PAWAN KALYAN: తెలంగాణ సమగ్ర అభివృద్దే లక్ష్యం.. జనసేన, బీజేపీ సమన్వయంతో పని చేయాలి: పవన్ కళ్యాణ్

అధికారం కేవలం అగ్ర కులాలకు మాత్రమే పరిమితమైన మంత్రదండం కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దామోదరం సంజీవయ్య తర్వాత మళ్లీ ఎస్సీ కులాలకు అధికారం రాలేదు. బీసీ కులాలకు అయితే ఇప్పటికీ అధికారం ఆమడ దూరంలోనే ఉండిపోయింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 24, 2023 | 05:53 PMLast Updated on: Nov 24, 2023 | 5:53 PM

Pawan Kalyan Requests Janasena And Bjp Cadre To Work Together

PAWAN KALYAN: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జనసేన సమన్వయంతో పని చేయాలని, తమ పార్టీ తెలంగాణ సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. హైదరాబాద్, మియాపూర్‌లో జరిగిన కూకట్‌పల్లి జనసేన, బీజేపీ ఉమ్మడి సమావేశంలో పవన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. “జాతీయ భావాలు, విశాల దృక్పథం ఉన్న రెండు పార్టీలు కలిస్తే ఎలా ఉంటుందో, దేశం కోసం ఆలోచించే బలమైన కార్యకర్తలు ఉద్వేగంతో పని చేస్తే ఎలాంటి విజయం వరిస్తుందో చాటి చెప్పాల్సిన సమయం ఇది. మనది డబ్బుతో కూడిన గెలుపు కాదు అని నిరూపించాలి. సమున్నత ఆశయం కోసం భావోద్వేగ బంధం కలిపిన కార్యకర్తలు బలంగా పని చేస్తే ఎంతటి గొప్ప విజయం కాంక్షిస్తుందో తెలంగాణ ఎన్నికల్లో గెలుపు ద్వారా జనసేన-బీజేపీ కార్యకర్తలు అన్ని పార్టీలకు ఒక సందేశం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అధికారం కేవలం అగ్ర కులాలకు మాత్రమే పరిమితమైన మంత్రదండం కాదు.

DK Shivakumar: మొదటిరోజే ఆరు గ్యారెంటీల హామీలపై సంతకం చేస్తాం: డీకే శివకుమార్

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దామోదరం సంజీవయ్య తర్వాత మళ్లీ ఎస్సీ కులాలకు అధికారం రాలేదు. బీసీ కులాలకు అయితే ఇప్పటికీ అధికారం ఆమడ దూరంలోనే ఉండిపోయింది. జనాభాలో అధికంగా ఉన్న బీసీలకు రాజ్యాధికారం కల్పిస్తామని ఇప్పటి వరకు ఎవరూ చెప్పలేదు. మొట్టమొదటిసారిగా ప్రధాని మోడీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ తెలంగాణలో కచ్చితంగా బీసీలను ముఖ్యమంత్రి చేస్తామని హామీ ఇచ్చింది. దీన్ని ప్రతి ఒక్కరూ స్వాగతించాలి. బీజేపీ.. బీసీలను ముఖ్యమంత్రి చేస్తుంది అన్న మాటను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ప్రతి ఒక్కరికి రాజ్యాధికారం దక్కాలి అనే ఓ గొప్ప ఆశయానికి కచ్చితంగా తెలంగాణ ప్రజలు అండగా నిలబడాలి. జనసేనకు, బీజేపీకి చాలా భావసారూప్యతలు కనిపిస్తాయి. దేశ సమగ్రత కోసం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ప్రధానమైన ఉమ్మడి లక్షణం. సోషలిస్ట్ భావాలు, సనాతన ధర్మాన్ని రెండింటినీ జనసేన పార్టీ బలంగా నమ్ముతుంది.

హిందూ ఆలయాలు, హిందూ దేవతల మీద దాడులు జరిగితే ఎంత తీవ్రంగా స్పందిస్తామో ఇతర మతాలకు చెందిన ప్రార్థన ఆలయాలకు ఎలాంటి నష్టం వాటిల్లినా అంతే బలంగా స్పందిస్తాం. 2014లో ఒక బలమైన నాయకత్వం దేశానికి అవసరం అనే కోణంలోనే నరేంద్ర మోదీ నాయకత్వాన్ని బలపరిచాం. 2014కు ముందు దేశంలో ఉన్న అరాచక పరిస్థితులు, భయానక వాతావరణం అన్నీ గమనించి దేశానికి బలమైన నాయకుడు కావాలని ఆశించాను. మోదీ నాయకత్వంలో భారతదేశం అంచెలంచెలుగా ఎదగడం నన్ను ఆనందంలో ముంచెత్తింది. ముచ్చటగా మూడోసారి కూడా ప్రధానమంత్రిగామోడీ భారతదేశాన్ని మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకువెళ్లాలని మనస్పూర్తిగా ఆకాంక్షిస్తున్నాను” అని పవన్ ప్రసంగించారు.