BRS CROSS VOTING :బీఆర్ఎస్ అమ్ముడుపోయిందా ? కవిత కోసం త్యాగం చేసిందా !

లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ మూడో స్థానానికి పడిపోవడంపై ఇప్పుడు అనుమానాలు తలెత్తుతున్నాయి. అహంకారంతో విర్రవీగిన ఆ పార్టీ నేతలను జనం కసితో మళ్లీ ఓడించారా... లేకపోతే తమ ఓట్లను బీజేపీకి బదిలీ చేయించిందా అన్న డౌట్స్ వస్తున్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 5, 2024 | 04:23 PMLast Updated on: Jun 05, 2024 | 4:23 PM

Brs Cross Voting బీఆర్ఎస్ అమ్ముడుపోయిం

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి అధికారం కోల్పోయిన ఆ పార్టీకి జనం మరో షాక్ ఇచ్చారు. ఎంత దారుణం అంటే… రాష్ట్రంలో ఒక్క ఎంపీ సీటు కూడా గెలవని గులాబీ పార్టీ.. 14 చోట్ల మూడో స్థానంలో నిలిచింది. రెండు చోట్ల మాత్రమే రెండో స్థానం దక్కింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే… ఈసారి 51 లక్షల ఓట్లను కోల్పోయింది. ఏడు సీట్లల్లో BRS అభ్యర్థులకు డిపాజిట్లు గల్లంతు అయ్యాయి. 10యేళ్ళపాటు ఓ వెలుగు వెలిగిన బీఆర్ఎస్ ప్రస్తుతం దయనీయ పరిస్థితుల్లో ఉంది. ఈసారి లోక్ సభలో కనీసం ప్రాతినిధ్యం కూడా లేకుండా పోయింది.
ఉద్యమ సమయం నుంచి ఎంతో పట్టున్న మెదక్ పార్లమెంటు సీటులోనూ కారు పార్టీ బోల్తా పడింది. ఇక్కడ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు గెలిచారు. ఈ పార్లమెంట్ సీటు పరిధిలో గజ్వేల్ నుంచి కేసీఆర్, సిద్ధిపేటలో హరీశ్ రావు సహా ఆరు చోట్ల brs ఎమ్మెల్యేలు ఉన్నా … పార్టీ మూడో స్థానంలో నిలిచింది. మల్కాజ్ గిరి పార్లమెంట్ పరిధిలో అందరూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నా ఇక్కడా brsకు థర్డ్ ప్లేసే దక్కింది.
లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ మూడో స్థానానికి పడిపోవడంపై ఇప్పుడు అనుమానాలు తలెత్తుతున్నాయి. అహంకారంతో విర్రవీగిన ఆ పార్టీ నేతలను జనం కసితో మళ్లీ ఓడించారా… లేకపోతే తమ ఓట్లను బీజేపీకి బదిలీ చేయించిందా అన్న డౌట్స్ వస్తున్నాయి. బీజేపీని గెలిపించేందుకు బీఆర్ఎస్ నేతలు ఆత్మబలిదానం చేసుకొని అవయవ దానం చేశారంటూ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీ గెలిచిన 7 సీట్లల్లో బీఆర్ఎస్ డిపాజిట్లు కోల్పోవడంపై అనుమానం వ్యక్తం చేశారు. సిద్ధిపేటలో హరీష్ రావు పూర్తిగా తన ఓట్లను బీజేపీకి బదిలీ చేశారని ఆరోపించారు రేవంత్ రెడ్డి. వెంకట్రామిరెడ్డిని నమ్మించి మోసం చేసి… రఘునందన్ రావుని గెలిపించారని అన్నారు.

బీజేపీకి గులాబీ పార్టీ ఓట్ల బదలాయింపు చేసిందని మిత్రపక్షమైన MIM కూడా ఆరోపిస్తోంది. బీజేపీకి బహిరంగంగా మద్దతు తెలిపి బీఆర్ఎస్ తప్పుడు వ్యూహం ఎంచుకుందన్నారు MIM ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. బీజేపీకి అండగా ఉండి… తనకు తాను ఓడిపోయిందని మండిపడ్డారు. ఇలాగైతే ఆ పార్టీ నాశనమైపోతుందన్నారు ఓవైసీ. అయితే బీజేపీకి తమ ఓట్లను కేసీఆరే బదిలీ చేయించారా… అందుకోసం కవితను రిలీజ్ చేస్తామని బీజేపీ హామీ ఇచ్చిందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. రేవంత్, ఓవైసీ ఆరోపణల తర్వాత ఈ అనుమానాలు మరింత బలపడుతున్నాయి. దీనికి కేసీఆర్ ఏం చెబుతారన్నది చూడాలి.