Telangana Congress: చెన్నూరులో వివేక్.. తుంగతుర్తిలో కీలక నేత.. పెండింగ్ స్థానాలపై కాంగ్రెస్ కీలక నిర్ణయం..
పెండింగ్ 19 స్థానాల్లో ప్రధానంగా వినిపిస్తున్న నియోజకవర్గాలు సూర్యాపేట, తుంగతుర్తి. ఇక్కడి నుంచి ఎవరికి టికెట్ దక్కుతుంది అనే ఆసక్తి కనిపిస్తోంది. ఐతే రాంరెడ్డి దామోదర్ రెడ్డి పేరే ఇక్కడి నుంచి దాదాపు ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయ్.
Telangana Congress: రెండు జాబితాల్లో కలిపి మొత్తం 100 స్థానాలకు అభ్యర్థులను ఫైనల్ చేసిన కాంగ్రెస్.. మరో 19 స్థానాలను పెండింగ్‌లో పెట్టింది. సెకండ్ లిస్ట్ అనౌన్స్ చేసిన తర్వాత కనిపించిన అసంతృప్తులను దృష్టిలో పెట్టుకొని.. మిగిలిన 19 స్థానాల విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తోంది కాంగ్రెస్. సామాజిక సమీకరణాలు, సీనియారిటీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు, సర్వే ఫలితాలు.. ఇలా అన్నీ లెక్కేసి మిగిలిన 19 స్థానాలకు అభ్యర్థులను ఫైనల్ చేసే ఆలోచనలో ఉంది కాంగ్రెస్.
పెండింగ్ 19 స్థానాల్లో ప్రధానంగా వినిపిస్తున్న నియోజకవర్గాలు సూర్యాపేట, తుంగతుర్తి. ఇక్కడి నుంచి ఎవరికి టికెట్ దక్కుతుంది అనే ఆసక్తి కనిపిస్తోంది. ఐతే రాంరెడ్డి దామోదర్ రెడ్డి పేరే ఇక్కడి నుంచి దాదాపు ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయ్. ఇక అటు తుంగతుర్తి అసెంబ్లీ స్థానానికి పిడమర్తి రవితో పాటు వడ్డేపల్లి రవి పేర్లు పరిశీలనలో ఉన్నాయ్. అటు చెన్నూరు అసెంబ్లీ స్థానం ఇప్పటికీ పెండింగ్‌లో ఉంది. బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి ఏ సమయంలోనైనా కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. వివేక్‌తో ఇప్పటికే చర్చలు కొనసాగుతున్నాయ్. రేవంత్ స్వయంగా వెళ్లి వివేక్‌తో భేటీ అయ్యారు. చర్చలు కూడా చివరి దశకు చేరుకున్నాయని తెలుస్తోంది. వివేక్ చేరిక దాదాపు ఖాయం అయినట్లు ప్రచారం జరుగుతోంది. బీఆర్‌ఎస్‌ను ఓడించగల సత్తా, సామర్ధ్యం బీజేపీకి లేదనే ఆలోచనతోనే.. కాంగ్రెస్‌లో చేరాలని వివేక్ వెంకటస్వామి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
వివేక్ ఇలా చేరగానే.. చెన్నూర్ నియోజకవర్గానికి అలా ఆయన పేరు ప్రకటించే అవకాశం ఉంది. నిజానికి చెన్నూర్ అసెంబ్లీ స్థానాన్ని సీపీఐకి కేటాయించినట్లు మొదటి నుంచి ప్రచారం జరిగినా.. చివరి నిమిషంలో నిర్ణయం మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఇక అటు టికెట్ల కేటాయింపులో సామాజికవర్గాల పరంగా జాగ్రత్తలు తీసుకుంటోంది కాంగ్రెస్. రాష్ట్రంలోని మొత్తం 19 ఎస్సీ స్థానాల్లో మాల సామాజికవర్గానికి 9మందికి అవకాశం ఇచ్చిన కాంగ్రెస్.. 10స్థానాల్లో మాదిగ సామాజికవర్గానికి చెందిన నేతలకు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.