Revanth Reddy : రేవంత్ పై ప్రతిపక్షాలు.. యుద్ధం మొదలెట్టేశాయా.. ?

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి ఇంకా వారం కూడా కాలేదు. కానీ ప్రతిపక్ష పార్టీలు అప్పుడే యుద్ధం మొదలు పెట్టేశాయి. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది. ఇక ప్రొటెం స్పీకర్ విషయంలో లొల్లి చేస్తోంది బీజేపీ. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు.. ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చకపోతే యుద్ధం చేస్తామని ముందే హెచ్చరించింది గులాబీ పార్టీ. కానీ కొంత టైమ్ ఇస్తుందని అనుకున్నా.. తొందరగానే ఎదురుదాడి ప్రారంభించింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 9, 2023 | 03:16 PMLast Updated on: Dec 09, 2023 | 3:16 PM

Opposition Parties Started A War On Revanth

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి ఇంకా వారం కూడా కాలేదు. కానీ ప్రతిపక్ష పార్టీలు అప్పుడే యుద్ధం మొదలు పెట్టేశాయి. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది. ఇక ప్రొటెం స్పీకర్ విషయంలో లొల్లి చేస్తోంది బీజేపీ. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు.. ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చకపోతే యుద్ధం చేస్తామని ముందే హెచ్చరించింది గులాబీ పార్టీ. కానీ కొంత టైమ్ ఇస్తుందని అనుకున్నా.. తొందరగానే ఎదురుదాడి ప్రారంభించింది.

CM REVANTH REDDY: మహాలక్ష్మి పథకం ప్రారంభం.. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్న సీఎం రేవంత్

తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికైన ఎమ్మెల్యేలకు ప్రమాణం స్వీకారం చేయించడానికి ప్రొటెం స్పీకర్ ను నియమించడం సాంప్రదాయం. సభలో ఎక్కువసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వారిని ఈ పదవిని చేపట్టాలని ప్రభుత్వం కోరుతుంది. అందులో భాగంగా ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ ను ఎంపిక చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. దీనిపై యుద్ధం మొదలుపెట్టారు బీజేపీ ఎమ్మెల్యేలు. అక్బరుద్దీన్ ముందు తాము ప్రమాణం చేసేది లేదంటూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై మొదటి కంప్లయింట్ ను గవర్నర్ తమిళిసైకి సమర్పించారు. గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు గవర్నర్ ను కలిశారు. మజ్లిస్ తో లోపాయికారి ఒప్పందం వల్లే అక్బర్ ను ఎంపిక చేసినట్టు ఆరోపించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ సర్కార్ పై బీజేపీ మొదలుపెట్టిన యుద్ధాన్ని బీఆర్ఎస్ కంటిన్యూ చేసింది.

అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన తర్వాత మీడియా పాయింట్ లో మాట్లాడారు మాజీ మంత్రి హరీష్ రావు. పెంచిన రైతుబంధు ఎప్పటి నుంచి ఇస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నామని విమర్శలు చేయడం కాదనీ.. రైతాంగం అంతా ప్రభుత్వం వైపు చూస్తోందన్నారు హరీష్. రైతు బంధు కింద 15 వేల రూపాయలను డిసెంబర్ 9న ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. కానీ అది అమలు చేయలేదేంటని ప్రశ్నించారు. రైతులకు 500 రూపాయల బోనస్ ఇస్తామని ఎన్నికల సమయంలో ప్రకటించారు. వడ్లకు వెంటనే బోనస్ ఇవ్వాలి.. ధాన్యం ఎప్పటి నుంచి కొంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు హరీష్ రావు.

తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ కు 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. గత పదేళ్ళకంటే ఈసారి బలమైన ప్రతిపక్షం ఉంది. అందుకే కాంగ్రెస్ ఆరు గ్యారంటీలతో పాటు ఇతర స్కీముల అమలుపై ప్రజల తరపున పోరాడతామని బీఆర్ఎస్ ఇప్పటికే ప్రకటించింది. రేవంత్ ప్రభుత్వం.. తాము ఇచ్చిన హామీల్లో భాగంగా మొదట మహాలక్ష్మి, 10 లక్షల ఆరోగ్యశ్రీ పథకాలను ప్రారంభించింది. ఇక మిగతా పథకాలను కూడా చెప్పిన టైమ్ కల్లా ప్రారంభించేలా కాంగ్రెస్ సర్కార్ పై ఒత్తిడి తేవాలని బీఆర్ఎస్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. గత ప్రభుత్వం విద్యుత్ శాఖ విషయంలో చేసిన 88 వేల కోట్ల రూపాయల అప్పులపై సీఎం రేవంత్ రెడ్డితో పాటు.. కాంగ్రెస్ నుంచి విమర్శలు వస్తున్నాయి. అందుకే తాము కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై దూకుడుగా వెళ్ళాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. అంతేకాదు.. అసెంబ్లీలో ప్రతిపక్షనేతగా కేసీఆరే కొనసాగాలని నిర్ణయించారు. BRS LP నేతగా ఆయన్ని ఎన్నుకున్నారు ఆ పార్టీ ఎమ్మెల్యేలు. ప్రస్తుతం హాస్పిటల్ లో ఉన్న కేసీఆర్.. కోలుకొని రెండు నెలల తర్వాత అసెంబ్లీలోకి అడుగుపడితే.. ఆయన కూడా కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాలు, వైఫల్యాలపై ఎదురు దాడి చేసే అవకాశాలున్నాయి. అంటే రాబోయే రోజుల్లో.. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం కంటిన్యూ అవ్వక తప్పదనిపిస్తోంది.