V Hanumantha Rao: ఉత్తమ్ వర్సెస్ వీహెచ్.. కాంగ్రెస్‌లో మరో వివాదం..!
వీహెచ్ కొంతకాలంగా అంబర్‌పేట్ ఎమ్మెల్యే టిక్కెట్ ఆశిస్తున్నారు. అయితే, ఉత్తమ్ కుమార్ రెడ్డి తనకు అక్కడ సీటు రాకుండా అడ్డుపడుతున్నాడని వీహెచ్ విమర్శించారు. తనకు పోటీగా నూతి శ్రీకాంత్ గౌడ్ టిక్కెట్ కోసం ఉత్తమ్ ప్రయత్నిస్తున్నాడని చెప్పారు.
V Hanumantha Rao: కాంగ్రెస్ పార్టీ అంటేనే నేతల మధ్య విబేధాలకు పెట్టిందిపేరు. ఈమధ్య కాలంలో ఇలాంటి విబేధాలు తగ్గినట్లు కనిపించినా.. ఎన్నికల సమయంలో నెమ్మదిగా బయటపడుతున్నాయి. తాజాగా ఇద్దరు సీనియర్ నేతల మధ్య అంతర్గత విబేధాలు బయటపడ్డాయి. టీపీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై, ఆ పార్టీ సీనియర్ నేత వి.హనుమంత రావు అలియాస్ వీహెచ్ ఫైర్ అయ్యారు. తనకు ఎమ్మెల్యే టిక్కెట్ రాకుండా ఉత్తమ్ మరో వ్యక్తిని ప్రోత్సహిస్తున్నాడని వీహెచ్ మండిపడ్డారు.
వీహెచ్ కొంతకాలంగా అంబర్‌పేట్ ఎమ్మెల్యే టిక్కెట్ ఆశిస్తున్నారు. అయితే, ఉత్తమ్ కుమార్ రెడ్డి తనకు అక్కడ సీటు రాకుండా అడ్డుపడుతున్నాడని వీహెచ్ విమర్శించారు. తనకు పోటీగా నూతి శ్రీకాంత్ గౌడ్ టిక్కెట్ కోసం ఉత్తమ్ ప్రయత్నిస్తున్నాడని చెప్పారు. తనకు టిక్కెట్ రాకుండా చేస్తే ఉత్తమ్ బండారం బయటపెడతానని హెచ్చరించారు. ‘‘నీకు, నీ భార్యకు మాత్రం సీట్లు కావాలి, నాకు మాత్రం వద్దా? ఉత్తమ్ కు బీసీ ఓట్లు కావాలి కానీ బీసీ మీటింగ్ వద్దా? సూర్యాపేటలో బీసీ మీటింగ్ పెడుతా అంటే పెట్టనీయలేదు. ఉత్తమ్ నా అంబర్ పేట్ సీట్ వెంట పడ్డారు. ఈ సీటు కోసం ఇక్కడ నూతి శ్రీకాంత్ గౌడ్‌ను ఎగదోస్తుండు. శ్రీకాంత్ గతంలో నాపై తప్పుడు కేసులు పెట్టించాడు. అలాంటి వ్యక్తిని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంకరేజ్ చేయడం కరెక్ట్ కాదు. అదే సమయంలో నాపై దుష్ప్రచారం చేస్తుండు. గత ఎన్నికల్లో డబ్బులు తీసుకొని వెనక్కి తగ్గానని అంటున్నారు. అది కరెక్ట్ కాదు. నేను డబ్బులు తీసుకునే వ్యక్తిని కాదు. గతంలో అంబర్ పేట్ నియోజకవర్గం నుంచి గెలిచి మంత్రయ్యా. అంబర్ పేట్ అభివృద్ధి కోసం అనేక పనులు చేశా. అంబర్‌పేట్ నుంచి లక్ష్మణ్ యాదవ్ కాంగ్రెస్ టికెట్ అడుగుతున్నారు.
గతంలో ఇక్కడి నుంచి యాదవ్‌లు గెలిచారు. గత ఎన్నికల్లో కోదండరాం గట్టిగా పట్టు పట్టడంవల్ల, అధిష్టానం సూచన మేరకు వెనక్కి తగ్గా. పార్టీ మారుతున్నా అని ప్రచారం చేయించి, బ్లాక్ మెయిల్ చేసి పదవులు తెచ్చుకున్న వ్యక్తి ఉత్తమ్. జగ్గారెడ్డితో పీసీసీ అధ్యక్షుడివి అవుతావని చెప్పి, రేవంత్‌పై ప్రతిరోజు మీడియాలో మాట్లాడించింది ఉత్తమ్. నాకు వ్యతిరేకంగా పనిచేయడం ఆపకపోతే.. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉత్తమ్ చేసిన పనులు బయట పెడతా. నన్ను కాంగ్రెస్ నుంచి బయటకు పంపేందుకు ఉత్తమ్ కుట్ర చేస్తున్నాడు. నేను ఎన్నటికీ పార్టీ మారను. గాంధీ కుటుంబానికి విధేయుడిని’’ అని వీహెచ్ అన్నారు. అయితే, వీహెచ్ వ్యాఖ్యలపై ఉత్తమ్ ఇంకా స్పందించలేదు.