TELANGANA ASSEMBLY ELECTIONS: ఈ నెల 18 నుంచి బస్సు యాత్రకు సిద్ధమవుతున్న కాంగ్రెస్..
యాత్ర ప్రారంభం రోజున కాంగ్రెస్ సీనియర్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా హాజరయ్యే అవకాశం ఉంది. ఈ టూర్ కొండగట్టు నుంచి ప్రారంభించాలని పార్టీ వర్గాలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ యాత్రలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ కూడా పాల్గొనబోతున్నారు.
TELANGANA ASSEMBLY ELECTIONS: తెలంగాణ కాంగ్రెస్ త్వరలో ఎన్నికల రణక్షేత్రంలోకి దిగబోతుంది. ఈ నెల 18 నుంచి బస్సు యాత్ర చేపట్టాలని పార్టీ నిర్ణయించింది. ఈ యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని, పార్టీ పథకాల్ని ప్రచారం చేయాలని భావిస్తోంది. యాత్ర ప్రారంభం రోజున కాంగ్రెస్ సీనియర్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా హాజరయ్యే అవకాశం ఉంది. ఈ టూర్ కొండగట్టు నుంచి ప్రారంభించాలని పార్టీ వర్గాలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ యాత్రలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ కూడా పాల్గొనబోతున్నారు. ఆయన పాల్గొనే తేదీలను త్వరలోనే నిర్ణయిస్తారు. తెలంగాణలోని అన్ని నియోజకవర్గాలు కవర్ అయ్యేలా బస్సు యాత్ర ఉంటుంది.
కాంగ్రెస్ ప్రకటించిన ఉచిత పథకాల గురించి ప్రజలకు వివరించడంతోపాటు, బీఆర్ఎస్ వైఫల్యాలను, బీజేపీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తారు. బస్సు యాత్రకు కాంగ్రెస్ సిద్ధమవుతున్నప్పటికీ, నియోజకవర్గాలకు అభ్యర్థుల్ని ప్రకటించకపోవడం ఇబ్బందిగా మారింది. బస్సు యాత్ర తర్వాతే అభ్యర్థులను ప్రకటించాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థుల్ని ప్రకటించి నెల రోజులు దాటింది. బీజేపీ కూడా జాబితాను విడుద చేసేందుకు సిద్ధమవుతోంది. కానీ, కాంగ్రెస్ మాత్రం ఇప్పుడప్పుడే జాబితా వెల్లడించేందుకు సిద్ధంగా లేదు. బీజేపీ కూడా అభ్యర్థుల్ని ప్రకటించిన తర్వాత.. అవసరమైతే, ఇతర పార్టీల అసంతృప్తుల్ని పార్టీలో చేర్చుకుని, ఆ తర్వాత జాబితా వెల్లడించాలని భావిస్తోంది. అయితే, కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి ఎంపిక పూర్తైంది. ఆయా నేతలకు దీనిపై సమాచారం ఇచ్చి, పనిచేసుకోమని చెప్పారు. మిగతా నియోజకవర్గాల్లో అనేక ఇబ్బందులు ఉన్నాయి.
ఒకే కుటుంబం నుంచి ఇద్దరు టిక్కెట్లు ఆశించడం, ఒక్కరికంటే ఎక్కువ మంది టిక్కెట్ల కోసం పోటీ పడటం, ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలతో సర్దుబాట్లు వంటి పలు సమస్యలున్నాయి. ఇప్పుడే అభ్యర్థుల్ని ప్రకటిస్తే.. టిక్కెట్లు దక్కని నేతలు తిరుగుబాటు చేసి, పార్టీ మారే అవకాశం ఉంది. ఇది కాంగ్రెస్‌కు ఇబ్బందిగా మారుతుంది. అందుకే ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా ప్రకటనపై కొద్ది రోజులు వేచి చూసే ధోరణిలో కాంగ్రెస్ ఉంది. బస్సు యాత్రలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క వంటి నేతలు పాల్గొంటారు.