Revanth Reddy: బీఆర్ఎస్ మేనిఫెస్టో కాంగ్రెస్‌కు కాపీ.. కేసీఆర్‌కు సవాల్ విసిరిన రేవంత్
బీఆర్ఎస్ ప్రకటించిన మేనిఫెస్టోలో కొత్తదనం ఏమీ లేదని, అది కాంగ్రెస్ నుంచి కాపీ కొట్టినట్లు స్పష్టమవుతోందన్నారు. కాంగ్రెస్ ప్రకటించిన హామీలు అమలు కావని చెబుతున్న కేసీఆర్.. అంతకుమించిన హామీలు ప్రకటించారని, దీనివల్ల కాంగ్రెస్ హామీల అమలు చేయడం సులభమే అని రేవంత్ వ్యాఖ్యానించారు.

Revanth Reddy: బీఆర్ఎస్ మేనిఫెస్టో విడుదల తర్వాత తెలంగాణలో రాజకీయం మరింత వేడెక్కింది. మేనిఫెస్టో విడుదల తర్వాత కాంగ్రెస్‌పై కేసీఆర్ విమర్శలు సంధిస్తే.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అంతే ఘాటుగా బదులిచ్చారు. బీఆర్ఎస్ ప్రకటించిన మేనిఫెస్టోలో కొత్తదనం ఏమీ లేదని, అది కాంగ్రెస్ నుంచి కాపీ కొట్టినట్లు స్పష్టమవుతోందన్నారు. కాంగ్రెస్ ప్రకటించిన హామీలు అమలు కావని చెబుతున్న కేసీఆర్.. అంతకుమించిన హామీలు ప్రకటించారని, దీనివల్ల కాంగ్రెస్ హామీల అమలు చేయడం సులభమే అని రేవంత్ వ్యాఖ్యానించారు. ఆదివారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు.
“కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను కాపీ కొట్టి బీఆర్ఎస్ మేనిఫెస్టో ప్రకటించారు. మా గ్యారెంటీలను కాపీ కొట్టి కేసీఆర్ పెద్ద అగాథంలో పడిపోయారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు ఇస్తామంటే బీఆర్‌ఎస్ నేతలు అదేలా సాధ్యమని ప్రశ్నించారు. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు అంతకంటే ఎక్కువ పథకాలు ప్రకటించి, కాంగ్రెస్‌ను ప్రశ్నించే అర్హత కోల్పోయారు. కేసీఆర్‌లా మేం ఉత్తుత్తి హామీలు ఇవ్వలేదు. మేం ప్రకటించిన ఆరు గ్యారెంటీలను అమలు చేయగలం. కేసీఆర్ ఆయన ప్రకటించిన హామీల ద్వారా కాంగ్రెస్ హామీల అమలు సాధ్యమేనని రాజముద్ర వేసి మరీ అంగీకరించినట్లైంది. బీఆర్ఎస్ తన ఉనికిని కోల్పోయింది. కేసీఆర్ ఆలోచన శక్తి కోల్పోయారు. ఆయన ప్రస్తుతం పరాన్నజీవిలా మారారు. బీఆర్ఎస్‌కు ఆలోచన, ఆచరణ, సంక్షేమం, అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను చూసి కేసీఆర్‌కు చలిజ్వరం వచ్చింది. అవినీతికి కేసీఆర్ బ్రాండ్ అంబాసిడర్. కేసీఆర్‌కు శాశ్వతంగా విశ్రాంతి అవసరం.
కేసీఆర్‌కు సవాల్
ఈ ఎన్నికల్లో గెలవడానికి చుక్క మద్యం పంచబోమని, డబ్బులు వెదజల్లబోమని బీఆర్ఎస్ తరఫున కేసీఆర్ ప్రమాణం చేయగలరా..? కేసీఆర్ ఈ ఛాలెంజ్ స్వీకరిస్తే అక్టోబర్ 17న అమరవీరుల స్థూపం వద్దకు వచ్చి, నాతోపాటు అమరుల సాక్షిగా ప్రమాణం చేయాలి. నవంబర్ 1నే ఉద్యోగులకు జీతాలు, పింఛన్లు వేయగలరా..? కేసీఆర్‌ను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. రాష్ట్రంలో కచ్చితంగా కాంగ్రెస్ జెండా ఎగురుతుంది. కేసీఆర్ ఇండియా కూటమిలో చేరుతామంటే గేటు కూడా తాకనివ్వలేదు. కాంగ్రెస్ గ్యారెంటీ హామీలు కర్ణాటకలో అమలవుతున్నాయి. బ్లాక్ అండ్ వైట్ సినిమాను కలర్‌లో చూపించినట్లు బీఆర్ఎస్ మేనిఫెస్టో ఉంది. పాత హామీలనే అమలు చేయకుండా.. ఇప్పుడు మరోసారి మోసం చేద్దామని కేసీఆర్ ముందుకొచ్చారు. దోపిడీ సొమ్ముతో జాతీయ రాజకీయాలు చేయాలని కేసీఆర్ వైఫల్యం చెందారు. అర్థంపర్ధం లేని ఆరోపణలతో బిల్లా రంగాలు కాంగ్రెస్‌పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఎక్కడో డబ్బులు దొరికితే మాపై ఆరోపణలు చేస్తున్నారు” అని రేవంత్ వ్యాఖ్యానించారు.