MLA Rajasingh: మోదీ సభకు ఎమ్మెల్యే రాజా సింగ్ దూరం.. అసలు కారణం ఏంటి..?
ప్రధాని మోదీ సభకు రాజా సింగ్ ఎందుకు రాలేదు? కారణం ఏంటి? అసలేం జరిగింది? ఆయనకు ఆహ్వానం అందలేదా? కావాలనే పక్కన పెట్టారా? వంటి సందేహాలు బీజేపీ శ్రేణుల్లో వ్యక్తమయ్యాయి. అయితే, దీనిపై రాజా సింగ్ స్పందించారు.
MLA Rajasingh: హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో సోమవారం బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన బీసీ ఆత్మగౌరవ సభకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరైన సంగతి తెలిసిందే. మోదీతోపాటు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్‌తోపాటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ హాజరయ్యారు. అయితే, స్థానిక నేత గోశామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కనిపించలేదు. దీంతో స్థానికుడై ఉండి రాజా సింగ్ సభకు ఎందుకు హాజరు కాలేదు అని రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది.
ప్రధాని మోదీ సభకు రాజా సింగ్ ఎందుకు రాలేదు? కారణం ఏంటి? అసలేం జరిగింది? ఆయనకు ఆహ్వానం అందలేదా? కావాలనే పక్కన పెట్టారా? వంటి సందేహాలు బీజేపీ శ్రేణుల్లో వ్యక్తమయ్యాయి. అయితే, దీనిపై రాజా సింగ్ స్పందించారు. ఆయన తనకుతానుగానే ఈ సభకు హాజరు కాలేదని తెలిపారు. “ఎల్బీ స్టేడియంలో బీజేపీ ఆధ్వర్యంలోని మోదీ సభను కార్యకర్తలతోసహా టీవీలో చూశాను. నరేంద్ర మోదీ, బీజేపీ బీసీ సభను ఇలా టీవీలో చూడటం నాకు బాధ కలిగించింది. అయితే, ఈ సభకు హాజరుకాకపోవడానికి కారణం ఉంది. బీజేపీ సభ జరిగిన ఎల్బీ స్టేడియం నా నియోజకవర్గంలో ఉంది. ఇప్పటికే ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేశాను. అందువల్ల ఎన్నికల నిబంధనల ప్రకారం ఆ సభలో నేను పాల్గొంటే ఆ సభ ఖర్చు అంతా నా ఖాతాలో రాసే అవకాశం ఉంది.
ఈ అంశంపై పార్టీ నేతలు, కేంద్ర ఎన్నికల కమిషన్‌తో మాట్లాడాను. వారు కూడా అదే చెప్పారు. మా పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా అదే చెప్పారు. అందువల్లే నేనా సభకు హాజరు కాలేదు. కానీ, మా గురువు నరేంద్రమోదీ పాల్గొన్న సభలో నేను పాల్గొనలేకపోవడం చాలా బాధగా ఉంది” అని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. దీంతో ఈ అంశానికి తెరపడినట్లైంది.