జీతం 50వేలు….. ఆస్తి 100 కోట్లు ఈ కమిషనర్ వైభోగం చూస్తే షాక్ అవుతారు..
నిజామాబాద్ మున్సిపల్ రెవెన్యూ విభాగం సూపరింటెండెంట్ నరేందర్ ఇంట్లో భారీగా అక్రమాస్తులు బయటపడ్డాయి. ఆదాయనికి మించిన ఆస్తుల కేసులో 24గంటల పాటు దాడులు చేసి.. ఏకంగా 6కోట్ల 7 లక్షల విలువ చేసే అక్రమాస్తులను గుర్తించారు. ఆదాయానికి మించి అక్రమాస్తులు కలిగి ఉన్నాడనే సమాచారంతో నిజామాబాద్ రేంజ్ ఏసీబీ అధికారులు నరేందర్ ఇంట్లో సోదాలు జరిపారు. ఇంటితో పాటు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం, నిజామాబాద్ కోటగల్లి, నిర్మల్ లోని బంధువుల ఇళ్లలో ఏకకాలంలో దాడులు చేశారు. వినాయక్ నగర్ లోని అశోక టవర్స్ లో గల నరేందర్ నివాసంలో నోట్ల కట్టలు గుట్టలుగా గుర్తించారు. సుమారు రెండు కోట్ల 93 లక్షల నగదును సీజ్ చేశారు. ఆయన భార్య బ్యాంకు అకౌంట్లో కోటి 10 లక్షల నగదు సీజ్ చేశారు. అర కిలోకు పైగా బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. కోటి 98 విలువ చేసే 17 స్థిరాస్తులను గుర్తించినట్లు ఏసీబీ అధికారులు ప్రకటించారు. జిల్లాలో ఈ స్థాయిలో అక్రమాస్తులతో ఉద్యోగి పట్టుబడడం ఇదే మొదటిసారి. తెలంగాణలో 2కోట్ల 83లక్షల నగదు పట్టుబడటం… ఏసీబీ చరిత్రలో ఇదే తొలిసారి అంటున్నారు అదికారులు. నరేందర్‌ను అరెస్ట్ చేసి హైదరాబాద్ తరలించారు.
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో 1999లో కారుణ్య నియామకంలో.. సాధారణ ఉద్యోగిగా విధుల్లో చేరిన నరేందర్.. పాతికేళ్లుగా ఇక్కడే తిష్టవేశాడు. బిల్ కలెక్టర్ స్దాయి నుంచి ఆర్ఐగా… ఇంచార్జి రెవెన్యూ అధికారిగా పదోన్నతులు పొంది… సుదీర్ఘకాలంగా కొనసాగుతున్నారు. 25ఏళ్లుగా నిజామాబాద్ నగరపాలక సంస్ధలో తిష్టవేశారు. ఆస్ది పన్ను మదింపు, ఇంటి నెంబర్లు కేటాయించడం, మ్యుటేషన్లు, ప్రభుత్వ భూములకు ఇంటినెంబర్లు ఇచ్చి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయ్. ఇంటి కొలతలతో పన్ను నిర్ధారించడం లాంటి అంశాల్లో కార్పొరేషన్ కార్యాలయాన్ని అవినీతికి అడ్డాగా మార్చుకున్నారు. ఇద్దరు ప్రైవేట్ బిల్డింగ్ ప్లానర్స్, ఓ ప్రైవేట్ డ్రైవర్‌ను ఏర్పాటు చేసుకుని… వసూళ్ల దందాకు పాల్పడినట్లు బహిరంగంగా చర్చ జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బోధన్ మున్సిపాలిటీకి బదిలీ అయినా.. తన పలుకుబడి ఉపయోగించుకుని బదిలీని రద్దు చేసుకున్నారు. ఆసరా పెన్షన్ల నగదును లబ్దిదారులకు ఇవ్వకుండా… సొంతానికి వాడుకున్నారనే ఆరోపణలపై గతంలో నరేందర్‌ను సస్పెండ్ చేశారు అధికారులు. కొంతకాలం కింద ప్రభుత్వ స్ధలాలకు ఇంటి నెంబర్లు జారీ చేయడంతో… ఆ ఆస్తులకు రిజస్ట్రేషన్లు చేయించినట్లు ఆరోపణలున్నాయి. ఏడాదికాలంగా నిఘా పెట్టి.. పకడ్బందీ సమాచారంతో ఆదాయానికి మించి ఆస్తుల కేసులో దాడులు చేసి.. అరెస్ట్ చేశారు. నరేందర్ అరెస్ట్ కావడంతో ఆయనతో అక్రమ కార్యకలాపాల్లో పాలుపంచుకున్న వారు భయాందోళనకు గురవుతున్నారు. పలు ఏజెన్సీలు, వ్యాపారాల సముదాయాలు, పంట భూములు, ప్లాట్లు బినామీల పేర్లపై ఉన్నట్లు సమాచారం. మహారాష్ట్ర హైదరాబాద్ ప్రాంతాల్లో కోట్ల విలువ చేసే భూములు ఉన్నట్లు ఏసీబీ విచారణలో తేలింది.
నరేందర్ అక్రమాస్తులు కూడబెట్టారని ఓ నేత ఇచ్చిన ఫిర్యాదుతో నిజామాబాద్ వినాయక్ నగర్‌లోని కోటగల్లి, నిర్మల్‌లోని బంధువుల ఇళ్లలో ఏకకాలంలో నాలుగు బృందాలుగా సోదాలు నిర్వహించారు. సోదాల్లో మొత్తం లభించిన ఆస్తులు, నగదు, బంగారం విలువ… ఆరు కోట్లపైనే ఉంటుందని గుర్తించారు. ఇంట్లో నోట్ల కట్టల విలువనే 2కోట్ల 93లక్షలుగా తేలింది. 5వందల నోట్ల కట్టలను లెక్కించడానికి ఏసీబీ అధికారులకు క్యాష్ కౌంటింగ్ మిషన్ వాడాల్సిన పరిస్థితి ఏర్పడింది.. నోట్లను లెక్కించాడానికి సుమారు ఆరు గంటలకు పైగా సమయం పట్టింది. నరేందర్, అతని భార్య, తల్లి పేర్ల మీద ఉన్న స్థిరాస్తులకు సంబంధించి మరింత విచారణ చేయాల్సి ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. మార్కెట్ రేటు ప్రకారమే ఆస్తుల విలువ 6 కోట్ల 7లక్షలని తేలింది. ఐతే బహిరంగ మార్కెట్‌లో దాని విలువ నాలుగింతలు ఉంటుందని సమాచారం. నరేందర్‌కు తెలంగాణతో పాటు మహరాష్ట్రలోని ముంబైలోనూ బంధువుల పేరు మీద బినామీ ఆస్తులు కోట్లలో కూడబెట్టారని ఆరోపణలు ఉన్నాయి. నరేందర్ మున్సిపల్ ఆఫీస్‌లో అన్నీ తానై నడిపిస్తున్నాడని టాక్. ఏ పనికి అయినా ఒక రేటు ఫిక్స్ చేస్తాడట. దగ్గరి వాళ్లు, పరిచయస్తులు, సొంతకాలనీ వాళ్లు అయినా.. వదిలే ప్రసక్తి లేదనే విమర్శలు ఉన్నాయి. ఉన్నతాధికారులకు జనాలకు పొలిటికల్ లీడర్లకు మధ్య అనుసంధాన కర్తగా వ్యవహరించారని బహిరంగ రహస్యం. ఐతే నరేందర్ ఏసీబీ వలకు చిక్కింది చిన్న చేప మాత్రమే అని… పెద్ద అవినీతి తిమింగలాలు ఇంకా ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. ఏ పని కోసం వెళ్లినా 50వేలకు తక్కువ కాకుండా తీసుకోనిదే పనిచేయరట. అందుకే ఈ స్థాయిలో అక్రమ సంపాదన అని చెవులు కొరుక్కుంటున్నారు తోటి సిబ్బంది. మరోవైపు కొందరు రాజకీయ నాయకులకు బాగా దగ్గరగా ఉన్నారని… వారి అండండలతోనే అవినీతికి పాల్పడ్డారని అంటున్నారు. ఈయన బాధితులు వేల మంది ఉన్నారని అంటున్నారు. డబ్బు లేనిదే పని కాదని… తప్పని పరిస్థితుల్లో పనుల కోసం జనాలు ఎంతో కొంత డీల్ కుదుర్చుకోక తప్పదనే పరిస్థితులు ఉన్నాయని అంటున్నారు. మున్సిపల్‌లో ఉన్నతాధికారులు కూడా ఈయనను ముందు పెట్టి కార్యం కానిస్తారు అనే విమర్శలు ఆరోపణలు గుప్పుమంటున్నాయి.