ABVP Student Jhansi: ఏబీవీపీ నాయకురాలి జుట్టుపట్టిలాగిన మహిళా కానిస్టేబుల్.. సస్పెన్షన్ వేటు

ఏబీవీపీకి చెందిన మహిళా నాయకురాలు ఝాన్సీని మహిళా కానిస్టేబుళ్లు జుట్టుపట్టుకుని, ఈడ్చుకుంటూ వెళ్లారు. ఝాన్సీతో దురుసుగా, అమానుషంగా ప్రవర్తించారు. ఈ ఘటనలో మహిళా కానిస్టేబుల్‌ను హైదరాబాద్ సీపీ సస్పెండ్ చేశారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 30, 2024 | 03:55 PMLast Updated on: Jan 30, 2024 | 3:55 PM

Abvp Student Jhansi Issue Constable Ayosha Suspeded By Cp

ABVP Student Jhansi: హైదరాబాద్, రాజేంద్రనగర్‌లో ఉన్న ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ భూములకు సంబంధించి, జీవో నెంబర్ 55ను రద్దు చేయాలని విద్యార్థులు నిరసనకు దిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వివిధ విద్యార్థి సంఘాలు నిరసనలో పాల్గొన్నాయి. వారిలో ఏబీవీపీకి చెందిన మహిళా నాయకురాలు ఝాన్సీ కూడా ఉన్నారు. అయితే, ఆమెను మహిళా కానిస్టేబుళ్లు జుట్టుపట్టుకుని, ఈడ్చుకుంటూ వెళ్లారు. ఝాన్సీతో దురుసుగా, అమానుషంగా ప్రవర్తించారు.

Imran Khan: ఇమ్రాన్‌ఖాన్‌కు షాక్.. సైఫర్ కేసులో పదేళ్ల జైలు శిక్ష..

ఈ ఘటనలో మహిళా కానిస్టేబుల్‌ను హైదరాబాద్ సీపీ సస్పెండ్ చేశారు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. యూనివర్సిటీకి సంబంధించిన స్థలాన్ని ఇటీవల ప్రభుత్వం హైకోర్టు నిర్మాణానికి కేటాయిస్తూ, జీవో నెంబర్ 55 విడుదల చేసింది. అయితే, యూనివర్సిటీ భూముల్ని హైకోర్టు కేటాయించడాన్ని విద్యార్థి సంఘాలు తప్పుబట్టాయి. వ్యవసాయ రంగంలో ఎన్నో పరిశోధనలకు కీలకంగా మారిన వర్సిటీ భూముల్ని హైకోర్టుకు కేటాయించడం సరికాదని.. ఇది రాష్ట్రంలోని వ్యవసాయ రంగాన్ని తుంగలో తొక్కి వ్యవసాయ అభివృద్ధికి అడ్డుకట్ట వేయడమే అని విద్యార్థి సంఘాలు అభిప్రాయపడ్డాయి. తెలంగాణలో వ్యవసాయరంగం అభివృద్ధికి ఈ యూనివర్సిటీ ఎంతగానో కృషి చేస్తోంది. అలాంటి యూనివర్సిటీ భూముల్ని ప్రభుత్వం హైకోర్టుకు కేటాయంచడం ఏంటని విద్యార్థులు ప్రశ్నించారు. దీనికి సంబంధించిన జీవోను రద్దు చేసి, వర్సిటీ భూముల్ని కాపాడాలంటూ విద్యార్థులు నిరసనలు చేశారు. ఈ నిరసనల్లో ఏబీవీపీ తరఫున ఝాన్సీ కూడా పాల్గొంది. అయితే, ఆమెపై మహిళా కానిస్టేబుళ్లు దురుసుగా ప్రవర్తించారు.

స్కూటీపై వచ్చిన ఇద్దరు కానిస్టేబుళ్లలో అయేషా అనే కానిస్టేబుల్ ఝాన్సీని జట్టు పట్టుకొని లాగింది. దీంతో ఝాన్సీ కింద పడింది. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. మహిళా నాయకురాలపై పోలీసులు ప్రవర్తించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. బీజేపీ సీనియర్ నేత బండి సంజయ్‌తోపాటు, బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత సహా.. ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. విద్యార్థి సంఘాలు, ఇతర రాజకీయ పక్షాలు కూడా పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై విమర్శలు రావడంతో విచారణ జరిపిన సీపీ.. అయేషాను సస్పెండ్ చేశారు.