Telangana BRS : తెలంగాణలో అవిశ్వాసల జోరు.. కారుకు షాక్‌ల మీద షాక్‌లు..
తెలంగాణ (Telangana) స్థానిక సంస్థల్లో అనిశ్వాసాల జోరు పెరుగుతున్న వేళ.. తాజాగా పెద్దపల్లి (Peddapalli) , జగిత్యాల జడ్పీల (Jagityala ZP) వ్యవహారం రసవత్తరంగా మారుతోంది. మరో ఆరు నెలలే పదవీ కాలం ఉన్నా.. ఇద్దరు ఛైర్మన్స్‌ని గద్దె దింపే ప్రయత్నాలు ఊపందుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ చేతిలో ఉన్న ఈ రెండు జెడ్పీల్లో సరిపడా బలం ఉన్నా.. ఈ పరిస్థితి రావడానికి సొంత పార్టీ నేతలే కారణమంటున్నారు.
తెలంగాణ (Telangana) స్థానిక సంస్థల్లో అనిశ్వాసాల జోరు పెరుగుతున్న వేళ.. తాజాగా పెద్దపల్లి (Peddapalli) , జగిత్యాల జడ్పీల (Jagityala ZP) వ్యవహారం రసవత్తరంగా మారుతోంది. మరో ఆరు నెలలే పదవీ కాలం ఉన్నా.. ఇద్దరు ఛైర్మన్స్‌ని గద్దె దింపే ప్రయత్నాలు ఊపందుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ చేతిలో ఉన్న ఈ రెండు జెడ్పీల్లో సరిపడా బలం ఉన్నా.. ఈ పరిస్థితి రావడానికి సొంత పార్టీ నేతలే కారణమంటున్నారు. ఇంతకాలం జడ్పీ చైర్మన్‌లపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్న జడ్పీటీసీలు మారిన రాజకీయ పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నట్టు సమాచారం. పెద్దపల్లి జిల్లాపరిషత్ చైర్మన్ పుట్టా మధుపై అవిశ్వాసానికి అంతా రెడీ అయ్యిందన్న వార్తలు కారు పార్టీలో కలకలం రేపుతున్నాయి.
గత ఎన్నికల్లో బీఆర్ఎస్ (BRS) నుంచి 11 మంది జెడ్పీటీసీలు, కాంగ్రెస్ నుంచి ఇద్దరు గెలిచారు. తర్వాత జంపింగ్ జపాంగ్‌లతో బలాబలాలు మారిపోయాయి. ప్రస్తుతం పెద్దపల్లి జెడ్పీలో బలాబలాలను పరిశీలిస్తే.. కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీలకు ఒక్కకొక్కరి చొప్పున, బీఆర్‌ఎస్‌కు పదిమంది సభ్యుల బలం ఉంది. అయినా సరే.. పుట్టా మధుపై అవిశ్వాసం అనగానే పార్టీలకతీతంగా జడ్పీటీసీలు ఏకమయినట్టు ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే డిసెంబర్ 28న జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశానికి, తాజా సర్వసభ్య సమావేశానికి మెజారిటీ సభ్యులు హాజరు కాలేదట. దీంతో పుట్టాకు పదవీ గండం ఖాయమనే నిర్ణయానికి వచ్చేశారట బీఆర్ఎస్ నేతలు. ఆది నుంచి వివాదస్పదంగా ఉన్న పుట్టా మధుకర్ ఒంటెత్తు పోకడలపై అసంతృప్తిగా ఉన్నవారంతా.. అవిశ్వాసం వైపు మొగ్గు చూపడంతో పరిస్థితిని అడ్వాంటేజ్‌గా తీసుకోవాలనుకుంటోందట కాంగ్రెస్. గులాబీ పార్టీ నష్ట నివారణ కోసం మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను రంగంలోకి దింపినా ఫలితం లేదట.
అవిశ్వాసం నోటీసు ఇచ్చేందుకు రంగం సిద్ధమవుతోందని, పెద్దపల్లిలో మెజార్టీ జడ్పీటీసీలు అందరు రెడీగా ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. సరిగ్గా ఇలాంటి పరిస్థితే జగిత్యాలలోనూ ఉందట. జడ్పీ ఛైర్‌పర్సన్ దావ వసంత దంపతులపై అసంతృప్తిగా ఉన్న సొంత పార్టీ సభ్యులే అవిశ్వాసానికి రెడీ అవుతున్నట్టు తెలిసింది. జడ్పీటీసీలకు వర్క్, ప్రోటోకాల్ విషయంలో వసంత దంపతులు ఒంటెద్దు పోకడలతో వ్యవహరించారట. దీనిపై ఎమ్మెల్సీ కవిత, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌కు చాలాసార్లు ఫిర్యాదులు చేశారట జడ్పీటీసీలు. అయినా తీరు మారకపోవడంతో ఇప్పుడు రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా అసంతృప్తులంతా ఏకమైనట్టు తెలిసింది. వారికి బీఆర్‌ఎస్‌లోని ఓ వర్గంతో పాటు కాంగ్రెస్ సహకరిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.
నారాజ్‌గా ఉన్న నేతలు ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి టచ్‌లోకి వెళ్లినట్టు తెలిసింది. ధర్మపురి నియోజకవర్గానికి చెందిన సొంత జడ్పీటీసీ ఒకరు అవిశ్వాసం నోటీసు వ్యవహారాలను డీల్ చేస్తున్నట్టు తెలిసింది. ప్రెస్టీజ్ ఇష్యూగా తీసుకుని ఆయన జెడ్పీటీసీలను ఏకం చేసేపనిలో ఉన్నట్టు తెలిసింది. ఆర్థికంగా పటిష్ట స్థితిలో ఉన్న ఆయనకు కాంగ్రెస్ అండ లభించడంతో జెట్ స్పీడ్‌లో ముందుకెళ్తున్నట్టు చెబుతున్నారు సన్నిహితులు. కొంతకాలంగా దావ వసంత.. జిల్లాలో సీనియర్లను పట్టించుకోకుండా వారి ఎమ్మెల్యే సీట్లకే ఎసరు పెట్టే విధంగా ప్రయత్నించారన్నది ప్రధాన అభియోగం. మొత్తం 18మంది జడ్పీటీసీలకుగాను ఒకరు రాజీనామా చేయగా ప్రస్తుతం 17మంది ఉన్నారు.
వీరిలో 16మంది బీఆర్‌ఎస్ పార్టీకి చెందినవారే ఉండగా, ఒక్కరు కాంగ్రెస్ సభ్యుడు. అయితే వసంతకు వ్యతిరేకంగా ప్రస్తుతం పది మంది నోటీస్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారట. ఎంత ఖర్చయినా పర్లేదు.. ప్రయత్నం మాత్రం ఆపే పనేలేదంటున్నారట ఓ బీఆర్‌ఎస్ జడ్పీటీసీ. ఈ పరిస్థితులకు అధికార పార్టీ నేతల సహకారం ఉండటంతో అసమ్మతి బలం 12కు చేరినట్టు తెలిసింది. ఇదే జరిగితే జగిత్యాల జడ్పీలో అవిశ్వాసం పక్కా అనే ప్రచారం సాగుతోంది. మొత్తంగా ఇద్దరు జెడ్పీ ఛైర్మన్స్ సీట్లు షేకవుతున్నాయంటున్నారు పరిశీలకులు. ఒంటెద్దు పోకడలతో ఇన్నాళ్ళు విసిగిపోయినా ఏమీ చేయలేక కామన్‌గా ఉన్నవారు రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగాక సొంత పార్టీ అయినా సరే…సై అంటుుండటంతో రాజకీయం రసవత్తరంగా మారుతోంది.