Komatireddy Rajgopal Reddy: బీజేపీకి కోమటిరెడ్డి గుడ్ బై.. కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రకటన
కేసీఆర్‌ను ఓడించడమే తన లక్ష్యమని, కేసీఆర్ దుర్మార్గపు పాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేయాలనే లక్ష్యంతోనే పార్టీ మారుతున్నట్టు వెల్లడించారు.

Komatireddy Rajgopal Reddy: తెలంగాణ ఎన్నికల వేళ బీజేపీకి భారీ షాక్ తగిలింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేశారు. బుధవారం ఉదయం తన రాజీనామా ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. కోమటిరెడ్డి నిర్ణయం బీజేపీకి ఇబ్బందిగా మారనుండగా, కాంగ్రెస్‌కు మాత్రం మరింత జోష్ ఇవ్వనుంది. రాజీనామా అంశంపై కోమటిరెడ్డి ఓ లేఖ విడుదల చేశారు.
ప్రజల ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నట్లు లేఖలో పేర్కొన్నారు. కేసీఆర్‌ను ఓడించడమే తన లక్ష్యమని, కేసీఆర్ దుర్మార్గపు పాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేయాలనే లక్ష్యంతోనే పార్టీ మారుతున్నట్టు వెల్లడించారు. ‘‘తెలంగాణలో అవినీతి, అరాచక నియంతృత్వ కుటుంబ పాలనకు చరమగీతం పాడే శక్తి బీజేపీకే ఉందని భావించి మునుగోడు ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరాను. గత ఏడాది మునుగోడు అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికల్లో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షులు నద్దా ఆశీస్సులతో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి అధికార బీఆర్ఎస్ ను ఓడించినంత పని చేశాను. మునుగోడు ఉప ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ 100 మంది ఎమ్మెల్యేలు, మరో వంద మంది సీనియర్ నేతలను ప్రచారంలోకి దింపి వందల కోట్లు ఖర్చు చేసింది. అయినప్పటికీ స్వల్ప తేడాతో నెగ్గి, నైతికంగా ఓడింది.
మునుగోడు ఉప ఎన్నికల్లో నా విజయం కోసం ప్రయత్నించిన బీజేపీ నేతలు కార్యకర్తలు శ్రేయోభిలాషులందరికీ మరోసారి ధన్యవాదాలు. ఏడాదిన్నర క్రితం తెలంగాణలో అధికార బీఆర్ఎస్‌కు పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎదిగిన బిజెపి, ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో కొంత డీలా పడింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీయే ప్రత్యామ్నాయంగా ఉంది. అధికార మార్పును కోరుకుంటున్న తెలంగాణ ప్రజల ఆలోచనలకు అనుగుణంగానే నేను కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకున్నాను”అని కోమటిరెడ్డి లేఖలో పేర్కొన్నారు. ఈ నెల 27న ఢిల్లీలో రాహుల్ సమక్షంలో కోమటిరెడ్డి కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉంది.