Jhansi Reddy: పాలకుర్తిలో ఝాన్సీ రెడ్డికి భారీ షాక్.. పోటీకి అనర్హత.. మరి కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు?
అక్టోబర్ 4నే ఆమె పౌరసత్వాన్ని నిరాకరిస్తూ అధికారిక లేఖ విడుదల చేశారు. ఐనా సరే పాలకుర్తిలో పోటీ చేస్తానంటూ ఝాన్సీ రెడ్డి ప్రకటించడం కొత్త చర్చకు కారణం అవుతోంది. తొర్రూరు మండలం చెర్లపాలెం సహా పలు ప్రాంతాల్లో ఝాన్సీరెడ్డి స్వంత నిధులతో అభివృద్ధి పనులు చేపట్టి ఓటర్లకు చేరువయ్యారు.

Jhansi Reddy: ఎన్నికల వేళ.. పాలకుర్తి కాంగ్రెస్ నేత, ఎన్‌ఆర్‌ఐ ఝాన్సీ రెడ్డికి షాక్ తగిలింది. ఝాన్సీ రెడ్డికి భారత పౌరసత్వం నిరాకరించింది ప్రభుత్వం. వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఝాన్సీ రెడ్డి భావించారు. అయితే, ఆమె భారత పౌరసత్వం రిజెక్ట్ అయింది. అక్టోబర్ 4నే ఆమె పౌరసత్వాన్ని నిరాకరిస్తూ అధికారిక లేఖ విడుదల చేశారు. ఐనా సరే పాలకుర్తిలో పోటీ చేస్తానంటూ ఝాన్సీ రెడ్డి ప్రకటించడం కొత్త చర్చకు కారణం అవుతోంది.
తొర్రూరు మండలం చెర్లపాలెం సహా పలు ప్రాంతాల్లో ఝాన్సీరెడ్డి స్వంత నిధులతో అభివృద్ధి పనులు చేపట్టి ఓటర్లకు చేరువయ్యారు. ఆమె సేవా కార్యక్రమాలను గుర్తించిన కాంగ్రెస్ పిలిచి టికెట్ ఇస్తామనడంతో ఆమె కూడా ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీ అయ్యారు. కాంగ్రెస్ కార్యకర్తలను కలుస్తూ మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఐతే పౌరసత్వం నిరాకరణతో ఆదిలోనే ఝాన్సీ రెడ్డికి ఝలక్ తగిలినట్లు అయింది. పాలకుర్తిలో గెలిచి ఎట్టి పరిస్థితుల్లోనూ మంత్రి ఎర్రబెల్లికి ఝలక్ ఇవ్వాలనుకుంటున్న కాంగ్రెస్.. అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఝాన్సీ పౌరసత్వంపై స్పష్టమైన ఆదేశాలు రాకపోవడంతో.. స్క్రీనింగ్ కమిటీ ఈ విషయంపై ఫోకస్ పెట్టింది. ఎన్ఆర్ఐ ఝాన్సీ రెడ్డి పౌరసత్వం విషయంలో సమస్య కారణంగా ఆమెకు బదులుగా ఝాన్సీ కోడలు యశస్వినీ రెడ్డి పేరును పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు స్క్రీనింగ్ కమిటీ యశస్వినీ పేరును ప్రతిపాదించనున్నట్టు తెలుస్తోంది.
పాలకుర్తి నుంచి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఓటమి ఎరుగని నేతగా పేరు తెచ్చుకున్న ఎర్రబెల్లికి ఈసారి చుక్కలు చూపించేందుకు కాంగ్రెస్ భారీ కసరత్తే చేస్తోంది. ఆయనను ఈసారి ఓడించేందుకు కాంగ్రెస్ ఎన్ఆర్ఐ హనుమాండ్ల ఝాన్సీరెడ్డి, మాజీ ఎంపీ రామసహాయం సురేందర్ రెడ్డి కుటుంబసభ్యులను బరిలోకి దింపనున్నారు. ఝాన్సీరెడ్డికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆశీస్సులతోపాటు మాజీ ఎంపీ రామసహాయం సురేందర్ రెడ్డి సహకారం కూడా ఉంది. ఐతే కాంగ్రెస్ ఆశలన్నీ ఇప్పుడు అడియాశలు అయ్యేలా కనిపిస్తున్నాయ్.