Cyber Crime cheatings: రోజుకి 3 కోట్లు కొట్టేశారు ! కొత్త ఏడాదిలో జాగ్రత్త భయ్యా !

రోజుకు 3కోట్ల రూపాయలు... గత 8 నెలల్లో 707 కోట్ల రూపాయలను కొట్టేశారు సైబర్ మాయగాళ్ళు.  తెలంగాణ జనం దగ్గర అందినంత దోచుకున్నారు.  2023లో మొత్తం 16 వేలకు పైగా సైబర్ నేరాలు జరిగితే... ఇందులో 15 వేల దాకా ఆర్థిక మోసాలే ఉన్నాయి.  రోజుకో ప్లాన్ తో చదువుకున్నవారు... చదువులేని వాళ్ళని.... అందర్నీ నిలువునా ముంచేశారు కేటుగాళ్ళు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 1, 2024 | 01:41 PMLast Updated on: Jan 01, 2024 | 1:42 PM

Cyber Crime Cheatings

2023లో సైబర్ నేరగాళ్ళ బారిన పడి 700 కోట్ల రూపాయలను పోగొట్టుకున్నారు తెలంగాణ జనం. దేశంలో నమోదవుతున్న సైబర్ నేరాల్లో 40శాతానికి పైగా ఇక్కడే ఉన్నాయి.  టాస్క్ లు చేయమని, పెట్టుబడులు పెట్టమని, వీడియోలు చేస్తే డబ్బులు, ఇంట్లో నుంచే పార్ట్ టైమ్ ఉద్యోగాలు, కార్డులు అప్ డేట్, లోన్ యాప్స్ ఇలా ఐదారు రకాలుగా జనాన్ని మభ్యపెడుతున్నట్టు టెక్ నిపుణులు చెబుతున్నారు.  తాము పంపిన వీడియోలు చూసి… రేటింగ్ ఇస్తే డబ్బులు సంపాదించవచ్చని మోసం చేస్తున్నారు కొందరు కేటుగాళ్ళు.  ముందుగా వెయ్యి రూపాయలు పెట్టుబడి పెట్టించుకొని… ఆ టాస్క్ పూర్తి చేస్తే 866 రూపాయలు లాభంగా ఇస్తున్నారు.  అదే మోజులో లక్షల్లో ఇన్వెస్ట్ చేసి దారుణంగా మోసపోతున్నారు కొందరు.  చిక్కడపల్లికి చెందిన ఓ వ్యక్తి నుంచి ఇలా 28 లక్షలు కొట్టేశారు సైబర్ క్రిమినల్స్.

ఫెడెక్స్ లేదా ఇతర కొరియర్ సర్వీస్ పేర్లతోనూ మోసాలు జరుగుతున్నాయి.  మీ పేరుతో విదేశాలకు మాదక ద్రవ్యాలు పార్శిల్స్ పంపుతున్నారని మొదట కాల్ చేస్తున్నారు. ఆ తర్వాత కస్టమ్స్, ముంబై పోలీసులం అంటూ వేరే వాళ్ళు ఎంటర్ అవుతారు. మీ మీద ముంబైలో కేసు బుక్ అయిందని బెదిరిస్తున్నారు. మొదట వేల రూపాయల నుంచి లక్షల దాకా వసూలు చేస్తున్నారు.  వాహనాలు లేదా ఏవైనా వస్తువులను తక్కువ రేటుకు అమ్ముతామని ప్రకటనలు ఇస్తున్నారు ఇంకొదరు సైబర్ కేటుగాళ్ళు.  రవాణా ఛార్జీలు పంపితే… మీకు ఆ వస్తువు ఇస్తామని వందల నుంచి వేలు, లక్షల దాకా కొట్టేస్తున్నారు.  ఇలాంటి మోసాలు ఎక్కువగా రాజస్థాన్ లోని భరత్ పూర్ జిల్లాకు చెందిన క్రిమినల్స్ చేస్తున్నట్టు పోలీసులు చెబుతున్నారు.

Liquor Sales New Year 2024:  తెగ తాగేశారు భయ్యా ! 3 రోజుల్లో 700 కోట్ల మద్యం సేల్స్

డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ అప్ డేట్ చేసుకోవాలి… లేకపోతే బ్లాక్ అవుతుందని చీట్ చేస్తున్నారు మరికొందరు.  లింకులు పంపి దాన్ని కస్టమర్ యాక్సెప్ట్ చేస్తే…మాల్ వేర్ పంపి బ్యాంకు ఖాతాలన్నీ ఖాళీ చేస్తున్నారు. లోన్ యాప్స్ అయితే మరీ దారుణం.  రిజర్వ్ బ్యాంక్ ఎన్ని యాప్స్ నిషేధించినా… గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించినా… రోజు రోజుకీ వేరే వేరే పేర్లతో లోన్ యాప్స్ పుట్టుకొస్తూనే ఉన్నాయి.  అధిక వడ్డీలు వేస్తూ… అమౌంట్ మొత్తం కట్టినా… ఇంకా ఇంకా బాకీ చూపిస్తూ వినియోగదారులను వేధిస్తున్నారు.  పైగా కస్టమర్ ఫ్రెండ్స్, బంధువుల కాంటాక్ట్ నెంబర్లకు కాల్ చేసి … తప్పుడు ప్రచారం చేస్తున్నారు.  కస్టమర్ కుటుంబ సభ్యులు ఫోటోలను మార్ఫింగ్ చేసి నగ్నచిత్రాలుగా మారుస్తూ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఈ లోన్ యాప్స్ నిర్వాహకుల వేధింపులు భరించలేక చాలామంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు.

మనం ఎంత కష్టపడి ఉద్యోగాలు చేసుకొని… కూలీ నాలీ చేసుకొని సంపాదించిన డబ్బులను మాయ మాటలు చెప్పి ఈజీగా కొల్లగొడుతున్నారు సైబర్ నేరగాళ్ళు. ఏ పనీ చేయకుండా ఇలా మోసాలతోనే రోజుకి 3 కోట్ల దాకా సైబర్ క్రిమినల్స్ సంపాదిస్తున్నారు. అందుకే మీకు ఎవరైనా కాల్ చేసి… ఆఫర్ ప్రకటిస్తే … నమ్మొద్దని పోలీసులు చెబుతున్నారు.