TELANGANA CONGRESS: నేడే కాంగ్రెస్ రెండో జాబితా..? సంచలనాలుంటాయా..?

ఇప్పటికే 55 మందితో మొదటి జాబితా విడుదలకాగా.. ఇప్పుడు రెండో జాబితాలో దాదాపు 45 మంది అభ్యర్థుల్ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అలాగే సీపీఎం, సీపీఐలకు చెరో రెండు సీట్లు ఇచ్చేందుకు కూడా కాంగ్రెస్ అంగీకరించింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 27, 2023 | 02:53 PMLast Updated on: Oct 27, 2023 | 2:53 PM

Telangana Congress Second List Is Ready And Will Announce Today

TELANGANA CONGRESS: తెలంగాణలో కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితా దాదాపు సిద్ధమైంది. శుక్రవారం సాయంత్రం లేదా శనివారం ఈ జాబితా ప్రకటించే అవకాశం ఉంది. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ ఎన్నికల కమిటీ భేటీ జరిగింది. కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ వంటి అగ్ర నేతలు రెండో జాబితాపై తెలంగాణ నేతలతో చర్చించారు. ఇప్పటికే 55 మందితో మొదటి జాబితా విడుదలకాగా.. ఇప్పుడు రెండో జాబితాలో దాదాపు 45 మంది అభ్యర్థుల్ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

అలాగే సీపీఎం, సీపీఐలకు చెరో రెండు సీట్లు ఇచ్చేందుకు కూడా కాంగ్రెస్ అంగీకరించింది. కమ్యూనిస్టులకు ఏయే స్థానాలు ఇస్తారో తెలియాలి. అయితే, అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ తీవ్ర కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. స్క్రీనింగ్ కమిటీ నుంచి అందించిన జాబితాపై సీఈసీ సుదీర్ఘంగా చర్చించింది. ఖమ్మం జిల్లాకు సంబంధించి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మధ్య సమన్వయ లోపం కారణంగా.. అక్కడి సీట్ల కేటాయింపుపై చర్చ జరిగింది. అనేక అంశాలు పరిగణనలోకి తీసుకుని, రెండో జాబితాను రూపొందించింది కాంగ్రెస్. మొదటి జాబితా విషయంలోనే చాలా మంది పార్టీపై తిరుగుబాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండో జాబితాపై చాలా మంది నేతలు ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్‌లో తీవ్ర పోటీ నెలకొంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్న ధీమా ఉండటంతో చాలా మంది నేతలు టిక్కెట్ల కోసం పోటీ పడుతున్నారు. అయితే, జాబితాలో తమ పేర్లు లేకపోతే తిరుగుబాటు చేసేందుకు చాలా మంది నేతలు రెడీగా ఉన్నారు. కొన్ని పేర్ల విషయంలో సంచలనాలు ఉంటాయని భావిస్తున్నారు. కాగా, బీఆర్ఎస్ అగ్రనేతలు పోటీ చేస్తున్న నియోజవకర్గాలపై కాంగ్రెస్ ప్రధానంగా దృష్టి సారించింది.

కేసీఆర్ పోటీ చేయబోయే గజ్వేల్, కామారెడ్డి, కేటీఆర్ పోటీ చేస్తున్న సిరిసిల్ల, హరీష్ రావు పోటీ చేస్తున్న సిద్ధిపేటలో కాంగ్రెస్ అగ్రనేతలు పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. అంటే రెండు నియోజకవర్గాల నుంచి ఆ‍యా నేతలు పోటీ చేస్తారు. రేవంత్ రెడ్డి కొడంగల్ నుంచి మాత్రమే కాకుండా.. గజ్వేల్ నుంచి పోటీ చేసే ఛాన్స్ ఉంది. అలాగే భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా సిరిసిల్ల, సిద్ధిపేట, కామారెడ్డి నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఈ విషయంపై అధిష్టానం ఆమోదం తెలిపితే.. రెండు స్థానాల నుంచి పోటీ చేయడం ఖాయం.
మరికొన్ని గంటల్లో కాంగ్రెస్ రెండో జాబితా వెల్లడయ్యే అవకాశం ఉంది.