MIM: హైదరాబాద్‌తో పాటు ఆ స్థానాలు టార్గెట్.. ఎన్నికల వేళ ఎంఐఎం భారీ ప్లాన్..
ఈసారి హైదరాబాద్ సిటీలోని 9స్థానాలతో పాటు ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలోని మరో రెండు స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తోంది. మరో మూడు, నాలుగు రోజుల్లో అభ్యర్థుల జాబితాను విడుదల చేసే అవకాశం ఉందని టాక్.
MIM: తగ్గేదే లే అంటున్నాయ్ తెలంగాణలో పార్టీలన్నీ ఇప్పుడు! ఒకరికి మించి ఒకరు వ్యూహాలు అనే అస్త్రాలతో.. ఎన్నికలు అనే యుద్ధాన్ని మరింత రసవత్తరంగా మారుస్తున్నారు. హ్యాట్రిక్ సాధించాలని ఒకరు.. ఎలాగైనా అధికారం దక్కించుకుని తీరాలని ఇంకొందరు.. ఈ ఎన్నికలతో తమ బలం ఏంటో చూపించాలని మరికొందరు.. ఇలా ఒక్కో పార్టీది ఒక్కో స్ట్రాటజీ.. ఒక్కో లక్ష్యం. అన్నీ కలిసి.. తెలంగాణ రాజకీయం భగ్గుమంటోంది. ఈ ఎన్నికల కోసం ఎంఐఎం పార్టీ భారీ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈసారి హైదరాబాద్ సిటీలోని 9స్థానాలతో పాటు ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలోని మరో రెండు స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తోంది. మరో మూడు, నాలుగు రోజుల్లో అభ్యర్థుల జాబితాను విడుదల చేసే అవకాశం ఉందని టాక్. ఈసారి ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కన పెట్టే అవకాశాలున్నాయని సమాచారం. యాకుత్‌పురా ఎమ్మెల్యే పాషా ఖాద్రీ, నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మెరాజ్, చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్‌కు ఈసారి టికెట్ ఇవ్వబోరని తెలుస్తోంది. వీరి స్థానంలో మాజీ మేయర్ మహ్మద్ మాజిద్ హుస్సేన్, సయ్యద్ ముస్తాక్ అహ్మద్, యాసర్ అరాఫత్, సోహైల్ ఖాద్రీ లాంటి సీనియర్ల పేర్లను పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. యాకుత్‌పురా, చార్మినార్, చాంద్రాయణగుట్ట, బహదూర్‌పురా, కార్వాన్, మలక్‌పేట, నాంపల్లితో పాటు రాజేంద్రనగర్, జూబ్లీహిల్స్ స్థానాల్లోనూ పోటీ చేయాలని ఎంఐఎం భావిస్తోంది.
రాజేంద్రనగర్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లో పెద్దఎత్తున ముస్లిం ఓటర్లు ఉండటమే ఇందుకు కారణం. గత ఎన్నికల్లో రాజేంద్రనగర్ నుంచి పోటీ చేసిన ఎంఐఎం.. 46వేల ఓట్లు సాధించింది. ఐతే బలమైన అభ్యర్థి ఉంటే సీన్ ఇంకోలా ఉండేదని భావిస్తున్న పార్టీ వర్గాలు.. ఈసారి ఎన్నికల్లో స్ట్రాంగ్ క్యాండిడేట్‌ను రంగంలోకి దింపబోతోంది. ఇక అటు నిజామాబాద్ అర్బన్, నిర్మల్ నియోజకవర్గాల్లోనూ పోటీ చేసేందుకు MIM ప్లాన్ చేస్తోంది. MIM చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ, అసెంబ్లీలో ఆ పార్టీ ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ అభ్యర్థుల లిస్ట్‌పై ఫైనల్ డెసిషన్ తీసుకోనున్నారు.