Telangana Congress: బీఆర్ఎస్‌పై కాంగ్రెస్ విమర్శలు.. కేసీఆర్ గతం మర్చిపోయారన్న ఖర్గే..

ఇచ్చిన మాట తప్పకుండా, హామీలను నిలబెట్టుకునే ఏకైక పార్టీ కాంగ్రెస్. సోనియా లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు. ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఇచ్చారు సోనియా గాంధీ. కానీ ఆ విషయం మరిచిపోయి రాహుల్, ప్రియాంక గాంధీలపై బీఆర్ఎస్ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 29, 2023 | 05:45 PMLast Updated on: Oct 29, 2023 | 5:45 PM

Revanth Reddy And Kharge And Other Congress Leaders Fires On Kcr And Ktr

Telangana Congress: తెలంగాణలో పోటీ బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే కనిపిస్తోంది. కాంగ్రెస్‌పై కేసీఆర్, కేటీఆర్ విమర్శలు గుప్పిస్తుంటే.. అదే స్థాయిలో బీఆర్ఎస్‌పై, కేసీఆర్‌పై కాంగ్రెస్ నేతలు విరుచుకుపడుతున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా మల్లికార్జున ఖర్గే.. బీఆర్ఎస్‌పై నిప్పులు చెరిగారు. సోనియా గాంధీ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదన్నారు.

బీఆర్ఎస్ నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడొద్దని హెచ్చరించారు. సంగారెడ్డిలో జరిగిన బహిరంగ సభలో పాల్గొని ఖర్గే ప్రసంగించారు.”ఇచ్చిన మాట తప్పకుండా, హామీలను నిలబెట్టుకునే ఏకైక పార్టీ కాంగ్రెస్. సోనియా లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు. ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఇచ్చారు సోనియా గాంధీ. కానీ ఆ విషయం మరిచిపోయి రాహుల్, ప్రియాంక గాంధీలపై బీఆర్ఎస్ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన చేయగానే కేసీఆర్‌.. సోనియా గాంధీ ఇంటికెళ్లి ఆమెను కలిశారు. కానీ మరుసటిరోజే కేసీఆర్ ఆ విషయం మరిచిపోయారు. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ న్యాయం చేస్తే.. బీఆర్ఎస్ మోసం చేసింది. కర్ణాటకలో ఇచ్చిన హామీలను నెరవేర్చుతున్నాం. ఇప్పుడు తెలంగాణకు 6 గ్యారంటీలు ఇచ్చాం. అధికారంలోకి వచ్చిన వెంటనే వాటినీ అమలు చేస్తాం. ఒకప్పుడు మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణలో ఇప్పుడు ప్రతి ఒక్కరిపై రూ.5 లక్షల అప్పు ఉంది” అని ఖర్గే వ్యాఖ్యానించారు.

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా కేటీఆర్‌పై విమర్శలు చేశారు. “తెలంగాణలో పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రజలకు ఏం చేశారో చెప్పాలి. కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేస్తుందని నిరూపించేందుకు మేము సిద్ధం. అక్కడి ప్రభుత్వ పథకాలను సీఎం కేసీఆర్ చూస్తానంటే, చూపించేందుకు బస్సు సిద్ధంగా ఉంది. డీకే శివకుమార్ సవాల్‌తో బీఆర్ఎస్ నేతలు తోక ముడిచారు. దళితులకు 12 శాతం రిజర్వేషన్ ఇస్తామని గాలికొదిలేశారు. వృద్ధులకు సకాలంలో పింఛను ఇవ్వడం లేదు. పండిన పంటను కొనుగోలు చేసే పరిస్థితి లేదు” అని రేవంత్ అన్నారు.