KISHAN REDDY: పార్టీలో ఇంత జరుగుతున్నా.. కిషన్ రెడ్డి పట్టించుకోవడం లేదా..?
అధ్యక్ష బాధ్యతలను స్వీకరించడం.. కిషన్ రెడ్డికి ఏమాత్రం ఇష్టం లేదని, తనకు ఇష్టం లేని పదవిలో కూర్చోబెట్టడంపై అలక చెందారని.. అందుకే పార్టీలో పరిణామాలను పట్టించుకోనట్లుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయ్.
KISHAN REDDY: తెలంగాణలో బీజేపీ పరిస్థితి గందరగోళంగా తయారయింది. ఇవాళ పార్టీ ఆఫీస్‌లో కనిపించిన వారు.. రేపు వస్తారో రారో కూడా అర్థం కావడం లేదు ఎవరికీ ! నిజానికి బండి సంజయ్‌ను పక్కనపెట్టి.. కిషన్ రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగించినప్పటి నుంచే ఇలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయనే చర్చ ఉంది. ఆ మాట తప్పు అనేలా కిషన్ రెడ్డి పని చేస్తున్నారా అంటే.. ఔను అనేందుకు ఒక్క ఆధారం కూడా దొరకడం లేదు ఎవరికీ ! పార్టీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి తన బాధ్యతలను సరిగ్గా నిర్వహించలేకపోతున్నారా అనే అనుమానాలు చాలామందిలో వినిపిస్తున్నాయ్.
కిషన్ రెడ్డి పార్టీ పగ్గాలు అందుకున్నప్పటి నుంచీ పార్టీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకోవడం, కీలక నేతలు చాలామంది పార్టీ మారేందుకు రెడీ అవుతున్నా, అసంతృప్తితో రగిలిపోతున్నా వారిని బుజ్జగించి పార్టీలో కొనసాగే విధంగా చేయడంలో కిషన్ రెడ్డి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ అంశం ఇప్పుడు పార్టీలో చర్చకు కారణం అవుతున్నాయ్. అధ్యక్ష బాధ్యతలను స్వీకరించడం.. కిషన్ రెడ్డికి ఏమాత్రం ఇష్టం లేదని, తనకు ఇష్టం లేని పదవిలో కూర్చోబెట్టడంపై అలక చెందారని.. అందుకే పార్టీలో పరిణామాలను పట్టించుకోనట్లుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయ్. కోమటిరెడ్డి పార్టీ మారినా.. ఎవరి ఇష్టం వారిదే అని ఒక్క మాటతో వదిలేశారే తప్ప.. అంతకుముందు, ఆ తర్వాత ఏమీ చేయలేదు, చేయలేకపోయారు అనే వాదన కూడా ఉంది. కోమటిరెడ్డి చాలా రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు.
ఐతే ఆయనను కలుపుకుపోవడంలో కిషన్ రెడ్డి పెద్దగా ఆసక్తి చూపించినట్లు అనిపించలేదు. కట్ చేస్తే.. కమలానికి హ్యాండ్ ఇచ్చి హస్తం గూటికి చేరుకున్నారు రాజగోపాల్. కోమటిరెడ్డి వ్యవహారమే కాదు.. అసంతృప్తితో ఉన్న చాలామంది సీనియర్ల విషయంలో కిషన్ రెడ్డి పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించలేదనే చర్చ జరుగుతోంది. కరీంనగర్ జిల్లా ధర్మపురి టిక్కెట్ ఆశించిన మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామికి.. అక్కడ కాకుండా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు నియోజకవర్గం కేటాయించింది బీజేపీ. దీంతో ఆయన అసంతృప్తితో ఉన్నారని టాక్ వినిపిస్తోంది. టికెట్ విషయంలో క్లారిటీ లేకపోవడంతో భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ కూడా అసంతృప్తితో ఉన్నారని.. పార్టీ మారేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారనే ప్రచారం వినిపిస్తోంది.
ఇక తన కుమారుడు నితిన్ రెడ్డికి షాద్‌నగర్ అసెంబ్లీ టికెట్ కేటాయించి.. తనకు లోక్ సభ టికెట్ ఇవ్వాలని జితేందర్ రెడ్డి అడుగుతుంటే.. ఆయనను అసెంబ్లీకి పోటీ చేయాలని హైకమాండ్ కోరుతోంది. ఐతే తాను అసెంబ్లీకి పోటీ చేయనని జితేందర్ రెడ్డి తేల్చి చెప్పేశారు. ఇక ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ కూడా పార్టీ మారేందుకు రెడీ అవుతున్నారు. ఇలా తెలంగాణ బీజేపీలో రోజురోజుకు అసంతృప్తి నేతలు పెరిగిపోతున్నా.. అధ్యక్షుడి హోదాలో కిషన్‌నరెడ్డి ఏ చర్యలు తీసుకోకుండా మౌనంగానే ఉండిపోవడంపై పార్టీలో విమర్శలు, అనుమానాలు వ్యక్తం అవుతున్నాయ్.