TELANGANA BJP: బీజేపీ జాబితా ఇంకెప్పుడు..? ఏంటీ సమస్య..?
ఇప్పటివరకు బీజేపీ 53 మంది అభ్యర్థుల్ని మాత్రమే ప్రకటించింది. మరో 66 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించాలి. అయితే, ఈ అంశం ఎక్కడిదాకా వచ్చిందో కూడా ఎవరికీ స్పష్టత లేదు.

TELANGANA BJP: బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల్ని ప్రకటించి, ప్రచారంలో దూసుకెళ్తుంటే.. బీజేపీ మాత్రం ఇంకా అభ్యర్థుల ఎంపికపైనే కసరత్తు చేస్తోంది. ఇప్పటివరకు బీజేపీ 53 మంది అభ్యర్థుల్ని మాత్రమే ప్రకటించింది. మరో 66 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించాలి. అయితే, ఈ అంశం ఎక్కడిదాకా వచ్చిందో కూడా ఎవరికీ స్పష్టత లేదు.
బీజేపీ జాబితా ఆలస్యానికి గల కారణాలు కూడా ఇంకా తెలియదు. అభ్యర్థుల్ని త్వరగా ప్రకటించి, ఎన్నికల రణక్షేత్రంలోకి దూకాల్సిన తరుణంలో బీజేపీ ఇలా జాబితా ఆలస్యం చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. జాబితా ప్రకటన విషయంలో కొన్ని సమస్యలున్నాయి. ముఖ్యంగా జనసేనతో పొత్తు అంశం ఇంకా తేలలేదు. ఒకవేళ జనసేనతో పొత్తు ఉంటే.. ఆ పార్టీకి ఎన్ని సీట్లు కేటాయించాలి..? ఎక్కడి నుంచి సీట్లు ఇవ్వాలి.. అనే విషయంలో సందేహాలున్నాయి. అలాగే జనసేనకు టిక్కెట్లు కేటాయించడంపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటినుంచో బీజేపీ కోసం పని చేస్తుంటే.. తమకు కాకుండా, పొత్తులో భాగంగా జనసేనకు టిక్కెట్లు ఇవ్వడం ఏంటని ఆశావహులు ప్రశ్నిస్తున్నారు.
తమకు టిక్కెట్ ఇవ్వకపోతే ఊరుకునేది లేదంటూ హెచ్చరిస్తున్నారు. కూకట్‌పల్లి నియోజకవర్గం టిక్కెట్ విషయంలో ఇప్పటికే అక్కడి నేతలు ఆందోళన చేస్తున్నారు. మరోవైపు కొందరు నేతలు పోటీకి విముఖత చూపుతున్నారు. మల్కాజ్ గిరి నుంచి పోటీ చేయాలని మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావును పార్టీ కోరుతోంది. కానీ ఆయన పోటీ చేయడానికి ఇష్టపడటం లేదు. అక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్ బలంగా ఉండటంతో పోటీ అంత సులభం కాదని నమ్ముతున్నారు. నాంపల్లి, కూకట్ పల్లి, శేరిలింగంపల్లి, వేములవాడ వంటి స్థానాలకు మాత్రం గట్టి పోటీ నెలకొంది.
ఈ నియోజకవర్గాల్లో టిక్కెట్ దక్కని నేతలు తిరుగుబాటు చేసే ఛాన్స్ ఉంది. ఇక.. నవంబర్ 3న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుంది. నవంబర్ 3 నుంచి 10 వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. ఈ లోపే తుది జాబితా ప్రకటించాల్సి ఉంటుంది.