తల్లి అంత్యక్రియల కోసం భిక్షాటన.. ఎంత కష్టమొచ్చె బిడ్డా..

నాన్న లేడు.. అమ్మ కళ్ల ముందే చనిపోయింది. అంత్యక్రియలకు కూడా డబ్బులు లేవు. ఏం చేయాలో తెలియదు.. ఎవరి అడగాలో అర్థం కాదు. పట్టించుకునే వారు లేరు.. సాయం చేసే మనసు ఒక్కటీ లేదు. ఏ బిడ్డకు రాకూడని కష్టం.. ఏ పసితనం మోయలేని విషాదం.. నిర్మల్ జిల్లాలో జరిగిన ఈ ఘటన.. పండగ పూట, రాఖీ సాక్షిగా కన్నీళ్లు పెట్టిస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 19, 2024 | 01:05 PMLast Updated on: Aug 19, 2024 | 1:05 PM

Begging For Mothers Last Rites What A Difficult Child

నాన్న లేడు.. అమ్మ కళ్ల ముందే చనిపోయింది. అంత్యక్రియలకు కూడా డబ్బులు లేవు. ఏం చేయాలో తెలియదు.. ఎవరి అడగాలో అర్థం కాదు. పట్టించుకునే వారు లేరు.. సాయం చేసే మనసు ఒక్కటీ లేదు. ఏ బిడ్డకు రాకూడని కష్టం.. ఏ పసితనం మోయలేని విషాదం.. నిర్మల్ జిల్లాలో జరిగిన ఈ ఘటన.. పండగ పూట, రాఖీ సాక్షిగా కన్నీళ్లు పెట్టిస్తోంది. తల్లి అంత్యక్రియలు జరిపించేందుకు.. ఆ చిన్నారు భిక్షాటన చేసింది. శవం ముందు దుప్పటి వేసి రూపాయి రూపాయి అడుక్కోవడం మొదలుపెట్టింది. ఈ ఘటన నెటిజన్లను కదిలించింది. సాయం అందించేలా చేసింది. నిర్మల్ జిల్లా తానూర్ మండలం బేల్‌తరోడ గ్రామంలో ఈ గుండెలు పిండే విషాద ఘటన చోటుచేసుకుంది. దుర్గ తల్లి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

తల్లిని విగతజీవిగా చూసిన ఆ కూతురుకి… ఏం చేయాలో అర్థంకాని పరిస్థితి. తల్లి మృతదేహం దగ్గర సాయం కోసం దీనంగా ఎదురుచూసింది. బంధువులు లేరు.. నా అనేవాళ్లు ఎవరూ లేరు. దీంతో తల్లి మృతదేహం పక్కన కూర్చుని బోరున ఏడుస్తుంది ఆ చిన్నారి. చుట్టుపక్కల వారు వచ్చి అంత్యక్రియలు ఎవరు చేస్తారు… ఖర్చులు ఎవరు భరిస్తారు అని అంటుంటే ఆ మాటలు విన్న చిన్నారి.. భిక్షాటన మొదలుపెట్టింది. ఇంటి ముందు ఓ దుప్పటిని పరిచి అంత్యక్రియలకు సహాయం చేయాలను కోరుకుంటూ దీనస్థితిలో కూర్చున్న ఆ బాలికను చూసి.. అక్కడున్న వారందరికి కన్నీరు తెప్పించింది.

ఆత్మహత్య కావడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ కోసం వచ్చి పాప పరిస్థితి చూసి ఆర్థిక సాయం అందించారు. కొంతమంది సోషల్ మీడియా ద్వారా స్పందించి చిన్నారికి ఆర్థిక సాయం చేశారు. ఈ విషయం కలెక్టర్‌ వరకు చేరింది. నిర్మల్ జిల్లా కలెక్టర్‌ దుర్గతో వీడియో కాల్ మాట్లాడి ధైర్యం చెప్పారు. విద్యా, వసతి కల్పిస్తామని హామీ ఇచ్చారు కలెక్టర్‌. అటు స్థానికంగా రాజకీయ పార్టీల నేతలు కూడా తలా ఇంత సాయం చేయడం మొదలుపెట్టారు. పండగ సాక్షిగా ఈ విషాదం.. చాలా ప్రశ్నలు సంధించింది. సాటి మనిషి కష్టం మనది కాదు అనుకునేది సమాజం ఎలా అవుతుంది. ఈ చిన్నారి కన్నీళ్లు కనిపించలేదా.. ఏడుపు వినిపించలేదా.. మానవత్వానికి ఇది మచ్చే అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయ్. ఆ తల్లి అంత్యక్రియలు జరిగాయ్. మంటల్లో కాలింది ఆ తల్లి దేహమే కాదు.. మానవత్వం కూడా అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.