YS SHARMILA: పాలేరు నుంచి షర్మిల పోటీ.. నవంబర్ 1 నుంచి జనంలోకి..!
పాలేరులో పోటీకి సంబంధించి ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. నవంబర్ 1 నుంచి పాలేరు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించాలని నిర్ణయించారు. నామినేషన్ వేసేందుకు కూడా ముహూర్తం ఖరారు చేసుకుంది షర్మిల.
YS SHARMILA: వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలంగాణ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయనున్న సంగతి తెలిసిందే. ఆమె ఉమ్మడి ఖమ్మం జిల్లా పాలేరు స్థానం నుంచి పోటీ చేయబోతున్నారు. పాలేరులో పోటీకి సంబంధించి ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. నవంబర్ 1 నుంచి పాలేరు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించాలని నిర్ణయించారు. నామినేషన్ వేసేందుకు కూడా ముహూర్తం ఖరారు చేసుకుంది షర్మిల. నవంబర్ 4న షర్మిల పాలేరు నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేస్తారు.
అనంతరం విస్తృతస్థాయిలో ప్రచారం ప్రారంభిస్తారు. షర్మిల పోటీతో పాలేరులో ఎన్నిక రసవత్తరంగా మారనుంది. అక్కడ సీనియర్ నాయకుడు పొంగులేటి శ్రీనివాస రెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేయడం ఖాయమైంది. ఆయన ఇప్పటికే నియోజకవర్గంలో పర్యటిస్తూ, ప్రచారం నిర్వహిస్తున్నారు. స్థానికుడు కావడంతో అది ఆయనకు కలిసొచ్చే అవకాశం ఉంది. అలాగే బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి పోటీలో ఉన్నారు. ఆయన కోసం కేసీఆర్ ఇప్పటికే ప్రచారం నిర్వహించారు. పాలేరులో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొన్నారు. బీఆర్ఎస్ కూడా ఈ నియోజవకర్గాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీంతో పొంగులేటి, ఉపేందర్ రెడ్డి, షర్మిల మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది. మరోవైపు షర్మిల కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డిపై పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. కానీ, దీనిపై షర్మిల నుంచి ఎలాంటి ప్రకటనా రాలేదు. పైగా ఆమె పాలేరుపైనే దృష్టిపెట్టినట్లు కనిపిస్తోంది.
అక్కడ పోటీ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో పాలేరు మీద ఫోకస్ చేయడమే మంచిదని షర్మిల భావిస్తోంది. దీనిలో భాగంగానే పొంగులేటిపై షర్మిల అనుచరులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. షర్మిల అనుచరుడు పిట్టా రాంరెడ్డి మాట్లాడుతూ.. పొంగులేటి, ఉపేందర్ రెడ్డి.. ఇద్దరూ కాంట్రాక్టర్లే అని, షర్మిల మాత్రం సేవకురాలు అన్నారు. పొంగులేటికి రాజకీయ భిక్ష పెట్టింది వైఎస్సార్ అని గుర్తు చేశారు. మరోవైపు.. షర్మిల తన పార్టీ తరఫున తెలంగాణ వ్యాప్తంగా అభ్యర్థుల్ని బరిలోకి దింపాలి అని భావిస్తోంది. ఇందుకోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది పార్టీ. త్వరలోనే వైఎస్సార్టీపీ తరఫున తెలంగాణలో పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితా వెల్లడయ్యే అవకాశం ఉంది.