TELANGANA TDP: తెలంగాణలో పోటీకి టీడీపీ సై.. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు..!

తెలంగాణ అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ ఉన్నప్పటికీ చంద్రబాబు ఆమోదంతోనే ఏ నిర్ణయమైనా తీసుకోవాలి. కానీ, చంద్రబాబు జైల్లో ఉండటంతో పార్టీ విషయంలో ఇంతకాలం సరైన నిర్ణయం తీసుకోలేరు. దీంతో తెలంగాణలో టీడీపీ పోటీ చేయలేదని భావించారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 26, 2023 | 02:14 PMLast Updated on: Oct 26, 2023 | 2:14 PM

Tdp Will Contest In Telangana Assembly Elections

TELANGANA TDP: తెలంగాణలో టీడీపీ పోటీ చేస్తుందా.. లేదా.. అనే సందేహానికి తెరదించే సమయం వచ్చింది. తెలంగాణలో పోటీ చేసేందుకు టీడీపీ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. తమకు పట్టున్న స్థానాల్లో పోటీ చేయాలని టీ టీడీపీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో తెలంగాణలో టీడీపీని నడిపించే వాళ్లు కరువయ్యారు. తెలంగాణ అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ ఉన్నప్పటికీ చంద్రబాబు ఆమోదంతోనే ఏ నిర్ణయమైనా తీసుకోవాలి. కానీ, చంద్రబాబు జైల్లో ఉండటంతో పార్టీ విషయంలో ఇంతకాలం సరైన నిర్ణయం తీసుకోలేరు.

దీంతో తెలంగాణలో టీడీపీ పోటీ చేయలేదని భావించారు. అయితే, తాము పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ అంశంపై పార్టీ అధినేత చంద్రబాబుతో కాసాని జ్ఞానేశ్వర్ చర్చించబోతున్నారు. గురువారం రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబును ఆయన కలుస్తారు. చంద్రబాబు ఆమోదం తెలిపితే, తెలంగాణలో టీడీపీ పోటీ చేయడం ఖాయం. పార్టీ బలంగా ఉన్న చోట్ల పోటీకి దిగబోతుంది. ఇప్పటికే టిక్కెట్లు ఆశిస్తున్న వారి జాబితాను సిద్ధం చేశారు. చంద్రబాబుకు ఈ జాబితాను అందజేసి, ఆయన ఆమోదం తీసుకుంటారు. 30 స్థానాలు మినహా అభ్యర్థుల ఎంపిక పూర్తైంది. అభ్యర్థుల ఎంపికపై తెలంగాణ కాసాని జ్ఞానేశ్వర్ హైదరాబాద్, ఎన్టీఆర్ భవన్‌లో రాష్ట్రస్థాయి, పార్లమెంటరీ స్థాయి నేతలతో కలిసి ఇప్పటికే కసరత్తు చేశారు. తెలంగాణలోని 119 నియోజ కవర్గాల్లో 89 చోట్ల పోటీ చేయాలని నిర్ణయానికి వచ్చారు. టీడీపీ పోటీ చేసే 89 నియోజకవర్గాల్లో కొన్ని నియోజక వర్గాలకు ఒక్కో అభ్యర్ధి పేరు, మరికొన్నింటికి రెండు పేర్లు ప్రతిపాదించారు.

తెలంగాణలో పోటీ చేసేందుకు చంద్రబాబు ఆమోదం తెలిపినప్పటికీ.. ఈ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లబోయేది ఎవరు అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో టీడీపీకి స్టార్ క్యాంపెయినర్ అంటూ లేరు. చంద్రబాబు జైలులో ఉంటే.. నారా లోకేష్.. ఇక్కడ పార్టీని నడిపించే అవకాశం లేదు. నందమూరి బాలకృష్ణ ఒక్కరే పార్టీని నడిపించే వీలుంది. కుదిరితే ఆయనే ఇక్కడ ప్రచారం నిర్వహిస్తారని టీడీపీ వర్గాలు అంటున్నాయి. ఈ విషయంపై ఒకట్రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.