కనిపించే వారిని, అబద్ధపు హామీలు ఇచ్చే వారిని నమ్మొద్దని కేసీఆర్ సూచించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి రద్దవుతుందని, మళ్లీ కబ్జాదారులు వచ్చి భూములను గద్దల్లా తన్నుకుపోతారని విమర్శించారు. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా కాంగ్రెస్ మళ్లీ కాంగ్రెస్ దెబ్బ పడుతుందన్నారు. ఇలా ప్రతి సభలోనూ కాంగ్రెస్‌పైనే విమర్శలు చేస్తూ వస్తున్నారు.
బీఆర్ఎస్ నేతలు కూడా ఆ పార్టీపై ఇదే తరహా మాటల దాడి చేస్తున్నారు. వివిధ నియోజకవర్గాల పరంగా చూసినా.. కాంగ్రెస్‌ను ఎదుర్కోవడమే లక్ష‌్యంగా బీఆర్ఎస్ పావులు కదుపుతోంది. కాంగ్రెస్ నేతలపైనే గురిపెట్టింది. కానీ, బీజేపీ నేతలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. కాంగ్రెస్‌ను ఎదుర్కోగలిగితే చాలు.. తిరిగి మళ్లీ అధికారం దక్కించుకోవచ్చన్నది బీఆర్‌ఎస్ ధీమా. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ సునాయాస విజయం సాధించడానికి కారణం కూడా అప్పట్లో కాంగ్రెస్ బలహీనంగా ఉండటమే. కానీ, ఇప్పుడు కాంగ్రెస్ బలంగా ఉండటంతో ఆ పార్టీని ఎదుర్కోవడానికి బీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తోంది.